మద్యం వ్యాపారులకు షాక్
మద్యం వ్యాపారులకు షాక్
Published Fri, Mar 3 2017 11:56 PM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM
– సుప్రీం ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేసిన అబ్కారీ శాఖ
– జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఉన్న దుకాణాల లైసెన్సులు నెలాఖరుతో రద్దు
– 500 మీటర్ల దూరంలో పెట్టుకునేందుకు అనుమతి
– జిల్లాలో 500 మద్యం దుకాణాలు
– సుప్రీం తీర్పునకు ప్రభావితమయ్యే దుకాణాలు 376
– జూన్ వరకు లైసెన్స్ ఉండడంతో ఆందోళనలో వ్యాపారులు
– రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో వేసిన పిటీషన్‌పై ఆశలు
సాక్షి, రాజమహేంద్రవరం: జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఉన్న మద్యం దుకాణాలను ఏప్రిల్ 1వ తేదీలోపు తొలగించాలని గత డిసెంబర్ 15న సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పును రాష్ట్ర అబ్కారీ శాఖ అమలులో పెడుతోంది. జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదాలకు మద్యం సేవించి వాహనాలను నడపడమే కారణమని సుప్రీం కోర్టు పై విధంగా తీర్పు వెలువరించిన విషయం విదితమే. గురువారం జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఉన్న మద్యం దుకాణ యజమానులకు అబ్కారీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి ఉన్న మద్యం దుకాణాల నిర్వాహకుల్లో ఆందోళన మొదలైంది. రెండేళ్ల వరకు మద్యం దుకాణాల నిర్వాహణకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు జూన్ 30 వరకు ఉండడంతో తాము తీవ్రంగా నష్టపోతామని మద్యం వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 500 మద్యం దుకాణాలున్నాయి. ఇందులో జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి 376 దుకాణాలున్నాయని అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. సుప్రీం తీర్పు ప్రభావం జిల్లాలో 376 (75 శాతం) దుకాణాలపై పడుతోంది. తాము మద్యం వ్యాపారులకు ఇచ్చిన లైసెన్స్ జూన్ 30 వరకు ఉందని, అప్పటి వరకు వెలుసుబాటు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. వారం రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉందని అబ్కారీ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపధ్యంలో తీర్పు ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠలో మద్యం వ్యాపారులున్నారు.
మరోచోట ఏర్పాటుకు అబ్కారీ అధికారులతో కమిటీ
కోర్టు తీర్పు ప్రకారం మద్యం దుకాణాలు జాతీయ, రాష్ట్ర రహదారికి 500 మీటర్ల దూరంలో ఉండాలి. వాటిని చేరుకునేందుకు నేరుగా మార్గం ఉండకూడదు. అంతేకాకుండా జాతీయ, రాష్ట్ర రహదారుల నుంచి కనిపించే విధంగా ఉండకూడదు. రహదారులపై ఉంటే వాటి లైసెన్స్ రద్దు అవుతుంది. అయితే అక్కడ నుంచి 500 మీటర్ల దూరంలో కనిపించకుండా ఉండే ప్రాంతంలో దుకాణం ఏర్పాటు చేసుకుంటే ఆ లైసెన్స్ జూన్ 30 వరకు అమల్లో ఉంటుంది. మద్యం వ్యాపారులు నష్టపోకుండా ఈ విధానాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కమిషనర్, సంబంధింత డివిజన్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సూపరింటెండెంట్, స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మద్యం వ్యాపారులు స్థలం ఎంపిక చేసుకుని దరఖాస్తు చేసుకుంటే ఈ కమిటీ పరిశీలించి అనుమతులు జారీ చేస్తుంది.
ఆందోళనలో మద్యం వ్యాపారులు...
వచ్చే మూడు నెలలు (ఏప్రిల్, మే, జూన్) మద్యం వ్యాపారానికి మంచి సీజన్. వేసవి కాలం కావడంతో బీర్ల అమ్మకాలు గణనీయంగా ఉంటాయి. ఏడాదంతా చేసిన వ్యాపారం ఒక ఎత్తయితే చివరి మూడు నెలలు చేసే వ్యాపారం మరో ఎత్తు. సుప్రీం తీర్పు నేపథ్యంలో తాము తీవ్రంగా నష్టపోతామని మద్యం వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 500 దుకాణాల్లో జాతీయ రహదారుల వెంట కేవలం 36 మద్యం దుకాణాలున్నాయి. రాష్ట్ర రహదారులు వెంట 340 మద్యం దుకాణాలు న్నాయి. జాతీయ రహదారులు నగరాలు, పట్టణాలకు వెలుపల వెళుతుండగా, రాష్ట్ర రహదారులు మాత్రం పట్టణాలు, నగరాలల్లో ఉన్నాయి. దీంతో అధిక సంఖ్యలో మద్యం దుకాణాలు సుప్రీం తీర్పునకు ప్రభావితం అవుతున్నాయి. 500 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసుకునే వెలుసుబాటు ఉన్నా ఇప్పటికిప్పుడు స్థలం దొరకడం కష్టమని మద్యం వ్యాపారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ దొరికినా దుకాణం ఏర్పాటు, స్థలం లీజు ధర యజమాని ఎక్కువ డిమాండ్ చేసే అవకాశం ఉందని వాపోతున్నారు. ప్రస్తుతం ఉన్న దుకాణానికి జూన్ వరకు అద్దె చెల్లించామని, ఇప్పడు అది కోల్పోవడంతోపాటు, కొత్తగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని పేర్కొంటున్నారు.
సుప్రీం తీర్పును అమలు చేస్తున్నాం...
డిసెంబర్ 15న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఉన్న మద్యం దుకాణాలను తొలగించాలని వాటి యజమానులకు గురువారం నోటీసులు జారీ చేశాం. 500 మీటర్ల దూరంలో తిరిగి ఏర్పాటు చేసుకునేందుకు మద్యం వ్యాపారి స్థలం చూసుకుని దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తాం. ఇందుకు డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కమిషనర్ కమిటీ వేశారు. బడి, గుడి, ఆస్పత్రికి 100 మీటర్ల దూరంలో, ఇతర నిబంధనలకు అనుగుణంగా స్థలం ఉంటే కమిటీ పరిశీలించి అనుమతి ఇస్తుంది. తీర్పులో జూన్ వరకు వెలుసుబాటు కల్పించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో పిటీషన్ వేసింది. అతి త్వరలో దీనిపై విచారణ జరగనుంది.
– ఎస్. లక్ష్మీకాంత్, అసిస్టెంట్ సూపరింటెండెంట్, అబ్కారీ శాఖ, రాజమహేంద్రవరం.
Advertisement
Advertisement