హరోం.. హరా..
హరోం.. హరా..
Published Wed, Jul 27 2016 10:45 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
–నేడు ‘ఆడికృత్తిక’ వేడుక
– మొక్కులు తీర్చుకోనున్న భక్తులు
– శ్రీకాళహస్తి, ఊట్లవారిపల్లె, తనపల్లెల్లో ఏర్పాట్లు
– తిరుత్తణికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
సాక్షి ప్రతినిధి, తిరుపతి :
భక్తులు కోరిన కోర్కెలు తీర్చే మహిమ గల స్వామిగా పేరున్న శ్రీ వల్లీ–దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ‘ఆడి కృత్తిక’ పండుగ గురువారం వైభవంగా జరుగనుంది. జిల్లాలోని శ్రీకాళహస్తి, తనపల్లె, ఊట్లవారిపల్లె, గుడుపల్లె ప్రాంతాల్లోని స్వామివారి ఆలయాలు ప్రత్యేక పూజలకు సిద్ధమయ్యాయి. ఏటా ఆడి మాసంలో వచ్చే భరణితోపాటు కృత్తిక రోజున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించి కావడి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు తరలి వెళ్తుంటారు. ప్రధానంగా తమిళనాడులో వైభవోపేతంగా నిర్వహించుకునే ఈ కావడి పండుగను సరిహద్దు జిల్లాలైన చిత్తూరు, నెల్లూరు వాసులు అంతే భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు. ఇందులో భాగంగా రెండు జిల్లాల భక్తులు ఎక్కువ మంది తమిళనాడులోని తిరుత్తణి పుణ్యక్షేత్రానికి వెళ్లి మొక్కులు తీర్చుకునేందుకు ఆసక్తి చూపుతారు. కాగా శ్రీకాళహస్తి ప్రధాన ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీవల్లీ దేవసేన సమేత చెంగల్రాయుని ఆలయం, ఇక్కడికి సమీపంలోని కొండ మీదున్న కుమారస్వామి ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. అదేవిధంగా పాకాల మండలం ఊట్లవారిపల్లె, తిరుచానూర్ పక్కనే ఉన్న తనపల్లె సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాల్లో ఉదయం 4 గంటల నుంచే ప్రత్యేక పూజలు, అర్చనలు జరుగుతాయని ఆయా ఆలయాల నిర్వాహకులు తెలిపారు. పూల, పాల,పన్నీరు కావళ్లతో వేలాది మంది భక్తులు ఆలయాలకు చేరి ప్రదక్షిణలు చేసి మనసారా దేవుని ప్రార్థించి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. తిరుపతి, చంద్రగిరి, తిరుచానూరు, చిత్తూరు, గుడిపాల, జీడీనెల్లూరు, ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తిరుత్తణి కూడా వెళ్తుంటారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు గురు, శుక్రవారాల్లో ఆలయాలకు ప్రత్యేక బస్సులను నడపనున్నారు.
22 ప్రత్యేక బస్సులు...
తిరుపతి నుంచి తిరుత్తణి వెళ్లే భక్తుల కోసం పచ్చికాపలం, కార్వేటినగరం, పళ్లిపట్టు, బలిజకండ్రిగల మీదుగా ఏడు బస్సులను ఆపరేట్ చేస్తున్నట్లు ఆర్టీసీ ఆర్‌ఎం నాగశివుడు తెలిపారు. అదేవిధంగా శ్రీకాళహస్తి నుంచి తిరుత్తణి వెళ్లే భక్తుల కోసం వయా సత్యవేడు, బీఎన్ కండ్రిగల మీదుగా మూడు బస్సులు, తిరుపతి నుంచి పుత్తూరు, నగరి మీదుగా తిరుత్తణి వరకూ 15 బస్సులు నడుపుతున్నట్లు ఆయన వివరించారు. ఆలయాల వద్ద ప్రత్యేక పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తిరుపతి, శ్రీకాళహస్తి పోలీసువర్గాలు తెలిపాయి.
Advertisement
Advertisement