వేరుశనగ 60 శాతం
సాధారణ సాగు 8.01 లక్షల హెక్టార్లు
వేరుశనగ సాధారణ సాగు 6.04 లక్షల హెక్టార్లు
సాగయిన పంట : 3.80 లక్షల హెక్టార్లు
ప్రస్తుత ఖరీఫ్ సాగు : 4.55 లక్షల హెక్టార్లు
అనంతపురం అగ్రికల్చర్: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది ఖరీఫ్ అతి కష్టం మీద సాగుతోంది. వర్షాలు అదును దాటి కురుస్తుండటంతో పంటల సాగు విషయంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా ఒక అంచనాకు రాలేని పరిస్థితి నెలకొంది. ప్రధాన పంట వేరుశనగ 6.04 లక్షల హెక్టార్లకు గాను ఎట్టకేలకు 3.60 లక్షల హెక్టార్లలో సాగయింది. అంటే 60 శాతం విస్తీర్ణంలో పంటలు సాగు చేయడంతో.. ఒకవేళ దెబ్బతిన్నా పెట్టుబడి రాయితీ(ఇన్‌పుట్ సబ్సిడీ) మంజూరుకు మార్గం సుగమమైంది. గత జూన్‌లో 63.9 మిల్లీమీటర్లకు గాను 59.2 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో వేరుశనగ సాగుకు రైతులు సిద్ధమయ్యారు. అయితే కీలకమైన జూలై నెలలో వరుణుడు ముఖం చాటేయడంతో సాగు పడకేసింది. జూలైలో 67.4 మిల్లీమీటర్లకు గాను 55 శాతంతక్కువగా 31.4 మిల్లీమీటర్లకే పరిమితమైంది. నైరుతి రుతు పవనాలు, అల్ప పీడనాలు ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో ఆగస్టు 5వ తేదీ వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ కారణంగా వేరుశనగ, కంది, ఆముదం, పత్తి, మొక్కజొన్న తదితర అన్ని పంటలు ఎండుముఖం పట్టాయి. ఇక ఈ ఏడాది మొదట్లోనే కరువు రక్కసి అనంత రైతులను ఉక్కిరిబిక్కిరి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం రెయిన్‌గన్ల పేరిట కొద్ది రోజులు హడావుడి చేసినా ఒక్క ఎకరా వేరుశనగ పంటను కూడా కాపాడలేకపోయారు. ఆగస్టు 5 తర్వాత వాతావరణంలో కాస్త మార్పు వచ్చింది. అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. ఐదారు మండలాల్లో భారీ వర్షపాతం నమోదయింది. ఆగస్టులో 88.7 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కాగా 96.3 మిల్లీమీటర్లు నమోదయింది. ఇదంతా 15 రోజుల్లో కురిసిన వర్షమే కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఎండుతున్న పంటలకు జీవం వస్తోంది. అయితే వేరుశనగలో శనగపచ్చ పురుగు, పత్తిలో ప్రమాదకరమైన గులాబిరంగు పురుగు, ఆముదంలో నామాల పురుగు, మొక్కజొన్నలో తామర పురుగు బెడద కారణంగా రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రత్యామ్నాయం అంతంతే..
ఆరు లక్షల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలు వేయించాలని వ్యవసాయశాఖ ప్రణాళిక రూపొందించినా అందులో సగం విస్తీర్ణంలో కూడా పంటలు వేసే పరిస్థితి కనిపించడం లేదు. అయితే వేరుశనగ 3.60 లక్షల హెక్టార్లు, కంది 43వేల హెక్టార్లు, ప్రత్తి 24 వేల హెక్టార్లు, ఆముదం 6వేల హెక్టార్లు, మొక్కజొన్న 8,400 హెక్టార్లలో వేయడంతో ఖరీఫ్ విస్తీర్ణం 57 శాతం పూర్తయింది. ఇక ప్రత్యామ్నాయం 20 శాతం విస్తీర్ణంలో సాగులోకి వచ్చే అవకాశం ఉండగా.. మొత్తం మీద 20 శాతం విస్తీర్ణం ఈ సారి బీడు భూములుగా మిగిలిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జొన్న, పెసలు, అలసంద, ఉలవ తదితర పంటలు వేస్తున్నారు. సెప్టెంబర్‌లో కూడా ఈ పంటలు వేసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
30 మండలాల్లో తగ్గిన వేరుశనగ
వేరుశనగ పంట 60 శాతం విస్తీర్ణంలో సాగులోకి వచ్చినా 30 మండలాల్లో 50 శాతం లోపు విస్తీర్ణంలో వేశారు. ఆత్మకూరు, బత్తలపల్లి, తాడిమర్రి, ధర్మవరం, అమరాపురం, అగళి, గుడిబండ, బుక్కపట్టణం, కదిరి, నల్లమాడ, గాండ్లపెంట తదితర మండలాల్లో విస్తీర్ణం బాగా పెరిగింది. శింగనమల, గుత్తి, రామగిరి, ఉరవకొండ, వజ్రకరూరు, రొళ్ల, మడకశిర, డి.హిరేహాల్, కనేకల్లు, రాయదుర్గం, బొమ్మనహాల్, కుందుర్పి, కంబదూరు, రాప్తాడు, రొద్దం, పెనుకొండ, తాడిపత్రి, నార్పల, ఎన్‌పీ కుంట, తలుపుల తదితర మండలాల్లో వేరుశనగ విస్తీర్ణం తక్కువగా ఉంది.
ప్రస్తుత ఖరీఫ్‌లో పంటల సాగు
––––––––––––––––––––––––––––––––––––
పంట సాధారణ సాగు సాగులోని విస్తీర్ణం
(హెక్టార్లలో) (హెక్టార్లలో)
––––––––––––––––––––––––––––––––––––
వేరుశనగ 6,04,100 3,60,120
కంది 50,570 43,259
ప్రత్తి 46,161 24,840
ఆముదం 13,292 6,029
మొక్కజొన్న 18,768 8,388
జొన్న 12,560 1,220
వరి 22,169 2,267
సజ్జ 2,191 2,441
రాగి 1,420 842
కొర్ర 3,217 1,224
ఉలవ 6,335 818
పెసర 6,357 729
అలసంద 1,320 249