గూడూరు జెడ్పీటీసీ సభ్యుడి సస్పెన్షన్ !
-
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆదేశం
-
అటవీ భూముల ఆక్రమణపై చర్యలు
హన్మకొండ అర్బన్ : గూడూరు మండల జెడ్పీటీసీ సభ్యుడు ఎం.డి.ఖాసీంను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఖాసీం అటవీ భూములు ఆక్రమించినట్టు వచ్చిన ఫిర్యాదులపై విచారణ అనంతరం జిల్లా కలెక్టర్ పంపిన నివేదిక ఆధారంగా మంత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గూడూరు మండల పరిధిలో జెడ్పీటీసీ సభ్యుడు ఖాసీం 50ఎకరాల అటవీ భూమి ఆక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంట్లో 25కరాలు తమ పేరుమీద, మరో 25 ఎకరాలు తన బినామీల పేరుతో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ విచారణలో వెల్లడైంది. దీంతో జెడ్పీటీసీ సభ్యత్వం రద్దుతోపాటు కేసుల నమోదుకు జిల్లా కలెక్టర్ సిఫారసు చేశారు. కలెక్టర్ సిఫారసును పరిశీలించిన మంత్రి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
సస్పెన్షన్ అంటే...
జెడ్పీటీసీ సభుడిని సస్పెండ్ చేయడం అంటే ఇకపై సదరు సభ్యునికి ప్రొటోకాల్ పాటించరు. అధికారిక కార్యక్రమాలకు మండల స్థాయిలో ఆహ్వానం ఉండదు. జిల్లా పరిషత్ సమావేశాలకు అతనికి ఆహ్వానం, ప్రవేశం ఉండదు. జిల్లాలో ఒక జెడ్పీటీసీ సభ్యుడిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఇదే ప్రథమం. ఈ ఘటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఖాసీం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పటికే ఖాసీంపై పలు సెక్షన్ల కింద కేసులు ఉన్నాయి. పార్టీ మారినా ప్రభుత్వ వైఖరి మారకపోవడంతో ఖాసీంకు కష్టాలు తప్పలేదు.