
ఆయన అక్కడ గెలవాలి...
వరంగల్ లోక్‌సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక ఒక మాజీ ఎమ్మెల్యేను ఆశల పల్లకీలో ఊరేగిస్తున్నది. ఉప ఎన్నిక ఏమిటీ మాజీ ఎమ్మెల్యేలో ఆశలు రేకెత్తించడమేమిటని అనుకుంటున్నారా ? అనుకోని పరిస్థితుల్లో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ వరంగల్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి కావడం తన రాజకీయ భవిష్యత్‌కు కలిసొస్తుందని ఈ మాజీ గట్టిగా విశ్వసిస్తున్నారు. గత ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎంపీ సీటుకు సర్వే పోటీచేసి ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్ ఉప ఎన్నికల్లో సర్వే గెలిస్తే, తనకు మల్కాజ్‌గిరి టిక్కెట్టుకు ఆయన అడ్డు ఉండదని లెక్కలు వేసుకుంటున్నాడట.
అంతేకాకుండా ఈ ఎంపీ సీటుకు అధిష్ఠానం వద్ద సర్వేనే తనను రికమెండ్ చేస్తారని నమ్ముతున్నారట. ఈ నమ్మకంతో ఉప ఎన్నికల ప్రచారంలో రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం చేస్తున్నారట. అంతే కాకుండా ప్రచారానికయ్యే ఖర్చును, ఎన్నికల వ్యయాన్ని కూడా తనవంతుగా భరిస్తున్నాడట. ఈ మాజీ ఎమ్మెల్యే తీరును చూసి ఇది అయ్యేది కాదు పొయ్యేది కాదని... ఈ పేరుతో సదరు నేత చేతి చమురు మాత్రం బాగానే వదులుతోందని సహచరనాయకులు గుసగుసలు పోవడం కొసమెరుపు.