
మీకు తెలుసా?
రాయలసీమలోని గిరి దుర్గాలలో అత్యంత ప్రాచీన, చారిత్రాత్మకమైనది గుత్తి దుర్గం. సీమ పౌరుషానికి చిరునామాగా ఉన్న గుత్తికోటను సముద్ర మట్టానికి 640 మీటర్ల ఎత్తున కట్టారు. అత్యంత ప్రాచీన చరిత్రను సొంతం చేసుకున్న ఈ కోట వైభవం 18వ శతాబ్దంలో రాజకీయంగా, సంస్కృతి పరంగా శిఖరాగ్రానికి చేరుకుంది. విజయనగర పాలనలో ఎనలేని ప్రాధాన్యం సంతరించుకుంది. మౌర్యుల మొదలు ఆంగ్లేయుల వరకూ ఎందరో పాలనలను చవిచూచిన చారిత్రాత్మక దుర్గమిది. ఇక కోట నిర్మాణం విషయంగా చూస్తే 303 మీటర్ల ఎత్తు ఉన్న కొండపైన మూడు వైపులా ఉన్న గుట్టలను కలుపుకుని సుమారు 25 హెక్టార్ల విస్తీర్ణంలో శంఖాకృతిలో నిర్మితమై నాటి రాజసాన్ని నేటికీ చూపుతోంది.
కోట చుట్టూ ఐదు మీటర్ల ఎత్తు, రెండున్నర మీటర్ల వెడల్పుతో బలమైన రాతి కట్టడాలను కలిగి ఉంది. కోట లోపలకు వెళ్లగానే 15 ఉప కోట కట్టడాలు ఉన్నాయి. ఒక్కొక్క కోటకు ఒక ముఖద్వారం ప్రకారం మొత్తం 15 ముఖద్వారాలు ఉన్నాయి. కోటకు వెలుపల రెండు కొండలను కలుపుతూ పెద్ద కందకం ఉండేది. ప్రస్తుతం అది కోనేరుగా మారింది. కోట పైభాగాన్ని చేరాలంటే ఈ 15 ముఖద్వారాలను దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. మరో మార్గం అంటూ ఏదీ లేదు. కోట లోపల 101 బావులు, గజ, అశ్వ, వ్యాయామ శాలలు, రంగమంటపం, నీటి కొలనులు, చీకటి గదలు, సొరంగాలు, ఆలయాలు, ఆట స్థలాలు లెక్కకు మించి ఉన్నాయి. కోటలోపల మహల్‌ల నిర్మాణంలో కర్రముక్క అనేది లేకుండా కమాన్లు తీర్చి ఇటుక, సున్నం, బెల్లం ఉపయోగించారు. క్రీస్తు పూర్వం 220 నాటి మౌర్యుల నుంచి క్రీస్తు శకం 1947 నాటి బ్రిటీష్ పాలకుల వరకు మొత్తం 22 రాజవంశాల రాజకీయ ప్రజ్ఞా ప్రదర్శనకు వేదికగా గుత్తి దుర్గం నిలిచింది. ప్రపంచ చరిత్రలో తన దైన స్థానాన్ని పొందిన అశోక చక్రవర్తి, విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయల పాలనను కూడా ఈ దుర్గం చవి చూసిందంటే ఈ కోట ప్రాశస్త్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవర్చు.
- గుత్తి
క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకం వరకు గుత్తి కోటను పాలించిన వారి వివరాలు ఇలా..
పాలనా కాలం రాజ వంశం
క్రీ.పూ 220–213 మౌర్యులు, శాతవాహనులు
క్రీ.శ 230–234 చూటకూళులు
క్రీ.శ 234–575 కంచి పల్లవులు
క్రీ.శ 610–853 బాదామి చాళుక్యులు
క్రీ.శ 940–950 రాష్ట్రకూటులు
క్రీ.శ 973–1064 గంగవంశపు రాజులు
క్రీ.శ 1069–1070 చోళులు
క్రీ.శ 1070–1190 పశ్చిమ చాళుక్యులు
క్రీ.శ 1190–1327 హోయసళలు
క్రీ.శ 1327–1328 దేవగిరి యాదవులు
క్రీ.శ 1330–1565 విజయనగర రాజులు
క్రీ.శ 1565–1587 గోల్కొండ నవాబులు
క్రీ.శ 1687–1710 మొగలాయిలు
క్రీ.శ 1710–1713 కడప నవాబులు
క్రీ.శ 1713–1724 డక్కన్ సుబేదారులు
క్రీ.శ 1724–1730 ఆసఫ్ నిజాం
క్రీ.శ 1731–1734 పాలెగాండ్లు
క్రీ.శ 1735–1773 మహారాష్ట్ర పాలకులు
క్రీ.శ 1773–1792 టిప్పు సుల్తాన్
క్రీ.శ 1792–1800 నైజాం నవాబులు
క్రీ.శ 1800–1947 ఆంగ్లేయులు