ఏరు దాటి తెప్ప తగలేశారు
టీడీపీ-బీజేపీ రెండేళ్ల పాలన-వైఫల్యాలపై పది వామపక్ష పార్టీల సదస్సు
సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా బీజేపీ, టీడీపీ రెండూ ఏరుదాటి తెప్ప తగలేసినట్టు వ్యవహరిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రత్యేక హోదా సంజీవని కాదంటూనే రాష్ట్రంలో మాత్రం హోదా కోసం మొసలి కన్నీరు కారుస్తూ రెండు కళ్ల సిద్ధాంతాన్ని కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు రెండేళ్ల పాలన-వైఫల్యాలపై పది వామపక్ష పార్టీలు ఆదివారం రాత్రి విజయవాడలో సదస్సు నిర్వహించాయి. మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ అధ్యక్షతన జరిగిన సదస్సులో రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామంటూ అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రకటిస్తే బీజేపీ అధికారంలోకి వస్తే పదేళ్లు ఇస్తామని ప్రస్తుత కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల ముందు 681 వాగ్దానాలు చేసిన చంద్రబాబు వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలకు మొండి చెయ్యి చూపిస్తున్నారని ఆరోపించారు. ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలతో పోలీస్ రాజ్యాన్ని తలపిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నారని వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు బి.హరనాథ్ (సీపీఐఎంఎల్ లిబరేషన్), ఎం.వెంకటరెడ్డి (ఎంసీపీఐ), బి.ఎస్.అమర్‌నాథ్ (ఎస్‌యూసీ), పి.సుందరరామరాజు (ఫార్వర్డ్‌బ్లాక్) తదితరులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరి మార్చుకుని రాష్ట్ర ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోతే వామపక్ష ప్రజాతంత్ర శక్తులతో పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు.