విలేజ్ మాల్స్‌గా చౌక దుకాణాలు
విలేజ్ మాల్స్‌గా చౌక దుకాణాలు
Published Wed, Nov 23 2016 11:07 PM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM
ఒకే చోట అన్ని నిత్యావసరాల పంపిణీకి చర్యలు
– మార్కెట్ ధర కంటే 20 శాతం తక్కువకు పంపిణీ
– డిసెంబర్‌లో 20 శాతం కార్డులకు పంపిణీ చేయాలని నిర్ణయం
కర్నూలు(అగ్రికల్చర్): గ్రామాల్లోని చౌక ధరల దుకాణాలు విలేజ్ మాల్స్‌గా మారనున్నాయి. ఇప్పటి వరకు వీటి ద్వారా బియ్యం, కిరోసిన్, చక్కెర మాత్రమే పంపిణీ చేస్తున్నారు. డిసెంబర్ నెల నుంచి షాపులను విలేజ్ మాల్స్‌గా మార్చి మార్కెట్ ధర కంటే 20శాతం తక్కువకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడంతో అమలుపై జాయింట్ కలెక్టర్ నేతృత్యంలో కసరత్తు జరుగుతోంది. డిసెంబర్ నెలలో 20శాతం కార్డుదారులకు అదనపు సరుకులు పంపిణీ చేయాలని ఆదేశించడంతో ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. విలేజ్ మాల్స్ ద్వారా కందిపప్పు, పామోలిన్ ఆయిల్, అయోడైజ్డ్ ఉప్పు, ఉల్లి, బంగాళ దుంపలను మార్కెట్ ధర కంటే 20శాతం తక్కువకు పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆదేశించారు. స్థానిక పరిస్థితులను బట్టి ప్రజలకు ఉపయోగపడే నిత్యావసర వస్తువులను పంపిణీ చేయవచ్చని సూచించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో అదనంగా కారంపొడి, శనగపప్పు, పెసరపప్పు కూడా పంపిణీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సరుకులను జిల్లా స్థాయి నుంచే సరఫరా చేస్తారు. నిబంధనల ప్రకారం టెండర్ పిలిచి ధరలను ఖరారు చేసి వారి ద్వారా గ్రామాలకు సరఫరా చేయాల్సి ఉంది. అయితే డిసెంబర్ మొదటిì వారం నుంచే పంపిణీ చేయల్సి ఉండటం వల్ల సమయం లేనందున హోల్‌సేల్ డీలర్లతో చర్చించి వారి ధరలు ఖరారు చేసి ఆ మేరకు చర్యలు చేపట్టనున్నారు. అయితే రూ.300 విలువ వరకు మాత్రమే ఈ సరుకులు ఇస్తారు. సరుకలు ఎట్టి పరిస్థితుల్లో లూజుగా ఇవ్వరాదు. ప్యాకింగ్‌లో మాత్రమే ఇవ్వాల్సి ఉంది. ఈ కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాల్లోనే పెద్ద ఎత్తున అమలు చేయాలని జేసీ భావిస్తున్నారు. డిసెంబర్‌లో 20శాతం కార్డులకు పంపిణీ చేయడంలో విజయవంతం అయితే జనవరి నెల నుంచి కార్డుదారులందరికీ వీటిని పంపిణీ చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
ఐదు రకాల సరుకుల మార్కెట్ ధరలు, మాల్స్ ధరలు ఇలా..
సరుకు పేరు మార్కెట్ ధర 20 శాతం తక్కువ ధర
––––––––––––––––––––––––––––––
కందిపప్పు రూ.120 రూ. 90
పామోలిన్ ఆయిల్ రూ. 65 రూ. 52
ఉప్పు రూ. 20 రూ.15
ఉల్లి రూ.10 రూ. 8
బంగాళదుంప రూ.20 రూ.15
––––––––––––––––––––––––––––––
Advertisement