రైతుల సమస్యలు గాలికొదిలిన ప్రభుత్వం
రైతుల సమస్యలు గాలికొదిలిన ప్రభుత్వం
Published Thu, Nov 17 2016 10:26 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
కోడుమూరు రూరల్: రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి విమర్శించారు. గురువారం గాజులదిన్నె ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తులసీరెడ్డితో కలసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కోట్ల సూర్య విలేకరులతో మాట్లాడుతూ జిల్లాకు ఎల్‌ఎల్‌సీ ద్వారా న్యాయంగా రావాల్సిన నీటి వాటాను ప్రభుత్వం రాబట్టలేకపోయిందన్నారు. ఎల్‌ఎల్‌సీకి జీడీపీ నీటిని విడుదల చేస్తూ ఆయకట్టు రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారన్నారు. ప్రస్తుతం జీడీపీలో 1.9టీఎంసీల నీరుందని, ఈ నీటితో ఆయకట్టు కింద పొలాలకు రబీలో సాగునీరు ఎలా అందిస్తారని, వేసవిలో తాగునీటి అవసరాలను ఎలా తీరుస్తారని ప్రశ్నించారు. అంతకుముందు వారు కోడుమూరులో ఈనెల 19న తలపెట్టిన రైతు మహాసభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో తులసీరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల హామీలు అమలు చేయలేని దద్దమ్మ పార్టీగా టీడీపీని అభివర్ణించారు. రుణమాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా, కొత్త రుణాలను మంజూరు చేయకుండా ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసిందన్నారు. పెద్ద నోట్లపై కేంద్రం తీసుకున్న నిర్ణయం చూస్తే పిచ్చి తుగ్లక్‌పాలన గుర్తుకు వస్తుందన్నారు. వీరి వెంట డీసీసీ అధ్యక్షుడు లక్కసాగరం లక్ష్మీరెడ్డి, జిల్లా ఆర్‌టీఐ చైర్మన్ సుదర్శన్‌రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, సర్పంచు సిబి.లత, కాంగ్రెస్ నేతలు సర్దార్ బుచ్చిబాబు, గుడిసె గోపాల్‌రెడ్డి, హేమాద్రిరెడ్డి, హంపిరెడ్డి, జెఎండీ.రఫీక్‌బాషా ఉన్నారు.
Advertisement
Advertisement