Warangal election
-
వరంగల్‌లో 1350 నామినేషన్లు
సాక్షి ప్రతినిధి, వరంగల్: గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో నామినేషన్లు వెల్లువెత్తాయి. మొత్తం 58 డివిజన్లకు 1350 నామినేషన్లు దాఖలయ్యాయి. అధికార టీఆర్ఎస్ నుంచి అత్యధికంగా 579 నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ తరఫున 188, బీజేపీ నుంచి 114, టీడీపీ నుంచి 91, సీపీఎం నుంచి 22, వైఎస్సార్సీపీ 15, సీపీఐ నుంచి ఎనిమిది, బీఎస్పీ నుంచి ఆరు, ఎంఐఎం నుంచి మూడు, స్వతంత్రులు తరఫున 224 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల దాఖలు గడువు బుధవారం ముగియగా ఉపసంహరణల ప్రక్రియ శుక్రవారం జరగనుంది. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ వదిన స్వర్ణలతకు, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి కోడలు అశ్రీతరెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ సోదరుడు విజయభాస్కర్‌కు టీఆర్ఎస్ టికెట్లు ఇచ్చింది. ఖమ్మంలో 587 నామినేషన్లు సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలో మొత్తం 587మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు అయ్యాయి. వీరిలో బీజేిపీ-12, సీపీఐ -20, సీపీఎం -53, కాంగ్రెస్ - 93, టీడీపీ-87, టీఆర్ఎస్ -139, వైఎస్సార్సీపీ -68, స్వతంత్ర అభ్యర్థులు 115 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
టీ కాంగ్ నేతలకు హైకమాండ్ పిలుపు
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. తెలంగాణ పీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసన పక్ష నేత జానా రెడ్డితో పాటు శాసన మండలి నేత షబ్బీర్ ఆలీ మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. వరంగల్ ఉప ఎన్నిక ఓటమితో పాటు, తెలంగాణలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలపై హైకమాండ్‌తో కాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్, పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయ్యే అవకాశముంది. వరంగల్ ఉప ఎన్నికల్లో చివర నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థి మార్పు, ప్రచారంలో లోపాలు, అధికార పార్టీని ఎదుర్కోవడంలో విఫలమైన అంశాలతో పాటు, ఓటమి గల కారణాలను నాయకులు హైకమాండ్‌కు వివరించనున్నారు. అధికార పార్టీ టిఆర్ఎస్కి వచ్చిన భారీ మెజార్టీపై కూడా అధిష్టానం ఆరా తీసే అవకాశముంది. వచ్చే నెలాఖరులో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, గ్రేటర్ ఎన్నికలపై పట్టు సాధించే దిశగా పని చేసేందుకు నాయకులకు అధిష్టానం దిశానిర్దేశం చేయనుంది. -
అందరం బాగానే కష్టపడ్డాం
♦ వరంగల్ ఉప ఎన్నికపై టీపీసీసీ సంతృప్తి ♦ రాజయ్య ఇంట్లో ‘దుర్ఘటన’ జరగకుంటే పరిస్థితి మెరుగయ్యేదని అంచనా ♦ అయినప్పటికీ నేతలంతా ఐక్యంగా పనిచేశారని విశ్లేషణ ♦ గెలుపోటములు ఎలా ఉన్నా భవిష్యత్తుపై ధీమా సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో పార్టీ నేతల పనితీరుపై టీపీసీసీ సంతృప్తి వ్యక్తం చేస్తోంది. పార్టీ అధికారంలో లేకున్నా సాధారణ ఎన్నికలకు ఇంకా మూడేళ్లు ఉన్న ఈ సమయంలో జరిగిన ఉప ఎన్నికలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిదాకా పార్టీ నేతలు ఐక్యంగా పనిచేశారని అభిప్రాయపడుతోంది. ముఖ్యంగా తొలుత ప్రకటించిన అభ్యర్థి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య నివాసంలో జరిగిన ‘దుర్ఘటన’ తాలూకూ షాక్ నుంచి త్వరగా తేరుకోవడంతోపాటు పార్టీ నేతలను సమన్వయం చేసుకోవడంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క ఇతర ముఖ్య నేతలు జాగ్రత్తగానే వ్యవహరించారని విశ్లేషిస్తోంది. అలాగే పార్టీ జాతీయస్థాయి నేతలైన మీరాకుమార్, సచిన్ పైలట్, సుశీల్‌కుమార్ షిండే, గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్‌సింగ్ తదితరులు ప్రచారానికి తగిన సమయాన్ని కేటాయించినట్టుగానే పేర్కొంటోంది. గెలుపోటములు ఎలా ఉన్నా పార్టీ నేతలు చూపిన ఐక్యత, పోరాటస్ఫూర్తితో భవిష్యత్తుపై ధీమాగా ఉంది. ఆ సంఘటన జరగకపోయి ఉంటే.... పార్టీ వరంగల్ అభ్యర్థిగా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను కాంగ్రెస్ తొలుత ప్రకటించడం...