‘నిషా’ మహమ్మారిపై నిప్పులు
‘నిషా’ మహమ్మారిపై నిప్పులు
Published Tue, Jul 4 2017 1:39 AM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM
- సోమవారం అదే హోరు
- అమలాపురం పట్టణంలో తెరుచుకోని మద్యం దుకాణాలు
- ఇళ్ల మధ్య దుకాణాలు వద్దంటూ నిరసనలు
- జిల్లాలో పలు ప్రాంతాల్లో నిరసనలు
అమలాపురం టౌన్: ద్రవరూపంలోని ‘ఉపద్రవం’పై జనంలో ఆగ్రహం రగులుతూనే ఉంది. తాగేవాడి కాలేయాన్నీ, వాడి కుటుంబ శ్రేయాన్నీ బలిగొనే మద్యం మాకొద్దంటూ వేలగొంతులు ఘోషిస్తూనే ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా జనావాసాల నడుమ, గుడులకు, బడులకు చేరువలో బ్రాందీషాపుల ఏర్పాటుపై ప్రజలు భగ్గుమంటూనే ఉన్నారు. సోమవారం కూడా జిల్లావ్యాప్తంగా పలుచోట్ల మద్యం షాపుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనలు జరిగాయి. కొన్ని చోట్ల ధర్నాలు చేస్తే, కొన్ని చోట్ల రాస్తారోకోలు నిర్వహించారు. మరికొన్ని చోట్ల అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ గ్రామస్తులు, కాకినాడ రూరల్ మండలం వేళంగిలో సిరిపురం కొప్పిశెట్టివారి పేట, జి.భావారం గ్రామస్తులు మహిళలతో నిరసనలకు దిగగా... కాకినాడ-రామచంద్రపురం, రాజోలు ప్రాంతాల్లో మహిళలు రాస్తారోకోచేశారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం కడియంలో ప్రజావాణిలో వినతిపత్రం అందజేయగా, కాకినాడలో ఎక్సైజ్ డీసీకి వినతిపత్రంఅందజేశారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామస్తులు కాకినాడ కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఎక్సైజ్ డీసీకి, కాకినాడలో గాంధీనగర్ ప్రాంతీయులు జాయింట్ కలెక్టర్‌కు పి.గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు గ్రామస్తులు పి.గన్నవరంలోని ప్రజావాణిలో వినతిపత్రాలు అందజేశారు.
కోనసీమలో తెరుచుకోని దుకాణాలు...
కోనసీమ కేంద్రం అమలాపురం పట్టణంలో మద్యం కొత్త పాలసీలో బార్లు, దుకాణాలు ఏర్పాటు చేసేందుకు ప్రజల నుంచి ఎదరవుతున్న అభ్యంతరాలు, వ్యతిరేకతలతో ఎక్కడా మద్యం టింగమంటూ బోణి కాలేదు. పట్టణంలో మూడు బార్లు, ఎనిమిది దుకాణాలకు వ్యాపారులు లెసెన్సులు పొంది ఉన్నారు. ఒక్కో బార్‌కు రూ.22 లక్షలు..ఒక్కో దుకాణానికి రూ.11 లక్షలు వంతున ప్రభుత్వానికి చెల్లించేసి ఉన్నారు. ఈనెల ఒకటో తేదీ నుంచి బార్లు, దుకాణాలు తెరుచుకుని వ్యాపారాలు చేసుకోవాల్సి ఉంది. నెల మొదలై అప్పుడు మూడు రోజులు గడుస్తున్నా పట్టణంలో ఇప్పటిదాకా బార్లు, దుకాణాల ఏర్పాటుకు అవసరమైన భవనాలు, దుకాణాలే నిర్ధారణ కాలేదు. ఇప్పటికే పది మంది వ్యాపారులు ప్రభుత్వానికి రూ.1.30 కోట్ల మేరు సొమ్ములు చెల్లించేసినా వ్యాపారాలు మొదలు కాకపోవటం ఒక సమస్యయితే ఇళ్ల మధ్య దుకాణాలు వద్దంటూ ప్రజల నుంచి అభ్యంతరాలు ఎదురు కావటం వారికి తలనొప్పిగా తయారైంది. ఇప్పటికే పట్టణంలో సావరం రోడ్డులో ఇళ్ల మధ్య మద్యం దుకాణాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. స్థానిక ఎన్టీఆర్ మార్గ్ సమీపంలో ఏర్పాటు చేయబోయే దుకాణంపై అక్కడ ప్రజలు నేరుగా జిల్లా కలెక్టర్‌కే ఫిర్యాదు చేశారు. పట్టణ శివారు పేరూరు వై.జంక‌్షన్ సమీపంలో 216 జాతీయ రహదారికి 500 మీటర్ల దూరంలో పెడుతున్న దుకాణానికి అభ్యంతరాలు అనివార్యమయ్యాయి. మద్యం పాలసీపరంగా పట్టణ పరిధిలోకి వచ్చే పేరూరు గ్రామంలో కూడా దుకాణాల ఏర్పాటును నిరసిస్తూ ఆ గ్రామానికి చెందిన మహిళలు అమలాపురంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయానికి సోమవారం సాయంత్రం తరలివచ్చి ధర్నా చేశారు. తమ గ్రామంలో మద్యం దుకాణాలకు అనుమతులు ఇస్తే సహించేది లేదని అధికారులను మహిళలు హెచ్చరించారు. మద్యం దుకాణాలంటే ఎక్కడో ఓ చోట చిన్న జాగాలో కనీసం షెడ్డులోనైనా ఏర్పాటుచేసుకునే వీలుంటుంది. అదే బార్లకు భవనం ఉండాలి. పట్టణానికి దూరంగా ఆ స్థాయిలో భవనాలు దొరక్క... ఉన్నా బార్లకు అంటే అద్దెకు ఇవ్వక..ప్రజల నుంచి నిరసనలను ఎదుర్కొనలేక బార్ల లైసెన్సుదారులు ఆందోళనలో పడ్డారు. కామనగరువులో దుకాణం తెరుచుకున్నా సమీపంలోనే ఓ విద్యా సంస్థ ఉండటంతో ఆ దుకాణాన్ని అడ్డుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు.
Advertisement
Advertisement