చినబాబు ఆఫీస్ నుంచి ఫోన్లు! | Calls from Nara Lokesh Office to Jaggayyapeta | Sakshi
Sakshi News home page

చినబాబు ఆఫీస్ నుంచి ఫోన్లు!

Published Fri, Oct 16 2015 10:32 AM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM

చినబాబు ఆఫీస్ నుంచి ఫోన్లు! - Sakshi

చినబాబు ఆఫీస్ నుంచి ఫోన్లు!

‘‘అది మన ఫ్యాక్టరీ. మన వాళ్లు రూ.వేల కోట్లతో నిర్మిస్తున్న కర్మాగారం. ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నపాటి ఇబ్బంది కూడా కలగకూడదు. అన్నీ జాగ్రత్తగా చూసుకోండి’’....

సాక్షి, విజయవాడ:  ‘‘అది మన ఫ్యాక్టరీ. మన వాళ్లు రూ.వేల కోట్లతో నిర్మిస్తున్న కర్మాగారం. ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నపాటి ఇబ్బంది కూడా కలగకూడదు. అన్నీ జాగ్రత్తగా చూసుకోండి’’.... ఇవీ ప్రభుత్వ పెద్దల నుంచి కృష్ణా జిల్లా అధికార యంత్రాంగానికి వచ్చిన ఆదేశాలు. దీంతో జాయింట్ కలెక్టర్ ఆఘమేఘాల మీద జగ్గయ్యపేటలోని జయంతిపురం గ్రామానికి చేరుకున్నారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో సుదీర్ఘ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. వాస్తవానికి వాయిదా వేయాల్సిన ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి పేషీ నుంచి, చినబాబు కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతోనే హడావుడిగా సాగిందన్నది బహిరంగ రహస్యం.

మాట్లాడే అవకాశం కొందరికే
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో రూ.10 వేల కోట్లతో వీబీసీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ కర్మాగారం ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా జీవో ద్వారా 500 ఎకరాల భూమిని అతి చౌక ధరకు సదరు సంస్థకు కట్టబెట్టింది. విశాఖపట్నం మాజీ ఎంపీ, సినీ నటుడు బాలకృష్ణ సన్నిహిత బంధువు ఎంవీవీ ఎస్ మూర్తికి చెందిన పరిశ్రమ కావడంతో అధికార యంత్రాంగం అవసరమైన సహకారం అందిస్తోంది.

వాస్తవానికి ప్రజాభిప్రాయ సేకరణకు ముందే ప్రభుత్వానికి 40 అంశాలతో కూడిన సమగ్ర నివేదికను కంపెనీ ఇవ్వాల్సి ఉంది. అయితే కంపెనీ ఇచ్చిన నివేదికలో అనేక తప్పులు ఉన్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్లతో దాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో గురువారం జయంతిపురంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. రాజధాని అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లలో కృష్ణా, గుంటూరు జిల్లాల అధికార యంత్రాంగం తలమునకలై క్షణం తీరిక లేకుండా ఉంది. ఈ క్రమంలో కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రు డు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాల్సి ఉంది. అయితే బిజీగా ఉన్న తాను రాలేనని గంధం చంద్రుడు వీబీసీ కంపెనీ యాజమాన్యానికి చెప్పినట్లు సమాచారం. దీంతో సీఎం కార్యాలయం నుంచి, చినబాబు కార్యాలయం నుంచి వరుసగా ఫోన్లు రావడంతో జేసీ గురువారం జయంతిపురం చేరుకొని కార్యక్రమం నిర్వహించారు. అయితే గ్రామస్తులందరికీ మాట్లాడే సమయం ఇవ్వకుండా ఎంపిక చేసిన కొందరితోనే మాట్లాడించారు.

ఎమ్మెల్యే కనుసన్నల్లో కార్యక్రమం
జయంతిపురంలో ప్రజాభిప్రాయ సేకరణ స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య కనుసన్నల్లోనే నడిచింది. మూడు రోజుల ముందునుంచే ఆయన ఏడు గ్రామాల ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహించి, అందరూ అంగీకరించేలా ముందస్తు పథకం రచించారు. ఈ క్రమంలో గురువారం ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయ్యేవరకు ఎమ్మెల్యే అక్కడే ఉన్నారు. గ్రామస్తులను కంపెనీకి వ్యతిరేకంగా మాట్లాడకుండా చేయడంతో విజయవంతమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement