తెలంగాణ కాంగ్రెస్ నేతలు హైకమాండ్తో భేటీ అయ్యేందుకు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. తెలంగాణ పీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసన పక్ష నేత జానా రెడ్డితో పాటు శాసన మండలి నేత షబ్బీర్ ఆలీ మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. వరంగల్ ఉప ఎన్నిక ఓటమితో పాటు, తెలంగాణలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలపై హైకమాండ్తో కాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్, పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయ్యే అవకాశముంది.
వరంగల్ ఉప ఎన్నికల్లో చివర నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థి మార్పు, ప్రచారంలో లోపాలు, అధికార పార్టీని ఎదుర్కోవడంలో విఫలమైన అంశాలతో పాటు, ఓటమి గల కారణాలను నాయకులు హైకమాండ్కు వివరించనున్నారు. అధికార పార్టీ టిఆర్ఎస్కి వచ్చిన భారీ మెజార్టీపై కూడా అధిష్టానం ఆరా తీసే అవకాశముంది. వచ్చే నెలాఖరులో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, గ్రేటర్ ఎన్నికలపై పట్టు సాధించే దిశగా పని చేసేందుకు నాయకులకు అధిష్టానం దిశానిర్దేశం చేయనుంది.