పెరిగిన కంది సాగు
ఫలించిన అధికారుల ప్రచారం
మెట్ట పంటసాగుపై ఆసక్తి చూపిన రైతులు
ఈ ఏడాది కంది సాగు1000 ఎకరాల పెంపు
పెన్‌పహాడ్: ఈ ఏడాది మండలంలో కంది సాగు భారీగా పెరిగింది. వేసవిలో మండలంలోని ఆయా గ్రామాల్లో వ్యవసాయ అధికారులు పత్తిని తగ్గించి పప్పుధాన్యాల సాగును పెంచాలని సూచించారు. గతేడాది ప్రతికూల వాతావరణం, లద్దె పురుగు బెడదతో ఆశించిన దిగుబడి రాలేదు. కంది పప్పు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రైతులు ఈ పంటసాగుపై ఆసక్తి కనబర్చారు. గత ఏడాది మండల వ్యాప్తంగా 2500ఎకరాల్లో కంది పంటను సాగు చేశారు. ఈ సారి 3500ఎకరాల్లో సాగు చేశారు. సింగారెడ్డిపాలెం, అనంతారం, మాచారం, గాజులమల్కాపురం, చెట్లముకుందాపురం, చీదెళ్ల, నారాయణగూడెం, పొట్లపహాడ్, భక్తాళాపురం, ధర్మాపురం తదితర గ్రామాల్లో కంది పంటను విరివిగా సాగు చేశారు. అందులో పెసరను అంతర పంటగా సాగు చేస్తున్నారు. జాతీయ గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద వ్యవసాయ శాఖ మండలంలోని గాజులమల్కాపురం గ్రామంలో సబ్సిడీ కంది విత్తనాలను పంపిణీ చేశారు. ఇతర గ్రామాల రైతులు వారి వద్ద గల కంది విత్తనాలను పొలంలో విత్తుకున్నారు. ప్రస్తుతం అధికారులు వివిధ గ్రామాల్లో రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి పంట సాగులో తీసుకోవాల్సిన మొలకువలపై అవగాహన కల్పిస్తున్నారు. కంది దిగుబడి పెంచుకోవడం, పెట్టుబడులు తగ్గించుకోవడంపై రైతులకు సూచనలు చేస్తున్నారు. జూన్‌లో ఓ మోస్తారు వర్షం కురవడంతో జూలైలో ఆడపాదడపా వర్షాలు కురుస్తుస్తున్నాయి. దీంతో రైతులు పంట దిగుబడులపై భారీగా ఆశలు పెట్టుకున్నారు.
తెగుళ్లతోనే భయం–సాయిరి నరేష్, అనంతారం
గత ఏడాది కంది పంటకు తెగుళ్ల బెడద ఎక్కువగా ఉండటంతో దిగుబడి రాలేదు. ఈసారి తెగుళ్ల వాప్తిపై ఆందోళన, భయంగా ఉంది. అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తున్నాం. ఈ ఏడాది రెండు ఎకరాల్లో కంది సాగు చేశాను.
లాభసాటి పంటే –ఏఓ బి. కృష్ణసందీప్
కంది లాభసాటి పంట. జాతీయ ఆహార పథకం కంది సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేస్తున్నాం. రైతులు అధికారుల సూచనలు పాటించి దిగుబడిని పెంచుకోవాలి. క్రమంగా పత్తిని తగ్గించి పప్పుధాన్యాల పంటలను వేయడం రైతుకు శ్రేయస్కరం.