ప్రభుత్వానిది తుగ్లక్ పాలన
బీజేపీ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్
ఆదిలాబాద్ క్రైం : రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పాలన తుగ్లక్ పాలనను మించిపోతోందని బీజేపీ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని, ఆర్థిక వనరులు భాగున్నాయని చెబుతున్న కేసీఆర్ ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టిన విధంగా రైతుల రుణమాఫీ చేయడం లేదన్నారు. ఇప్పటి వరకు 25 శాతం రుణమాఫీ విడుదల చేయలేదన్నారు. జిల్లాలో రూ. 3,489 రైతులకు రుణాలు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం రూ. 250 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. పత్తిసాగు చేసుకోవద్దని చెబుతున్న ప్రభుత్వం దానికి ప్రత్యామ్నాయ పంటలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం లేదన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు ఇన్సూరెన్స్ అవకాశం కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే బాధల్లో ఉన్న రైతులను ప్రభుత్వం మరిన్ని ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. మార్కెట్‌లో నకిలీ విత్తనాలు చెలామని అవుతున్న ప్రభుత్వం వాటిపై నియంత్రించడంలో విఫలమైందన్నారు. రైతులకు రుణమాఫీ చేయకుంటే కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని, గ్రామాల్లో మంత్రులు పర్యటించకుండా అడ్డుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు మడావిరాజు, వేణుగోపాల్, జోగురవి, రాము, మోహన్‌లు ఉన్నారు.