
స్వామి వారి సేవలో నరసింహన్
తిరుమల: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల ఆలయంలో మంగళవారం నిర్వహించిన శుద్ధి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. గోడలు, ప్రాకారాలకు తిరుమంజనం మిశ్రమాన్ని పూస్తూ, నీటిపైపు చేతపట్టి శుద్ధి చేస్తూ స్వామిసేవలో ఉత్సాహంగా గడిపారు.
హోదాలో ప్రథమ పౌరుడైనా ఎలాంటి దర్పం ప్రదర్శించరు. సంప్రదాయానికి నిలువెత్తుగా నిదర్శనం గవర్నర్ నరసింహన్. ప్రత్యేకించి ఆలయ సందర్శనలో ఆచార, వస్త్ర సంప్రదాయాన్ని ఆయన కచ్చితంగా పాటిస్తుంటారు. వంశపారంపర్యంగా ఆచరించే ద్వాదశ పుండ్రాళ్లు (12 తిరునామాలు) ధరిస్తారు. పైవస్త్రం లేకుండా సంప్రదాయ కీపాస్ (పంచెకట్టు) ధరిస్తారు. మోములో చిరునవ్వు చిందిస్తూ కనిపిస్తారు. మంగళవారం కూడా అదే సంప్రదాయంతోపాటు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. వయసు ఏడు పదులుదాటినా యువకులతో పోటీ పడుతూ తల నుంచి కాళ్ల వరకు పడిన మిశ్రమంతోనే ఇలా ఆలయం వెలుపలకు వచ్చి ‘బాగున్నారా..’ అంటూ అందరినీ నవ్వుతూ పలుకరించారు మన గవర్నర్ నరసింహన్.