
అందరం బాగానే కష్టపడ్డాం
♦ వరంగల్ ఉప ఎన్నికపై టీపీసీసీ సంతృప్తి
♦ రాజయ్య ఇంట్లో ‘దుర్ఘటన’ జరగకుంటే పరిస్థితి మెరుగయ్యేదని అంచనా
♦ అయినప్పటికీ నేతలంతా ఐక్యంగా పనిచేశారని విశ్లేషణ
♦ గెలుపోటములు ఎలా ఉన్నా భవిష్యత్తుపై ధీమా
సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో పార్టీ నేతల పనితీరుపై టీపీసీసీ సంతృప్తి వ్యక్తం చేస్తోంది. పార్టీ అధికారంలో లేకున్నా సాధారణ ఎన్నికలకు ఇంకా మూడేళ్లు ఉన్న ఈ సమయంలో జరిగిన ఉప ఎన్నికలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిదాకా పార్టీ నేతలు ఐక్యంగా పనిచేశారని అభిప్రాయపడుతోంది. ముఖ్యంగా తొలుత ప్రకటించిన అభ్యర్థి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య నివాసంలో జరిగిన ‘దుర్ఘటన’ తాలూకూ షాక్ నుంచి త్వరగా తేరుకోవడంతోపాటు పార్టీ నేతలను సమన్వయం చేసుకోవడంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క ఇతర ముఖ్య నేతలు జాగ్రత్తగానే వ్యవహరించారని విశ్లేషిస్తోంది. అలాగే పార్టీ జాతీయస్థాయి నేతలైన మీరాకుమార్, సచిన్ పైలట్, సుశీల్‌కుమార్ షిండే, గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్‌సింగ్ తదితరులు ప్రచారానికి తగిన సమయాన్ని కేటాయించినట్టుగానే పేర్కొంటోంది. గెలుపోటములు ఎలా ఉన్నా పార్టీ నేతలు చూపిన ఐక్యత, పోరాటస్ఫూర్తితో భవిష్యత్తుపై ధీమాగా ఉంది.
ఆ సంఘటన జరగకపోయి ఉంటే....
పార్టీ వరంగల్ అభ్యర్థిగా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను కాంగ్రెస్ తొలుత ప్రకటించడం...ఆయన నామినేషన్ వేయడం తెలిసిందే. అయితే నామినేషన్ల దాఖలుకు చివరి రోజున ఆయన నివాసంలో కోడలు, ముగ్గురు మనవళ్లు అనుమానాస్పద రీతిలో అగ్నిప్రమాదంలో మరణించడంతో పార్టీ శ్రేణులు షాక్‌కు గురయ్యాయి. ఈ నేపథ్యంలో అధిష్టానం సిరిసిల్ల రాజయ్య స్థానంలో మరో నేత సర్వే సత్యనారాయణకు టికెట్ ఇచ్చింది.
ఈ ప్రక్రియలో టీపీసీసీ నేతలతోపాటు జిల్లా నేతలు, అటు జాతీయ నేతలు కూడా వేగంగా స్పందించి నిర్ణయాలు తీసుకున్నారు. ఉప ఎన్నిక అనివార్యమని తేలిన తర్వాత వరంగల్ లోక్‌సభ పరిధిలో కాంగ్రెస్ మండల స్థాయి నుంచి సమావేశాలను నిర్వహించింది. అభ్యర్థి ఎంపిక విషయంలోనూ, అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ కొంత వ్యూహాత్మకంగానే వ్యవహరించింది. అయితే చివరి రోజున జరిగిన సంఘటనతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మార్చడం, పార్టీ శ్రేణులు కోలుకోవడానికి నాలుగైదు రోజులు పట్టింది. ఆ సంఘటన జరగకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీ పనితీరు మరికొంత మెరుగ్గా ఉండేదని టీపీసీసీ నేతలు అంచనా వేస్తున్నారు.
టీఆర్‌ఎస్‌ను కట్టడి చేయగలిగినట్టే...
సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ స్థానాన్ని టీఆర్‌ఎస్ దాదాపు 4 లక్షల మెజారిటీతో చేజిక్కించుకోగా ఈసారి దాన్ని చాలా వరకు తగ్గిస్తామని టీపీసీసీ నేతలు విశ్లేషిస్తున్నారు. టీఆర్‌ఎస్‌కు మూడున్నరేళ్లపాటు అధికారం ఉన్న ఈ సమయంలో జరిగిన ఉప ఎన్నిక సహజంగానే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుందని టీపీసీసీ నేతలు అంగీకరిస్తున్నారు. వరంగల్ లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకుగాను టీఆర్‌ఎస్‌కు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉండటం, అన్ని పార్టీలతోపాటు కాంగ్రెస్‌కు చెందిన మండల స్థాయి నాయకులు కూడా పలువురు టీఆర్‌ఎస్‌లో చేరడం ఆ పార్టీకి కలసివచ్చేలా ఉందని చెబుతున్నారు.
అలాగే ఓటర్లను అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేసిందని ఆరోపిస్తున్నారు. ఇలాంటి కారణాల వల్ల ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ ఒకవేళ గెలిచినా గతంలో వచ్చిన మెజారిటీని భారీగా తగ్గిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. భూపాలపల్లి, పరకాల వంటి నియోజకవర్గాల్లో పార్టీకి మెజారిటీ వస్తుందని టీపీసీసీ నేతలు విశ్వసిస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్‌ను బాగానే కట్టడి చేయగలిగినట్టుగా అంచనా వేస్తున్నారు.