బరితెగించిన మృగాళ్లు
Published Tue, Jun 13 2017 1:30 AM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM
ఆకివీడు : మృగాళ్లు బరితెగిస్తున్నారు. అభం శుభం తెలియని బాలికలపై అకృత్యాలకు తెగబడుతూనే ఉన్నారు. గతనెల 29న నిడదవోలు ప్రాంతంలో పెళ్లి కుమార్తెపై ఓ మైనర్ బాలుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. తెల్లారితే వివాహం జరగాల్సిన యువతిని చెరకు తోటలోకి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. 14 గంటలపాటు అపస్మారక స్థితిలోనే ఉండిపోయిన ఆ యువతి.. రైతులు గుర్తించడంతో ప్రాణాలతో బయటపడింది. ఆమె వివాహం నిలిచిపోగా.. పెళ్లింట తీరని విషాదం నెలకొంది. ఇదిలావుంటే.. ఈనెల 3న గణపవరంలో 16 ఏళ్ల బాలికపై తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలం పల్ల గ్రామానికి చెందిన మల్లాడి మణికంఠ అనే యువకుడు అత్యాచా రం చేశాడు. ఈ ఘటనల్ని మరువక ముందే సోమవారం ఆకివీడుకు చెందిన మైనర్ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు.
బహిర్భూమికి వెళ్తుండగా..
ఆకివీడు ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక సోమవారం వేకువజామున బహిర్భూమికి వెళ్తుండగా.. ముగ్గురు యువకులు అటకాయించారు. ఆమె నోరు నొక్కి మోటార్ సైకిల్‌పై బైపాస్ రోడ్డులోని పొలాల మధ్య గల పశువుల పాకలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆ మృగాళ్లు ముగ్గురూ ఆకివీడు పెదపేటకు చెందిన బొండాడ కిరణ్, సోమల సునిల్, చీకటపల్లి కిరణ్‌గా పోలీసులు గుర్తించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం భీమవరంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితులపై కిడ్నాప్, అత్యాచారం, నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేశామన్నారు. ఈ దుర్మార్గంతో ఓ నిరుపేద కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ దారుణానికి బలైన బాలిక అమ్మమ్మ ఇంటివద్ద ఉంటూ చదువుకుంటోంది. తమ బిడ్డలకు మంచి భవిష్యత్ ఇవ్వాలనే ఉద్దేశంతో తల్లి అరబ్ దేశాలకు వెళ్లి పని చేస్తుండగా.. తండ్రి వేరు గ్రామంలో కూలి పనులు చేస్తున్నాడు. ఆ బాలిక, ఆమె సోదరి అమ్మమ్మ ఇంటివద్ద ఉంటున్నారు. ఆమెపై కన్నేసిన ముగ్గురు యువకులు అదును కోసం ఎదురు చూశారు. బాలిక తమ ఇంటికి సమీపంలో బహిర్భూమికి వెళ్తుండగా ఎత్తుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు.
అదో మద్యం అడ్డా
బాలిక అత్యాచారానికి గురైన పశువుల పాక ప్రాంతం మందుబాబులకు అడ్డాగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ పాకకు పక్కనే పదుల సంఖ్యలో ఖాళీ బీరు సీసాలు, మద్యం సీసాలు దర్శనమివ్వడం ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ఘటనా స్థలాన్ని డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు, భీమవరం రూరల్ సీఐ ఎస్‌ఎస్‌వీ నాగరాజు, ఇన్‌చార్జి ఎస్సై ఎం.రవివర్మ పరిశీలించారు. నిందితులు ముగ్గురుపై కిడ్నాప్, అత్యాచారం, నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నట్టు చెబుతున్నారు.
Advertisement
Advertisement