గోశాల షాపుల ‘గలీజు’
గోశాల షాపుల ‘గలీజు’
Published Sat, Aug 5 2017 11:29 PM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM
రూ. 15.72 లక్షలు గోల్‌మాల్
కమిటీ రద్దయినా నేటికీ దందా కొనసాగిస్తున్న సభ్యులు
సభ్యులే బినామీల పేరుతో షాపుల కైవసం
నెల అద్దె రూ 6500, కట్టేది రూ.1000
కాకినాడ రూరల్ : కాకినాడ జంతుహింస నివారణ సంఘంలో గో సంరక్షణ పేరుతో రూ. లక్షలకు లక్షలు దోచేశారు. గోవులపై వ్యాపారం చేస్తున్నారని, కమిటీని పూర్తిస్థాయిలో రద్దు చేసి, వారిపై విచారణ చేస్తే అసలు విషయం బయటకు వస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం నేడు నిజమైంది. శనివారం సాయంత్రం ఆర్డీవో ఎల్.రఘుబాబు అధ్యక్షతన షాపుల లీజుదారుల సమావేశంలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. షాపు యజమానులు చెప్పే వివరణలు విన్న అధికారులు షాకయ్యారు. తాము ఒక్కొక్క షాపునకు నెలకు రూ. 6,500 చొప్పున పది నెలలు అడ్వాన్సుగా రూ. ఒక్కొక్కరు రూ. 65,000, నెలకు రూ. 6,500 చొప్పున అద్దె చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు. అధికారులు రికార్డులను పరిశీలించగా ఒక్కొక్క షాపునకు నెలకు కేవలం రూ. వెయ్యి వంతున మాత్రమే చెల్లించినట్టు నిర్ధారణ కావడంతో ఆశ్చర్యపోవడం అధికారుల వంతయ్యింది. దాదాపుగా లీజుల పేరుతో రూ. 15.72 లక్షలు గోల్‌మాల్ అయ్యిందని అధికారులు గుర్తించారు. లీజు పేరు రద్దయిన కమిటీ సభ్యులు షాపుల యజమానులపై దందాలు కొనసాగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. గత కమిటీలో ఎవరైనా షాపు యజమానులను బెదిరించి లీజు రూపంలో డబ్బులు వసూలు చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆర్డీవో రఘుబాబు హెచ్చరించారు. ఇటీవల గోవులు మృత్యువాత సంఘటన నేపథ్యంలో కలెక్టర్ కార్తికేయమిశ్రా పాత కమిటీని రద్దు చేసి కొత్తగా కమిటీ చైర్మన్‌గా ఆర్డీవో ఎల్ రఘుబాబును నియమించిన సంగతి తెలిసిందే. గో సంరక్షణకు వీలుగా చర్యలు తీసుకునే భాగంగా ఆర్డీవో షాపులను లీజులకు తీసుకున్న లీజుల గో సంరక్షణకు నిధులు పేరుతో 12 షాపులతో ప్రత్యేక షాపింగ్ కాంప్లెక్‌ను నిర్మించారు. గో సంరక్షణ ఎలా ఉన్నా, దానిపై పెత్తనం చెలాయించే నాయకులకు మాత్రం ఈ కాంప్లెక్ బంగారు బాతుగా మారింది. నిబంధనలకు అనుగుణంగా కమిటీ సభ్యులే షాపులను వ్యాపారాలకు తీసుకొని, మళ్లీ బినామీల పేరుతో మరొకరు వ్యాపారం చేసుకునేందుకు ఇచ్చేశారు. వారి నుంచి పదిరెట్లు డబ్బులు వసూలు చేసి దోచేశారు. గోవుల మృత్యుఘోష సమయంలో ప్రజలు నుంచి కమిటీపై దుమారం వచ్చినా అధికారులు పెద్దగా స్పందించలేదు. తరువాత కలెక్టర్ మిశ్రా స్వయంగా జంతు హింస నివారణ సంఘాన్ని పరిశీలించి కమిటీ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో 13 మంది సభ్యులపై సర్పవరం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. వారు చేసిన అరాచకాలు ఒక్కొక్కటి బయటకు రావడంతో అధికారులు ఆశ్చర్యపోతున్నారు. వీరి నుంచి షాపులు లీజు రూపంలో దోచేసిన సొమ్మును రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తామని ఆర్డీవో రఘుబాబు స్పష్టం చేశారు.
గోవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
ప్రస్తుతం జంతు హింస నివారణ సంఘంలో 123 గోవులు ఉన్నాయని, వీటిలో రెండు పశువులు నీర్సంగా ఉండడంతో వైద్యం అందిస్తున్నట్లు ఆర్డీవో రఘుబాబు వివరించారు. ఎవరైనా పశువులకు దానా రూపంలోనే విరాళాలు అందజేయాలని సూచించారు. ఎవరు ఏమీ ఇచ్చినా వాటికి సంబంధించి రశీదు పొందాలన్నారు. ప్రస్తుతం ఉన్న గోవుల సంరక్షణకు వీలుగా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. షాపులకు సంబంధించిన లీజులను కూడా పెంచే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. ఇకపై గతంలో లీజులు తీసుకున్న వారిని తొలగిస్తామని, నేరుగా షాపు యజమానులకే లీజు కేటాయించి, ఆ సొమ్ములను నెల, నెలా జంతుహింస నివారణ సంఘం పేరుతో ఏర్పాటు చేసిన బ్యాంకు ఖాతాకు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆర్డీవో రఘుబాబు స్పష్టం చేశారు. పశుసంవర్ధకశాఖ జేడీ వెంకటేశ్వరరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement