బాలలు కిలకిలలాడే చోట.. గ్లాసుల గలగలలా?
బాలలు కిలకిలలాడే చోట.. గ్లాసుల గలగలలా?
Published Wed, Jul 5 2017 11:14 PM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM
-నివాసప్రాంతాల్లో నిషా అంగళ్లా?
–ససేమిరా సహించబోమంటున్న జనం
–జిల్లావ్యాప్తంగా ఐదో రోజూ కొనసాగిన ఆందోళనలు
–ఉద్యమించిన మహిళలను అరెస్టు చేసిన కరప పోలీసులు
–కామనగరువులో బ్రాందీషాపును ముట్టడించిన విద్యార్థులు
–దుకాణాల ఏర్పాటుకు అనువుగా ఎండీఆర్ రోడ్లుగా రాష్ట్ర రహదారుల మార్పు
–ఈ పరిణామంతో జనం మరింత భగ్గుమనే అవకాశం
సాక్షి, రాజమహేంద్రవరం : పిల్లాపాపల కిలకిలలు ప్రతిధ్వనించే తావుల్లో మందుగ్లాసుల గలగలలను సహించబోమన్న జనాగ్రహం రగులుతూనే ఉంది. ముంగిళ్లలో ముగ్గులు, లోగిళ్లలో మర్యాదమన్ననలకు పెద్దపీట వేసే మనుషులు ఉండే నివాసప్రాంతాల్లో నిషా దుకాణాలు ఏర్పాటు చేసే అనాగరిక వ్యాపార వైఖరిపై నిరసన గళం మార్మోగుతూనే ఉంది. బడి, గుడి గంటల సవ్వడి గాలిలో తేలివచ్చే చోట తాగుబోతుల ప్రేలాపలను ఎంత మాత్రం వినబోమన్న సమరభేరితో దిక్కులు దద్దరిల్లుతూనే ఉన్నాయి.
ఇళ్ల మధ్య, గుడులు, బడుల చేరువలో మద్యం దుకాణాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ జనం రోడ్లెక్కుతూనే ఉన్నారు. కొత్త మద్యం పాలసీ (2017–19) ఈ నెల ఒకటి నుంచి అమలులోకి వచ్చిన నేపథ్యంలో కొత్తగా వేలంలో పాడుకున్న వారు మద్యం దుకాణాల ఏర్పాటుకు సంసిద్ధులయ్యారు. అయితే జనావాసాల మధ్య ఏర్పాటు చేయవద్దని తొలిరోజు నుంచీ జిల్లాలో పలుచోట్ల స్థానికులు ముఖ్యంగా మíßహిళలు, యువకులు, ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నారు. జిల్లాలో 545 దుకాణాల ఏర్పాటుకు అవకాశం ఉండగా ఈసారి 534 దుకాణాలు లాటరీలో వ్యాపారులకు కేటాయించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ జిల్లాలో 175 దుకాణాలు ఏర్పాటు చేశారు. వీటిలో ఇళ్ల మధ్య, పాఠశాలలు, దేవాలయాలకు సమీపంలో ఉన్న దుకాణాలను తొలగించాలంటూ తీవ్రస్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. బుధవారం రాజమహేంద్రవరంలోని జాంపేట మార్కెట్ ఎదురుగా ఇళ్ల మధ్యలో, మసీదుకు సమీపంలో ఉన్న మద్యం దుకాణాన్ని తొలగించాలని 31వ డివిజన్ కార్పొరేటర్ మజ్టి నూకరత్నం, బీసీ సంఘం పట్టణ అధ్యక్షుడు మజ్జి అప్పారావు, ముస్లిం నేత మున్నా మహిళలు, స్థానికులతో కలసి ఆందోళన చేపట్టారు. నాలుగు రోజుల్లో దుకాణాన్ని తొలగిస్తామని ఎక్సైజ్ సీఐ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఏవీ అప్పారావు రోడ్డులో ఇళ్ల మధ్య దుకాణం ఏర్పాటును వ్యతిరేకిస్తున్న మహిళలు బుధవారం కూడా నిరసనను కొనసాగించారు. అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లిలో మద్యం షాపు ఏర్పాటుతో గ్రామ మహిళలు, స్థానికులు దుకాణం ఎదుట ఆందోళన చేశారు. ఆలమూరులో మద్యం దుకాణం తొలగించాలని డిమాండ్ చేస్తూ మహిళలు, గ్రామస్తులు ధర్నా చేశారు. అమలాపురం రూరల్ మండలం కామనగరువులోని ఓ ప్రైవేటు పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన దుకాణాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు ముట్టడించి, తొలగించాలని పట్టుబట్టారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