ఆయన నామినేషన్ వేయడం తెలిసిందే. అయితే నామినేషన్ల దాఖలుకు చివరి రోజున ఆయన నివాసంలో కోడలు, ముగ్గురు మనవళ్లు అనుమానాస్పద రీతిలో అగ్నిప్రమాదంలో మరణించడంతో పార్టీ శ్రేణులు షాక్‌కు గురయ్యాయి. ఈ నేపథ్యంలో అధిష్టానం సిరిసిల్ల రాజయ్య స్థానంలో మరో నేత సర్వే సత్యనారాయణకు టికెట్ ఇచ్చింది. ఈ ప్రక్రియలో టీపీసీసీ నేతలతోపాటు జిల్లా నేతలు, అటు జాతీయ నేతలు కూడా వేగంగా స్పందించి నిర్ణయాలు తీసుకున్నారు. ఉప ఎన్నిక అనివార్యమని తేలిన తర్వాత వరంగల్ లోక్‌సభ పరిధిలో కాంగ్రెస్ మండల స్థాయి నుంచి సమావేశాలను నిర్వహించింది. అభ్యర్థి ఎంపిక విషయంలోనూ, అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ కొంత వ్యూహాత్మకంగానే వ్యవహరించింది. అయితే చివరి రోజున జరిగిన సంఘటనతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మార్చడం, పార్టీ శ్రేణులు కోలుకోవడానికి నాలుగైదు రోజులు పట్టింది. ఆ సంఘటన జరగకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీ పనితీరు మరికొంత మెరుగ్గా ఉండేదని టీపీసీసీ నేతలు అంచనా వేస్తున్నారు. టీఆర్ఎస్ను కట్టడి చేయగలిగినట్టే... సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ స్థానాన్ని టీఆర్ఎస్ దాదాపు 4 లక్షల మెజారిటీతో చేజిక్కించుకోగా ఈసారి దాన్ని చాలా వరకు తగ్గిస్తామని టీపీసీసీ నేతలు విశ్లేషిస్తున్నారు. టీఆర్ఎస్కు మూడున్నరేళ్లపాటు అధికారం ఉన్న ఈ సమయంలో జరిగిన ఉప ఎన్నిక సహజంగానే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుందని టీపీసీసీ నేతలు అంగీకరిస్తున్నారు. వరంగల్ లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకుగాను టీఆర్ఎస్కు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉండటం, అన్ని పార్టీలతోపాటు కాంగ్రెస్‌కు చెందిన మండల స్థాయి నాయకులు కూడా పలువురు టీఆర్ఎస్లో చేరడం ఆ పార్టీకి కలసివచ్చేలా ఉందని చెబుతున్నారు. అలాగే ఓటర్లను అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేసిందని ఆరోపిస్తున్నారు. ఇలాంటి కారణాల వల్ల ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఒకవేళ గెలిచినా గతంలో వచ్చిన మెజారిటీని భారీగా తగ్గిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. భూపాలపల్లి, పరకాల వంటి నియోజకవర్గాల్లో పార్టీకి మెజారిటీ వస్తుందని టీపీసీసీ నేతలు విశ్వసిస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ను బాగానే కట్టడి చేయగలిగినట్టుగా అంచనా వేస్తున్నారు. -
ఆయన అక్కడ గెలవాలి...
వరంగల్ లోక్‌సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక ఒక మాజీ ఎమ్మెల్యేను ఆశల పల్లకీలో ఊరేగిస్తున్నది. ఉప ఎన్నిక ఏమిటీ మాజీ ఎమ్మెల్యేలో ఆశలు రేకెత్తించడమేమిటని అనుకుంటున్నారా ? అనుకోని పరిస్థితుల్లో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ వరంగల్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి కావడం తన రాజకీయ భవిష్యత్‌కు కలిసొస్తుందని ఈ మాజీ గట్టిగా విశ్వసిస్తున్నారు. గత ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీ సీటుకు సర్వే పోటీచేసి ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్ ఉప ఎన్నికల్లో సర్వే గెలిస్తే, తనకు మల్కాజ్గిరి టిక్కెట్టుకు ఆయన అడ్డు ఉండదని లెక్కలు వేసుకుంటున్నాడట. అంతేకాకుండా ఈ ఎంపీ సీటుకు అధిష్ఠానం వద్ద సర్వేనే తనను రికమెండ్ చేస్తారని నమ్ముతున్నారట. ఈ నమ్మకంతో ఉప ఎన్నికల ప్రచారంలో రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం చేస్తున్నారట. అంతే కాకుండా ప్రచారానికయ్యే ఖర్చును, ఎన్నికల వ్యయాన్ని కూడా తనవంతుగా భరిస్తున్నాడట. ఈ మాజీ ఎమ్మెల్యే తీరును చూసి ఇది అయ్యేది కాదు పొయ్యేది కాదని... ఈ పేరుతో సదరు నేత చేతి చమురు మాత్రం బాగానే వదులుతోందని సహచరనాయకులు గుసగుసలు పోవడం కొసమెరుపు. -
టీఆర్ఎస్ ఓట్లు కొనుగోలు చేస్తోంది: గుత్తా
నల్లగొండ టూటౌన్: వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓట్లు కొనుగోలు చేస్తోందని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు. గురువారం నల్లగొండలో విలేకరులతో మాట్లాడారు. మంత్రులు వరంగల్‌లో తిష్టవేసి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గ్రామ, మండలస్థాయి నాయకులను, ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ స్థానికేతరుడని ప్రచారం చేస్తున్నారని, దేశంలో పార్లమెంటు సభ్యుడిగా ఎక్కడైనా పోటీ చేయవచ్చన్నారు. టీఆర్ఎస్ పార్టీ వారు దిగజారిపోయి మాట్లాడుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వారంలో 5 రోజులు ఫాంహౌస్‌లోనే ఉంటున్నారని, పండగలు, పబ్బాలు, యాగాలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.