జగ్గయ్యపేట... ఇక మరో భోపాల్ | govt nod to vbc fertilisers and chemical limited plant in jaggayyapeta | Sakshi
Sakshi News home page

జగ్గయ్యపేట... ఇక మరో భోపాల్

Published Wed, Oct 14 2015 9:42 AM | Last Updated on Sun, Sep 3 2017 10:57 AM

పరిశ్రమ నిర్మిస్తే నిర్వీర్యం కానున్న జయంతిపురం ప్రాంతంలోని పచ్చటి పొలాలు

పరిశ్రమ నిర్మిస్తే నిర్వీర్యం కానున్న జయంతిపురం ప్రాంతంలోని పచ్చటి పొలాలు

పెద్దబాస్, చిన్నబాస్‌లు ప్రజల ప్రాణాలు ఫణంగా పెట్టి బంధుగణాలకు భూములు కేటాయించుకున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

సాక్షి, జగ్గయ్యపేట అర్బన్: వీబీసీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ నిర్మించ తలపెట్టిన ఎరువుల కర్మాగారాలతో తమ ప్రాంతం కాలుష్య కాసారంగా మారుతుందని కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలంలోని జయంతిపురం గ్రామప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జయంతిపురం 93వ సర్వే నంబరులోని 478.93 ఎకరాల భూమిని తన బంధువులకు చెందిన వీబీసీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్‌కు కేటాయిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

ఈ ప్రాంతంలో భారీ ఎరువుల కర్మాగారాలను నెలకొల్పితే... భారీ ఎత్తున విడుదలయ్యే ఆన్‌హైడ్రస్ అమ్మోనియా, సత్సంబంధ లీకేజీల మూలంగా భారీ సంఖ్యలో వయోవృద్ధులు, పిల్లలు మృత్యువాత పడే ప్రమాదం, శ్వాసకోశ సంబంధ వ్యాధులు, అంగవైకల్యాల బారిన పడే ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పారిశ్రామిక దుర్ఘటనల్లో అత్యంత ఘోరమైన భోపాల్ విషవాయు లీకేజీలాంటి దుర్ఘటనకు ఈ పరిశ్రమలు కారణం కావచ్చన్న ఆందోళనలకు అవుననే సమాధానం చెబుతున్నారు.

భోపాల్‌లో 31 ఏళ్ల కిందట యూనియన్ కార్బైడ్ పరిశ్రమలో విషవాయువుల లీకేజీ దుర్ఘటన 15 వేల మందిని బలిగొంది. దాని తాలూకా దుష్ర్పభావాలు నేటికీ వైద్యులకు కూడా అంతుచిక్కడం లేదు. ఇప్పుడు తమ ప్రాంతంలో అలాంటి పరిశ్రమలను ఏర్పాటు చేసి, తమ ప్రాణాలతో ఆడుకునేకంటే ఆ భూములను నిరుపేదలైన రైతులకు పంచాలని జయంతిపురం, పరిసర గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆయా గ్రామాలలోని సుమారు 250 మంది పేద రైతులకు రెండెకరాల చొప్పున భూములు కేటాయిస్తే సాగు చేసుకుని బాగుపడతారని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వారు సిద్ధమయ్యారు. గురువారం జరిగే ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకునేందుకు వారు సర్వ సన్నాహాలు చేసుకుంటున్నారు.

ప్రభుత్వ పెద్దల బంధుప్రీతికి బలికానున్న ప్రజల ప్రాణాలు
జయంతిపురం గ్రామానికి చెందిన రైతులు పూర్తిగా కృష్ణా డెల్టాపై ఆధారపడి వ్యవసాయం కొనసాగిస్తున్నారు. అలాంటి ప్రాంతంలో 478.93 ఎకరాల భూమిని ఒకే సంస్థకు, అందునా విషవాయువులు విడుదల చేసే కర్మాగారాలకోసం అతి తక్కువ ధరకు ధారాదత్తం చేయటం వెనుక పెద్ద మతలబు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

చంద్రబాబు బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే  బాలకృష్ణకు వీబీసీ కెమికల్స్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, సంచాలకుల హోదాలో ఉన్న ఎంఎస్‌పీ రామారావు స్వయానా వియ్యంకుడు. అందుకే పెద్దబాస్, చిన్నబాస్‌లు ప్రజల ప్రాణాలు ఫణంగా పెట్టి బంధుగణాలకు భూములు కేటాయించుకున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తమకు కేటాయించిన భూమిలో... రోజుకు 2‘2200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా, 2‘400 మెట్రిక్ టన్నుల నైట్రిక్ యాసిడ్, 2‘500 మెట్రిక్ టన్నుల అమ్మోనియం నైట్రేట్, 2‘3850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తిచేసే ఎరువుల కర్మాగారాలు, 2‘67.5 మెగావాట్ల సామర్థ్యంతో బొగ్గు ఆధారిత విద్యుత్ కర్మాగారం నెలకొల్పే యోచనలో వీబీసీ పరిశ్రమ ఉన్నట్లు సమాచారం.

ఆ కర్మాగాలు ఏర్పాటైతే వాటినుంచి వచ్చే కాలుష్యం భూగర్భ, ఉపరితల జలాల్లోకి వెళితే పెనుప్రమాద మే సంభవిస్తుంది. యూట్రోఫికేషన్ చర్య మూలంగా జల వాతావరణం మొత్తంగా కాలుష్య కాసారంగా మారుతుంది. రైతులు, తాగునీటి అవసరాలు తీర్చుకునే లక్షలాదిమందిపై తీవ్ర ఆరోగ్య సమస్యలు వెల్లువెత్తే ప్రమాదముందని నిపుణుల అంచనా. పారిశ్రామిక దిగ్గజాలైన టాటా, ఆదిత్య బిర్లా గ్రూప్ వంటి వారే ఈ రంగంలో పెట్టుబడులను ఉపసంహరించుకుంటుంటే, నష్టాల్లో ఉన్న కోనసీమ గ్యాస్ పవర్ కంపెనీకి చెందిన ఎంఎస్‌పీ రామారావు ఏ ధైర్యంతో పెట్టుబడి పెట్టాలని యోచనలో ఉన్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement