వేగంగా రోడ్డు విస్తరణ పనులు
కలెక్టర్ కార్తికేయ ఆదేశం
కాకినాడ సిటీ : జిల్లాలో జాతీయ రహదారి 216, ఏడీబీ రోడ్డు విస్తరణ పనులకు భూసేకరణ పనులు వేగవంతం చేసి, ప్రాజెక్ట్ పనులు సకాలంలో పూర్తిచేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కోర్టుహాలులో రెవెన్యూ, నేషనల్ హైవేస్ అధికారులతో సమావేశం నిర్వహించి ఎన్‌హెచ్ 216, ఏడీబీ రోడ్ల భూసేకరణ పనులను డివిజన్ల వారీగా సమీక్షించారు. సమావేశానికి ఎన్‌హెచ్ 216 ప్రాజెక్ట్ డైరెక్టర్ రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్‌ను వెనక్కు పంపించి వేశారు. ఆయన మాట్లాడుతూ నేషనల్ హైవే 216 భూసేకరణపై ప్రజల నుంచి పలు వినతులు వచ్చాయని ఈ మేరకు పనుల కోసం చేపట్టిన భూసేకరణలో పెగ్ మార్కింగ్ కన్నా ఎక్కువ భూమిని తీసుకున్నచోట్ల సమగ్ర సర్వే నిర్వహించాలన్నారు.
ఈ సర్వేను రెవెన్యూ, సంబంధిత ఏజెన్సీ ద్వారా చేపట్టి స్థానిక సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. రెండు, మూడు రోజుల్లో సమగ్ర పరిశీలన జరిపి నివేదిక ఇవ్వాలని ఆయ మండలాల తహసీల్దార్‌లను ఆదేశించారు. భూసేకరణలో భాగంగా ఏడీబీ రోడ్డు పనుల్లో ఆక్రమణలో ఉన్నవారికి కూడా నష్టపరిహారం చెల్లిస్తున్నాం గాని ఎన్‌హెచ్ 216 పనుల్లో ఆక్రమణల్లో ఉన్నవారికి పరిహారం చెల్లించడం లేదని మతపరమైన కట్టడాలను మాత్రమే ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే చర్యలు చేపడుతున్నారని జేసీ–2 రాధాకృష్ణమూర్తి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ విజయకృష్ణన్, ఆర్డీవోలు ఎల్.రఘుబాబు, విశ్వేశ్వరరావు, సంబంధిత మండలాల తహసీల్దార్‌లు పాల్గొన్నారు.