లక్షకు అర లక్ష వడ్డీ..! | half lakh interest of one lakh cash | Sakshi
Sakshi News home page

లక్షకు అర లక్ష వడ్డీ..!

Published Wed, Dec 7 2016 10:51 PM | Last Updated on Wed, Sep 26 2018 6:32 PM

లక్షకు అర లక్ష వడ్డీ..! - Sakshi

లక్షకు అర లక్ష వడ్డీ..!

– కంతులన్నీ చెల్లించినా రికార్డులు ఇవ్వని ఫైనాన్స్‌ వ్యాపారి
– అదనపు వడ్డీ చెల్లించకపోతే ఇచ్చేది లేదని హుకుం
– బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు


కదిరి : లక్ష రూపాయలకు అర లక్ష వడ్డీ బహుశా ఎక్కడా ఉండదేమే. కాని కదిరిలో ఉంది. వరుస కరువులతో ఈ ప్రాంత రైతులు అల్లాడిపోతుంటే ఆ కరువునే కొందరు ఫైనాన్స్‌ వ్యాపారులు 'క్యాష్‌' చేసుకుంటున్నారు. ఓ రైతు జీవనోపాధికోసం కదిరిలోని ఓ ఫైనాన్స్‌ కంపెనీలో రూ.1 లక్ష రుణం తీసుకుంటే చివరకు అర లక్షకు పైగా వడ్డీ చెల్లిస్తే గానీ ఆ ట్రాక్టర్‌కు సంబంధించిన రికార్డులు ఇచ్చేది లేదని రెండు నెలలుగా తిప్పుకుంటున్నాడు. విసిగిపోయిన రైతు బుధవారం కదిరి పట్టణ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడు పోలీసులకిచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి.

       ఓడి చెరువు మండలం దాదిరెడ్డిపల్లికి చెందిన రైతు ఎద్దుల హనుమంతురెడ్డి 2015 ఏప్రిల్‌ 28న కదిరిలోని లక్ష్మి వినాయక ఆటోఫైనాన్స్‌ కంపెనీలో ట్రాక్టర్‌ కోసం రూ.1 లక్ష రుణం తీసుకున్నాడు. అయితే అగ్రిమెంట్లు, ఇతరత్రా అంటూ రూ. 6 వేలు కోత వేసి ఆ రైతుకు చేతికి  కేవలం రూ.94 వేలు మాత్రం ఇచ్చారు. మొదటి కంతు రూ.11 వేలు, మిగిలిన 14 కంతులు నెలకు రూ.8,500 చొప్పున మొత్తం రూ1.30 లక్షలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈమేరకు హనుమంతరెడ్డి ప్రతి నెలా కంతులు సకాలంలో చెల్లించుకుంటూ వచ్చారు. అయితే చివరి కంతు 2016 జూలై 28న చెల్లించాల్సి ఉండగా ఆ రైతుకు డబ్బు అందుబాటు కాక అక్టోబర్‌ నెలాఖరులో చెల్లించి, ఇక అప్పు లేదనుకున్నారు. 'మీ అప్పు తీర్చేశాను.

మీ దగ్గర పెట్టుకున్న నా ట్రాక్టర్‌కు సంబంధించిన రికార్డులు ఇవ్వండి' అని అడిగితే మీరు కంతులు ఆలస్యంగా చెల్లించినందుకు అదనపు వడ్డీ ఇంకా రూ.21,300 చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఆ డబ్బు ఇస్తేగానీ రికార్డులు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. తిరిగి తిరిగి విసిగి వేసారి పోయిన ఆ రైతు ఆఖరు ప్రయత్నంగా బుధవారం మళ్లీ వెళ్లి అడిగాడు. కానీ ఈసారి ఆ రైతుకు చేదు అనుభవం ఎదురైంది. 'రేయ్‌ నీకు ఎన్నిసార్లు చెప్పాలి. ట్రాక్టర్‌కు కట్టేసి ఊరంతా తిప్పుతా. 

ప్రాణాలతో ఉండాలంటే ఆ రూ.21,300 చెల్లించి తీసుకెళ్లు. లేదంటే ప్రాణాలు గాలిలో కలిసిపోతాయ్‌..' అని బెదిరించడంతో ఆ రైతు భయపడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పట్టణ ఎస్‌ఐ గోపాలుడు కేసు విచారిస్తున్నారు. దీనిపై 'సాక్షి' ఆ ఫైనాన్స్‌ సంస్థలో కెళ్లి వివరణ అడిగితే  మిగతా ఫైనాన్స్‌ కంపెనీల్లో వడ్డీ ఎంతో తెలుసా మీకు అని ప్రశ్నించారు. కంతులు సకాలంలో చెల్లించకపోతే అదనవడ్డీ వసూలు చేస్తాం'అన్నారు. నూటికి వడ్డీ ఎంత తీసుకుంటున్నారని అడిగితే అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement