ప్రభుత్వ ఆసుపత్రులకు గ్రేడింగ్
ప్రభుత్వ ఆసుపత్రులకు గ్రేడింగ్
Published Wed, Mar 15 2017 12:26 AM | Last Updated on Tue, Sep 5 2017 6:04 AM
–నంద్యాల, డోన్ ఆసుపత్రులు టాప్
–పలు సీహెచ్‌సీల్లో సున్నా ప్రసవాలు
కర్నూలు(హాస్పిటల్): ప్రభుత్వ ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రేడింగ్స్ ఇస్తోంది. ఆయా ఆసుపత్రులు రోగులకు అందించే సేవలు, వైద్యులు, సిబ్బంది పనితీరు ఆధారంగా ఏ,బీ,సీ, గ్రేడింగ్ ఇచ్చారు. జిల్లాలోని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల, పీహెచ్‌సీలు మినహా ఇతర ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెలకు సంబంధించి పనితీరును బట్టి గ్రేడింగ్స్ ఇచ్చింది. నంద్యాలలోని జిల్లా ఆసుపత్రికి ఏ గ్రేడ్, 18 సీహెచ్‌సీల్లో 5 ఏ గ్రేడ్, ఒకటి బీ గ్రేడ్, 12 సీ గ్రేడ్ సాధించాయి. ఓపీ, ఐపీ సేవల్లో నంద్యాల జిల్లా ఆసుపత్రి , ఆదోని ఆసుపత్రి లక్ష్యాన్ని మించాయి.
సీహెచ్‌సీల్లో డోన్ టాప్
అన్నిరకాల ఇండికేటర్లలో డోన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉన్నత స్థానంలో నిలిచింది. ట్యూబెక్టమి ఆపరేషన్లలో 101కి గాను 337, ఓపీ 8100కి గాను 7754, ఐపీ 600లకు గాను 532 మందికి చికిత్స అందించారు. 30 ప్రసవాలకు గాను 110 మందికి, 110 ట్యూబెక్టమి ఆపరేషన్లకు గాను 367 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరిగిన ప్రసవాలు
నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిబ్రవరి నెలకు 180 మందికి ప్రసవం చేయాలని లక్ష్యం నిర్దేశించగా 336 మంది, బనగానపల్లిలో 60 మందికి గాను 35, ఆదోని ఎంసీహెచ్‌లో 300లకు గాను 365, ఎమ్మిగనూరులో 60కి గాను 174 మంది ప్రసవించారు. 30 పడకల ఆసుపత్రుల్లో ఆలూరులో 30కి గాను 46, పత్తికొండలో 41,ఆళ్లగడ్డలో 71, ఆత్మకూరులో 22, కోడుమూరులో 7, డోన్‌లో అత్యధికంగా 101, ఓర్వకల్లులో 28, వెల్దుర్తిలో ఏడుగురు మహిళల కాన్పులు జరిగాయి. కాగా ఆలూరు, అవుకు, కోవెలకుంట్ల సున్నిపెంట, నందికొట్కూరు, యాళ్లూరు, పాణ్యం, మిడుతూరు, వెలుగోడు సీహెచ్‌సీల్లో ఒక్క కాన్పు జరగలేదు.
Advertisement