జిల్లాలో ఖాళీల కథ !! | govt posts vacancies in nizamabad district | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఖాళీల కథ !!

Published Sat, May 14 2016 12:04 PM | Last Updated on Mon, Sep 4 2017 12:06 AM

జిల్లాలో ఖాళీల కథ !!

జిల్లాలో ఖాళీల కథ !!

► జిల్లా ప్రధాన శాఖల్లో అధికారుల కొరత
► ఇన్‌చార్జులతోనే పాలన
► కుంటుపడుతున్న అభివృద్ధి
► గాడితప్పుతున్న శాఖలు
► ఒక్కో అధికారికి మూడు బాధ్యతలు
► పథకాల అమలులో అవస్థలు
► నియామకాలపై ఊసెత్తని సర్కారు
► పదోన్నతుల కోసం నిరీక్షణ

 
ఇందూరు: జిల్లాలోని ప్రధాన శాఖలు ఇన్‌చార్జుల పాలనలోనే కొనసాగుతున్నాయి. అన్ని రంగాల్లో ముందువరుసలో ఉన్న జిల్లాను అదేస్థాయిలో అధికారుల కొరత వేధిస్తోంది. ప్రధానంగా రెగ్యూలర్ అధికారులను నియమించకపోవడం, సర్కారు పట్టించుకోకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. ఎవరైనా అధికారి రిటైర్డ్ అయినా, స్థానం ఖాళీ అయినా ఆ శాఖను వేరే అధికారికి అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. వారికి ఇష్టం లేకున్నా అంటగడుతున్నారు. దీంతో అవస్థలు పడుతూ.. మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారు. తమ సొంతశాఖతోపాటు ఇన్‌చార్జి శాఖకు కూడా న్యాయం చేయలేకపోతున్నారు. జిల్లాలో దాదాపు 62 వరకు ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. పరిపాలనలో వేగవంతంగా పనులు జరగాలన్నా, పథకాలు అమలు కావాలన్నా పంచాయతీ రాజ్, సంక్షేమ, రెవెన్యూ, కార్పొరేషన్, ఇతర రెండు మూడు శాఖలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రధానంగా ఈ శాఖల్లోనే జిల్లా అధికారుల పోస్టులు ఖాళీ ఉన్నాయి.

ఖాళీలు ఇవే..
 ♦ జిల్లాకు తలమానికమైన జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో) పోస్టు ఆరు నెలలుగా ఖాళీ ఉంది. గతంలో పని చేసిన మనోహర్ పదవీ విరమణ పొందడంతో రెగ్యులర్ అధికారిని ప్రభుత్వం నియమించలేదు. ప్రస్తుతం జెడ్పీ సీఈఓ మోహన్‌లాల్ ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్నారు. దీనికితోడు భూ భారతి శాఖకు కూడా ఇన్‌చార్జీగా ఉన్నారు. ముఖ్యంగా జిల్లా పరిపాలన, కలెక్టర్ వ్యవహారాలు, ఫైళ్లు, ఉత్తర్వులు అన్ని కలెక్టరేట్  నుంచే జరుగుతాయి. రెగ్యులర్ అధికారి లేకపోవడంతో కలెక్టర్ పరిపాలన విభాగానికి సుస్తీ పట్టింది.
 
♦ జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ డీడీ విజయ్‌కుమార్‌ను కలెక్టర్ సరెండర్ చేశారు. దీంతో ఏజేసీ రాజారాం ఇన్‌చార్జి అధికారిగా ఉన్నారు. 62 వసతిగృహాలు, వార్డెన్‌లు, ఎస్సీ సబ్ ప్లాన్, కల్యాణ లక్ష్మి, ఉపకార వేతనాలు, ఇతర పథకాల అమలు పర్యవేక్షణ అట కెక్కింది. కాగా ఇదే శాఖలో జిల్లా సాంఘీక సంక్షేమాధికారి(డీఎస్‌డబ్ల్యూఓ) పోస్టు కొన్నేళ్లుగా ఖాళీ గా ఉంది. ఈ పోస్టులో నిజామాబాద్ ఏఎస్‌డబ్ల్యూ ఓ జగదీశ్వర్‌రెడ్డి ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్నారు. కాగా కామారెడ్డి, బోధన్, మద్నూరు, ఆర్మూర్ ఏఎస్‌డబ్ల్యూఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
 