కాకినాడ పోలీస్‌స్టేషన్‌కు వీరలక్ష్మి తదితరులు
కరప మండలం వేళంగిలో మద్యం దుకాణం ఏర్పాటు చేయొద్దంటూ స్థానికులు చేస్తున్న ఆందోళనలను పెడచెవిన పెట్టి మంగళవారం దుకాణం ఏర్పాటు చేశారు. దీంతో గ్రామ మహిళలు, సీఐటీయూ జిల్లా సెక్రటరీ ఎం.వీరలక్ష్మి తదితరులు మంగళవారం రాత్రి వరకు తీవ్రస్థాయిలో ఆందోళన చేశారు. పోలీసులు వీరలక్ష్మిని, మరో ముగ్గురు మహిళలను అరెస్టు చేసి కరప పోలీస్ స్టేషన్‌కు తరలిచారు. గ్రామస్తులు స్టేషన్ వద్ద ధర్నా చేయడంతో ఉద్రిక్త పరిస్థితుల నడుమ అరెస్ట్ చేసిన వారిని కాకినాడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దుకాణం 20 రోజుల్లో తొలగిస్తామని పెద్దల సమక్షంలో దుకాణ యజమానులు అంగీకరించడంతో నిరసన విరమించారు. పిఠాపురం మండలం కందరాడ రాజీవ్‌కాలనీ రోడ్డులో మద్యం షాపు ఏర్పాటు చేయవద్దని ఆ ప్రాంత మహిళలు ఆందోళనకు దిగారు. పిఠాపురం రూరల్ ఎస్సై వి.కోటేశ్వరరావుతో వాగ్వివాదానికి దిగారు. అనంతరం ఎక్సైజ్ సీఐ కార్యాలయానికి వెళ్లి నిరసన తెలిపారు.
ఆది నుంచీ ఆగ్రహాగ్నే..
ఇళ్ల మధ్య దుకాణాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఈ నెల ఒకటి నుంచి జిల్లాలో పలు చోట్ల స్థానికులు ఆందోళనలు చేస్తున్నారు. ముమ్మిడివరం బాలయోగి తపోవనం చేరువలో మద్యం షాపును తొలగించాలంటూ ఆందోళనలు చేశారు. మామిడికుదురు మండలం పాశర్లపూడి బొమ్మిడిపాలంలో, అంబాజీపేట మండలం ఇరుసుమండ గ్రామాల్లో మద్యం దుకాణాలు తీసేయాలని గ్రామస్తులు ఆందోళనలు చేశారు. ఆలమూరు మండలం చింతలూరు, చొప్పెళ్ల, రావులపాలెం సీఆర్‌పీ రోడ్డులో ఏర్పాటు చేసిన మూడు మద్యం దుకాణాలను తొలగించాలంటూ వాకర్స్, స్థానికులు ధర్నాలు చేశారు. రామచంద్రపురం రూరల్ తాళ్లపొలంలో, కె.గంగవరం మండల కేంద్రంలో మద్యం షాపు వద్దంటూ మహిళలు ఉద్యమించారు. సామర్లకోట 22వ వార్డులో ప్రైవేటు స్కూల్ వద్ద మద్యం దుకాణం ఏర్పాటుచేయవద్దంటూ మహిళలు, స్థానికులు ఆందోళన చేశారు. మండల కేంద్రాలైన కొరుకొండ, సీతానగరంలలో మద్యం దుకాణాల ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. కాగా, మంగళవారం నగరపాలక, పురపాలక సంఘాలు, మండల కేంద్రాల పరిధిలో ఉన్న రాష్ట్ర రహదారులను జిల్లా ప్రధాన రహదారులుగా మార్పు చేయడంతో మిగిలిన 369 దుకాణాల ఏర్పాటుకు అవకాశం వచ్చింది. ఇందులో జాతీయ రహదారిపై ఉన్న 36 దుకాణాలు కూడా వాటికి 500 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసే వీలుంది. ఆ రకంగా ఇవి ఇళ్ల మధ్యకూ వచ్చే అవకాశమూ ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
Advertisement
Advertisement