ఏసీబీ వలలో హెచ్‌సీ
Published Thu, Aug 11 2016 11:59 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
HC in ACB trap
ఏసీబీ వలలో హెచ్‌సీ, HC,ACB,trap
దేవరాపల్లి: దేవరాపల్లి పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ ఎస్.వెంకట అప్పారావు ఏసీబీ వలకు చిక్కాడు. బాలిక కిడ్నాప్ కేసులో రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా గురువారం రాత్రి అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. మండలంలోని వెంకటరాజుపురం గ్రామానికి చెందిన ఓ బాలిక కిడ్నాప్ కేసు విషయమై 10 వేలు లంచం డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల పథకం మేరకు బాధితుడి నుండి 10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దేవరాపల్లి నాలుగు రోడ్ల జంక్షన్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అక్కడి నుండి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. ఏసీబీ డీఎస్పీ కె.రామకష్ణ ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటరాజుపురం గ్రామంలో ఓ బాలిక ఈ నెల 3న కిడ్నాప్‌కు గురైనట్లు కుటుంబ సభ్యులు 5వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ఆచూకి 7వ తేదీన తెలిసింది. కేసు నమోదు చేసి నిందితుడిని 9న రిమాండ్‌కు తరలించారు. రిమాండ్‌లో ఉన్న నిందితుడు భోజంకి సంతోష్ భవిష్యత్‌లో బాలిక జోలికి రాకుండా ఉంచడంతో పాటు అతనికి బెయిల్ రాకుండా చేస్తానని చెప్పి స్టేషన్ ఖర్చులకు రూ. 5 వేలు, తనకు అదనంగా మరో ఐదు వేలు ఇవ్వాలని హెచ్‌సీ వెంకటఅప్పారావు డిమాండ్ చేశారు. అంత సొమ్ము ప్రస్తుతం ఇచ్చుకోలేమని, నాలుగైదు రోజులు గడువు కావాలని కోరారు. అతని చేష్టలపై విసుగు చెందిన బాలిక మేనమామ లెక్కల శ్రీనివాసరావు ఏసీబీ డీఎస్పీని ఆశ్రయించారు. దీంతో రంగంలో దిగిన ఏసీబీ డీఎస్పీ కె.రామకష్ణ ప్రసాద్, సీఐలు కె.గణేష్, ఎం.వి. రమణమూర్తిలతో కూడిన బందం ప్రథకం రచించింది. ఈ మేరకు గురువారం రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో 10 వేలు లంచం తీసుకుంటుండగా హెచ్‌సీని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. హెచ్‌సీని శుక్రవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. కాగా, దేవరాపల్లిలో పోలీసులపై ఏసీబీ అధికారులు దాడి చేశారన్న విషయం తెలియడంతో మండలంలోని ఇతర పోలీస్ అధికార్లు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు.
Advertisement
Advertisement