ఆంధ్రాకి అన్యాయం
-
ప్రత్యేకహోదా విషయంలో మొండిచేయి
-
ప్రభుత్వాలు మూల్యం చెల్లించుకోక తప్పదు
-
సీపీఎం కేంద్ర కార్యవర్గ సభ్యుడు శ్రీనివాసరావు
ఒంగోలు టౌన్: ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సీపీఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యి చూపిస్తే, కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకుండా టీడీపీ ప్రజలను మోసగిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. స్థానిక సుందరయ్య భవన్‌లో శనివారం నిర్వహించిన సీపీఎం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకుంటామని, వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ ఇస్తామని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని, రాజధాని నిర్మాణానికి సహాయం అందిస్తామని ప్రకటించిన బీజేపీ నేడు మాట మార్చి ఆర్థిక సహకారానికే పరిమితం చేస్తోందని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఇచ్చిన హామీల్లో ఒక్కదానిని కూడా అమలు చేయలేదన్నారు. ప్రత్యేక హోదాపై ఇప్పటికీ ఎలాంటి ప్రకటన చేయకుండా ప్యాకేజీతోనే సరిపెట్టడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం ప్రకటన lచేసి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని, టీడీపీ ప్రభుత్వం నాన్చుడి ధోరణి విడనాడి ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాటం చేయకపోతే ఆ రెండు పార్టీలు తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కరువుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవడంలో టీడీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని విమర్శించారు.
సార్వత్రిక సమ్మెకు సీపీఎం మద్దతు
కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2వ తేదీ జరగనున్న సార్వత్రిక సమ్మెకు మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు వెల్లడించారు. ప్రభుత్వ రంగాలు ప్రైవేటీకరించే చర్యలకు నిరసనగా, కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల కోసం చేపట్టిన సమ్మెలో పార్టీ శ్రేణులంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. నీరు–చెట్టు, ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవినీతిపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు జాలా అంజయ్య అధ్యక్షతన నిర్వహించిన∙సమావేశంలో నాయకులు ముప్పరాజు కోటయ్య, జీవీ కొండారెడ్డి, ఎస్‌డీ హనీఫ్, చీకటి శ్రీనివాసరావు, పెంట్యాల హనుమంతరావు, ఎస్‌కే మాబుతోపాటు జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.