బదిలీలకు వేళాయె!! | government transfers time start | Sakshi
Sakshi News home page

బదిలీలకు వేళాయె!!

Published Sun, Apr 9 2017 11:58 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

బదిలీలకు వేళాయె!! - Sakshi

బదిలీలకు వేళాయె!!

– మే 1 నుంచి నిషేధం ఎత్తివేసే యోచనలో ప్రభుత్వం  
– ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్నవారికి కచ్చితంగా స్థానభ్రంశం
– అనుకూలమైన అధికారులను నియమించుకోవాలని సీఎం ఆదేశం?
– మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారికే పోస్టింగుల్లో ప్రాధాన్యత


బదిలీల జాతరకు దాదాపు ముహూర్తం ఖరారైంది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీపై మే 1 నుంచి 20 వరకూ 20 రోజుల పాటు నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు ఈ నెలాఖరులో జీఓ జారీ చేసే అవకాశం ఉంది. ఇటీవల అమరావతిలో జరిగిన మంత్రివర్గ భేటీలో ఈ అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సర్పంచ్‌ ఎన్నికలు, ఆపై ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో అన్ని మండల కేంద్రాల్లో అనుకూల అధికారులను నియమించుకోవాలని సీఎం సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సారి బదిలీల్లో పనితీరు, ఇతర అంశాలతో పనిలేకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన వారికే పోస్టింగులు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.
–సాక్షి ప్రతినిధి, అనంతపురం.        
                                
 ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు  ఆర్థిక శాఖ రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లా, జోనల్‌స్థాయి ఉద్యోగుల బదిలీలకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. రాష్ట్రకేడర్‌ ఉద్యోగులను బదిలీ నుంచి మినహాయించనున్నారు. మే ఒకటో తేదీకి ఉద్యోగంలో చేరి రెండేళ్ల సర్వీసు పూర్తికాని వారికి కూడా బదిలీ నుంచి మినహాయించనున్నారు. ఐదేళ్లు పూర్తయినవారిని కచ్చితంగా బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే రాష్ట్రకేడర్‌ ఉద్యోగుల బదిలీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

అధికారపార్టీకి అనుకూలంగా పనిచేసే వారికే ప్రాధాన్యత
బదిలీలు పూర్తిగా అధికారపార్టీ కనుసన్నల్లో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే జూలైతో సర్పంచ్‌ల పదవీకాలం ముగియనున్నాయి. ఆపై సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టిన తర్వాత పింఛన్లు మినహా ఎలాంటి సంక్షేమ పథకాలూ లబ్ధిదారులకు చేరలేదు. కనీసం ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు. దీంతో తక్కిన సంక్షేమ పథకాల సంగతి పక్కనపెడితే కనీసం కొన్ని ఇళ్లయినా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో మండలస్థాయి అధికారులు పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసేవారిని నియమించుకోవాలని సీఎం బాహాటంగానే చెప్పినట్లు తెలుస్తోంది. పనితీరు, ఆరోపణలతో పనిలేకుండా, ఉన్నతాధికారుల ఆలోచనలను పరిగణలోకి తీసుకోవల్సిన అవసరం లేకుండా ‘మేం లేఖ ఎవరికిస్తే వారికి అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ ఇవ్వు!’ అనే ధోరణిలో అధికారపార్టీనేతలు వ్యవహరించే అవకాశం ఉంది.

భారీగా బేరాలు!
అధికారుల బదిలీల అంశం అధికార పార్టీనేతలకు వరంగా మారనుంది. కోరుకున్న పోస్టింగు దక్కించుకునేందుకు అధికారపార్టీ నేతల ఆశీస్సులు తప్పనిసరి అని భావించిన అధికారులు వారిని ప్రసన్నం చేసుకునేందుకు క్యూ కడతారు. ఆయా ఎమ్మెల్యేలతో సిఫార్సు లేఖలు తీసుకుంటారు. దీంతో పోస్టింగును బట్టి అధికార పార్టీ నేతలు రేటు ఖరారు చేసే అవకాశం ఉంది. తహసీల్దార్, ఎంపీడీఓ, హౌసింగ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌తో పాటు పలు కీలకశాఖల పోస్టుల్లో ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు వచ్చేదాకా బదిలీల్లో నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉన్నతాధికారులది. మూడేళ్లుగా ఇదే తంతు నడుస్తోంది. ఈ ఏడాది ఏకంగా ముఖ్యమంత్రే బదిలీలకు సంబంధించి ‘మార్గనిర్దేశం’ చేయడంతో ఆయా శాఖల అధికారులు ప్రేక్షకపాత్ర పోషించి సంతకం పెట్టడం మినహా బదిలీల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement