పెరిగిన వేరుశనగ సాగు
4.10 లక్షల హెక్టార్లకు చేరుకున్న విస్తీర్ణం
మరో 1.10 లక్షల హెక్టార్లలో ఇతర పంటలు
అనంతపురం అగ్రికల్చర్: వేరుశనగ పంట విస్తీర్ణం 4.10 లక్షల హెక్టార్లకు పెరిగింది. వ్యవసాయశాఖ తాజాగా తయారు చేసిన నివేదిక ప్రకారం వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 6.04 లక్షల హెక్టార్లు కాగా...ప్రస్తుతం 4.10 లక్షల హెక్టార్లలో సాగు చేశారు. ఇందులో నీటి వసతి కింద 12 వేల హెక్టార్లు, వర్షాధారంగా 3.98 లక్షల హెక్టార్లలో విత్తుకున్నారు. మరో 1.10 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఇతరత్రా పంటలు సాగులో ఉన్నాయి. మొత్తమ్మీద ఈ ఖరీఫ్‌లో 8.01 లక్షల హెక్టార్ల సాధారణ సాగుకు గానూ ఇప్పటివరకు అన్ని పంటలు కలిపి 5.20 లక్షల హెక్టార్లు సాగులో ఉన్నాయి.
ఇంకా ప్రత్యామ్నాయ పంటలు వేసే అవకాశం ఉన్నందున విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. వేరుశనగ తర్వాత 48 వేల హెక్టార్లలో కంది, 30,100 హెక్టార్లలో పత్తి , 10,600 హెక్టార్లలో మొక్కజొన్న, 6,600 హెక్టార్లలో ఆముదం, 2,200 హెక్టార్లలో జొన్న, 2,700 హెక్టార్లలో సజ్జ , 1,600 హెక్టార్లలో కొర్ర, 1,100 హెక్టార్లలో ఉలవ వేశారు. ఇక వరి పంట ప్రస్తుతానికి 3,400 హెక్టార్లలో నాట్లు వేయగా ఇది మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.