హర్తాళ్ ప్రశాంతం
హర్తాళ్ ప్రశాంతం
Published Mon, Nov 28 2016 11:18 PM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM
మూతపడిన విద్యాసంస్థలు
తెరుచుకోని దుకాణాలు
జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, రాస్తారోకోలు
నేతల అరెస్ట్
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
తగిన ఏర్పాట్లు చేయకుండా పెద్దనోట్లను రద్దు చేయడాన్ని నిరసిస్తూ.. నోట్ల రద్దు సందర్భంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు సోమవారం జిల్లాలో తలపెట్టిన హర్తాళ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పలుచోట్ల నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యాసంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. పలుచోట్ల వాణిజ్య, వ్యాపార సంస్థళను స్వచ్ఛందంగా మూసివేశారు. జిల్లావ్యాప్తంగా ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు జరిగాయి. పోలీస్ బందోబస్తు నడుమ ఆర్టీసీ బస్సులను నడిపారు. సరైన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకుండా పెద్దనోట్లను రద్దు చేయడాన్ని, అనంతరం తలెత్తిన ఇబ్బందులను పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యాలను విపక్ష నేతలు ఎండగట్టారు. వైఎస్సార్ సీపీ, ఇతర ప్రతిపక్ష నేతలు తణుకు నరేంద్ర సెంటర్‌లో ధర్నా నిర్వహించి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి బయలుదేరారు. వెంకటేశ్వర థియేటర్ వద్ద మోహరించిన పోలీసులు ర్యాలీని అడ్డుకుని నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి నాగేశ్వరరావు సహా 27 మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. పాలకొల్లులో గాంధీబొమ్మల సెంటర్‌లో హర్తాళ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ అదనపు కన్వీనర్ గుణ్ణం నాగబాబు, జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ చెల్లెం ఆనందప్రకాష్ నేతృత్వం వహించారు. కార్యక్రమంలో వామపక్షాలు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, సీపీఎం, న్యూడెమోక్రసీ నాయకుల ఆధ్వర్యంలో బుట్టాయగూడెంలో ర్యాలీ, మానవహారం, రాస్తారోకో చేశారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పోలవరం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. చింతలపూడి బోసుబొమ్మ సెంటర్‌లో జరిగిన ధర్నాలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దయాల నవీన్‌బాబు, కామవరపుకోటలో నియోజకవర్గ కన్వీనర్ ఘంటా మురళీరామకృష్ణ, జంగారెడ్డిగూడెంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. తాడేపల్లిగూడెంలో ఉదయం 5 గంటలకే ఆర్టీసీ డిపోకు చేరుకుని బస్సులను రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించిన వైఎస్సార్ సీపీ, వామపక్ష పార్టీలకు చెందిన 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్ సీపీ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పట్టణంలో, పెంటపాడు మండలంలో ప్రదర్శన నిర్వహించారు. సీపీఐ, సీపీఎం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కొవ్యూరు విజయవిహార్ సెంటర్‌లో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి తానేటి వనిత ఆధ్వర్యంలో మానవహారంగా ఏర్పడి నిరసన తెలియచేశారు. Üసీపీఎం, సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల ఆ«ధ్వర్యంలో ర్యాలీ జరిగింది. పెనుమంట్ర మండలం మార్టేరులో ఆచంట నియోజకవర్గ సమన్వయకర్త కవురు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఆచంటలో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఏలూరులో వామపక్షాల నాయకులు జూట్‌మిల్లు వద్ద ధర్నా నిర్వహించారు. వైఎసార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, మంచెం మైబాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నగరంలో ర్యాలీ నిర్వహించి దుకాణాలు మూసివేయాల్సిందిగా కోరారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫైర్‌స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. నిడదవోలులో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్ ఎస్.రాజీవ్‌కృష్ణ ఆధ్వర్యంలో మోటార్ సైకిళ్ల ర్యాలీ జరిగింది. 35 మంది సీపీఎం, సీపీఐ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. గోపాలపురం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు నేతృత్వంలో హర్తాళ్ జరిగింది. పలుచోట్ల రాస్తారోకో, «ధర్నా ర్యాలీలు నిర్వహించారు. ఉంగుటూరు మండలంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. విద్యాసంస్థలను మూయించి వేశారు. భీమడోలులో రాస్తారోకో నిర్వహించారు. నిడమర్రు, గణపవరంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. బీమవరంలో వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు కోడే యుగంధర్, కౌన్సిలర్లు గాదిరాజు సత్యవెంకటసుబ్రహ్మణ్యం రాజు, భూసారపు సాయిసత్యనారాయణ, పాలవెల్లి మంగ, సీపీఐ నాయకుడు మంతెన సీతారామ్‌ప్రసాద్, సీపీఎం నాయకులు మంతెన సీతారామ్, జేఎన్‌వీ గోపాలన్, బీవీ వర్మ తదితరుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. నరసారంలో విద్యాసంస్థలు, వ్యాపారవర్గాలు స్వచ్ఛందంగా హర్తాళ్‌కు మద్దతు తెలిపాయి. వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ , కాంగ్రె పార్టీల నాయకులు బస్టాండ్ సెంటర్‌కు చేరుకుని రాస్తారోకో చేపట్టారు. నరసాపురం సీఐ పిరామచంద్రరావు, ఎస్సైలు కె.చంద్రశేఖర్, కె.సతీష్‌కుమార్ వచ్చి ఆందోళనను భగ్నం చేసారు. దీంతో ఆందోళనకారులు శివాలయం సెంటర్ వరకూ ర్యాలీ జరిపారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు పీడీ రాజు, సీపీఎం డివిజన్ కార్యదర్శి కవురు పెద్దిరాజు తదితరులు నేతృత్వం వహించారు. దెందులూరులో విద్యాసంస్థలను మూయించివేశారు. ఉండిలో వైఎస్సార్ కాంగ్రెస్, వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఆకివీడులో వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు.
Advertisement
Advertisement