పై వంతెనలకు పచ్చజెండా
పై వంతెనలకు పచ్చజెండా
Published Tue, Sep 6 2016 10:06 PM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM
భీమవరం టౌన్: అంతర్జాతీయ ప్రమాణాలతో 165 జాతీయ రహదారి (పామర్రు–దిగమర్రు రోడ్డు)లో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)ల నిర్మాణ ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. రైల్వే లెవిల్ క్రాసింగ్‌లు ఉన్నచోట్ల ఆర్వోబీల నిర్మాణానికి కేంద్ర రైల్వే, ఉపరితల రవాణా శాఖలు నిర్ణయం తీసుకున్నాయి. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 35 చోట్ల ఆర్వోబీలు నిర్మించనున్నారు. జిల్లాలో మూడు చోట్ల ఆర్వోబీల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఉండి–పెదపుల్లేరు రైల్వేగేటు, భీమవరం పట్టణంలో ఉండి గేటు, శృంగవృక్షం రైల్వేగేటు వద్ద ఆర్వోబీలకు డిజైన్లు కూడా సిద్ధమయ్యాయి. ఇందుకు పెద్ద ఎత్తున భూసేకరణ కూడా చేయనున్నారు. 20 రోజుల్లో టెండర్లు పిలిచేందుకు జాతీయ రహదారి (ఎన్‌హెచ్) అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే భీమవరంలో ఉండి గేటు వద్ద ఆర్వోబీల నిర్మాణంౖపై వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కేంద్ర స్థాయిలో తీసుకున్న నిర ్ణయమని, తమకు కూడా కొద్దిరోజుల క్రితమే తెలిసిందని నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చెబుతున్నారు.
రూ.125 కోట్లతో భీమవరంలో..
భీమవరం పట్టణంలోని ఉండి రైల్వేగేటు వద్ద రూ.125 కోట్ల వ్యయంతో ఆర్వోబీ నిర్మించనున్నారు. ఆర్వోబీల ప్రతిపాదిత ప్రాంతాల్లో 45 మీటర్లు (150 అడుగులు) రోడ్ల విస్తరణ చేపడతారు. భీమవరంలోని ఉండి రోడ్డు ప్రస్తుతం 50 అడుగులు ఉంది. దీనిని 150 అడుగులకు విస్తరించేందుకు అవసరమైన భూసేకరణ కు అధికారులు సిద్ధమవుతున్నారు. ఆర్వోబీకు ఇరువైపులా రోడ్డును ఏడు మీటర్లు వెడల్పు చేస్తారు. ఉండి రోడ్డులోని వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద నుంచి బొంబే స్వీట్ సెంటర్ వరకూ ఆర్వోబీ నిర్మించనున్నారు. ఆర్వోబీపై ఒకేసారి నాలుగు కార్లు ప్రయాణించేలా డిజైన్ చేశారు.
వ్యాపారుల ఆందోళన
భీమవరంలో ప్రధాన వ్యాపార కేంద్రాలు ఉండి రోడ్డు, జేపీ రోడ్డు, పీపీ రోడ్డులో ఉన్నాయి. ఉండి రోడ్డు 150 అడుగులు విస్తరించి ఆర్వోబీ నిర్మించడానికి ఏర్పాట్లు జరుగుతుండటంతో వర్తక, వాణిజ్య, వ్యాపార సంస్థలు, ఆస్పత్రుల భవనాలు, ఖాళీ స్థలాల యజమానుల్లో ఆందోళన మొదలైంది. ఆర్వోబీ నిర్మిస్తే ఆయా రోడ్ల పక్కన ఒక్క భవనం కూడా మిగలదని వీరంతా అంటున్నారు. దీంతో వీరంతా ఎంపీ, ఎమ్మెల్యేపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
హడావుడిగా సమావేశం
ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మానేపల్లి సూర్యనారాయణగుప్త ఆధ్వర్యంలో ఉండి రోడ్డులో ఆస్తులు ఉన్న 200 మంది ప్రముఖులు మంగళవారం సాయంత్రం భీమవరంలో చాంబర్‌లో సమావేశమయ్యారు. ఎంపీ గంగరాజు, ఎమ్మెల్యే రామాంజనేయులు, మునిసిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు, కౌన్సిల్ ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నేత గాదిరాజు తాతరాజు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాకా వెంకటసత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
ఎక్కడికి పొమ్మంటారు..
ఉండి రోడ్డులో ఆస్తులు పోగొట్టుకుని వ్యాపారాలు లేకుండా ఎక్కడికి పొమ్మంటారని వ్యాపార ప్రముఖులు వబిలిశెట్టి శ్రీవెంకటేశ్వర్లు, కాగిత వెంకటరమణ, బొండా శ్రీరామ్ తదితరులు ప్రజాప్రతినిధులను నిలదీశారు. పట్టణంలోని బైపాస్ రోడ్డులో రైల్వేగేటు పెట్టిస్తే ట్రాఫిక్ సమస్య ఉండేది కాదన్నారు. ఉండి రైల్వేగేటు వద్ద ఆర్వోబీ నిర్మాణంపై ప్రజాభిప్రాయానికి అనుగుణంగా కౌన్సిల్ తీర్మానం చేయనుందని మునిసిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు అన్నారు. ఉండి రైల్వేగేటు వద్ద ఆర్వోబీ డిజైన్ చూశాక మైండ్ బ్లాక్ అయ్యిందని ఎమ్మెల్యే రామాంజనేయులు అన్నారు. ఇక్కడ ఆర్వోబీ ప్రతిపాదన రద్దు చేసి బైపాస్ రోడ్డులో ఆర్వోబీ నిర్మించేలా కషిచేయాలని ఎంపీ గంగరాజును కోరారు.
పార్లమెంట్‌లో ప్రస్తావిస్తా..
ఉండి రోడ్డు ఆర్వోబీ నిర్మాణ ప్రతిపాదన ఆపి బైపాస్ రోడ్డులో ఆర్వోబీ నిర్మాణ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని ఎంపీ గోకరాజు గంగరాజు హామీ ఇచ్చారు. ప్రజలు కూడా ఉండి రోడ్డు ఆర్వోబీ నిర్మాణాన్ని ఆపేందుకు ఉద్యమ కార్యచరణ సిద్ధం చేయాలని సూచించారు.
Advertisement
Advertisement