♦  జిల్లా మైనార్టీ వెల్ఫేర్‌లో జిల్లా అధికారి పోస్టు ఖాళీగా ఉంది. మైనార్టీ కార్పొరేషన్‌కు చెందిన ఈడీ ప్రేమ్‌కుమార్ ఇన్‌చార్జీగా ఉన్నారు. ఈ శాఖలో షాదీముబారక్, షాదీఖానాలు, స్కాలర్‌షిప్, తదితర పథకాల అమలు, పర్యవేక్షణ ఆయనకు కష్టంగా మారింది.
♦ జిల్లా సహకార శాఖలో డీసీఓగా పనిచేసిన శ్రీహరి పదవీ విరమణ పొందారు. ఇన్‌చార్జీగా  అదేశాఖలో పని చేస్తున్న గంగాధర్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.
♦ జిల్లా బీసీ కార్పొరేషన్‌కు కొన్నేళ్లుగా రెగ్యులర్ ఈడీ లేకపోవడంతో సాయిలును నియమించారు. ఈయనను రెండు నెలల క్రితం కలెక్టర్ సరెండర్ చేశారు. ప్రస్తుతం స్టెప్ సీఈఓ  ఉపేందర్‌రెడ్డికి ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చారు. ప్రస్తుతం రుణాల సీజన్ కావడంతో వాటిని లబ్ధిదారులకు అందజేసే ప్రక్రియలో ఆలస్యం జరుగుతోంది.
♦ జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌కు నాలుగేళ్లుగా రెగ్యులర్ ఈడీ లేడు. రుణాల మంజూరు, దళితులకు భూ పంపిణీ వంటి పథకాలున్న ఈ శాఖకు రెగ్యులర్ అ ధికారి లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉన్న ఇన్‌చార్జికి తలకు మించిన భారం అవుతోంది.
♦ నీటి సరఫరా శాఖ(ఆర్‌డబ్ల్యూఎస్)లో ఎస్‌ఈగా పని చేసిన ఇద్దరు అధికారుల్లో ఒకరు బదిలీపై వెళ్లారు. అనంతరం వచ్చిన అధికారి అనారోగ్యంతో సెలవులో ఉన్నారు. ప్రస్తుతం ఇన్‌చార్జి అధికారిగా బాన్సువాడకు చెందిన వెంకటేశ్వర్లు పని చేస్తున్నారు. ప్రభుత్వం రెగ్యులర్ అధికారిని నియమిస్తూ నెల రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసినా విధుల్లో చేరలేదు.
♦ రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ ట్రాన్స్‌పోర్టు పోస్టు ఖాళీగా ఉంది. నిజామాబాద్ ఆర్‌డీఓ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. వెహికిల్ ఇన్‌స్పెక్టర్, ఇతర ప్రధాన పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
♦ ఎక్సైజ్ శాఖలో ప్రధానమైన ఏసీ, డీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పక్క జిల్లా అధికారి డిప్యూటీ కమిషనర్ ఇన్‌చార్జిగా పని చేస్తున్నారు. అలాగే ఎక్సైజ్ ఎస్సై, సీఐ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
♦ ఐసీడీఎస్‌లో ఏపీడీ పోస్టుల కొన్నేళ్లుగా ఖాళీ ఉంది. నెల రోజుల క్రితం ఈ పోస్టులో శ్రీదేవిని ప్రభుత్వం నియమించింది. ఆమె విధుల్లో చేరలేదు.
జిల్లాలో పని చేయడానికి ఆమె విముఖత చూపుతున్నారు.
♦  జిల్లా పరిషత్‌లో డిప్యూటీ సీఈఓ పోస్టు కొన్నేళ్లుగా ఖాళీ ఉంది. ప్రస్తుతం ఎంపీడీఓగా పని చేస్తున్న గోవింద్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.
 పదోన్నతులు, నియామకాలు లేవు..
 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని చెప్పింది. కానీ అమలులో జాప్యం చేస్తోంది. ఇటు జిల్లాలో ఖాళీలపై ఉన్నతాధికారులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం లేదు. నూతన నియూమకాలు, శాఖల్లో పని చేస్తున్న రెండో శ్రేణి అధికారులకు పదోన్నతులు ఇవ్వకపోవడం కూడా ఖాళీలకు కారణమవుతున్నాయి. పదోన్నతుల కోసం చాలా మంది అధికారులు ఎదురు చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement