జలదిగ్బంధంలో తిరుపతి
- లోతట్టు కాలనీలు జలమయం
- కుళ్లిన వ్యర్థాలతో పొంచి ఉన్న వ్యాధులు
- ఆందోళనలో ప్రజలు
- పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్న అధికారులు
తిరుపతి అర్బన్ : ఐదు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలు తిరుపతి నగరాన్ని అతలాకుతలం చేశాయి. గురువారం కురుసిన కుండపోత వానకు పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రధాన రోడ్లపై మోకాటి లోతు వరకు వర్షపునీరు చేరింది. వాహనాలు కొన్ని గంటల సేపు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఇళ్లలోకి వరదనీరు రావడంతో జనం హడలిపోయారు. కంటికి కనుకు.. కడుపుకు తిండిలేక బిక్కుబిక్కుమంటూ కాలం నెట్టుకొస్తున్నారు. నగరంలోని 40 మురికి వాడల సహా లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు మోకాటిలోతు వరకు చేరింది. కనీసం నడక సాగించేందుకూ వీల్లేకుండా పోయింది. ఉదయం స్కూళ్లకు, ఆఫీసులకు వెళ్లిన వారు సాయంత్రానికి తిరిగి ఇళ్లకు చేరుకోలేక తీవ్ర అవస్థలు పడ్డారు.
వరద ఉధృతికి నగరంలోని ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. వరద నీరు భారీగా రోడ్లపైకి చేరడంతో వాహనాలు కొన్ని గంటల సేపు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. అలాగే అలిపిరి నుంచి రుయా, స్విమ్స్ వైపు వెళ్లే రోడ్డు పల్లపు ప్రాంతం కావడంతో నీరు భారీ స్థాయిలో ప్రవహించింది. దీంతో తిరుమలకు వచ్చిన కాలిబాట యాత్రికులు ఇబ్బందులెదుర్కొన్నారు.
పొంచి ఉన్న వ్యాధుల ముప్పు
వారం క్రితం కురిసిన వర్షాలకు తోడుగా ఇప్పుడు ఐదు రోజుల పాటు కురుస్తున్న వర్షాలకు నగరంలోని అన్ని ప్రాంతాల్లో మురికి నీటి కాలువలు పొంగిపొర్లాయి. కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని సకాలంలో తొలగించలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు రోడ్లపైనే వ్యర్థాలు కుళ్లికంపుకొడుతున్నాయి. చనిపోయిన జంతు కళేబరాలు, జంతు వధశాలల వ్యర్థాలు వాన నీటికి కొట్టుకొచ్చాయి. ప్రస్తుతం లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలను చుట్టుముట్టాయి. ఫలితంగా వ్యాధుల ముప్పు పొంచి ఉండడంతో నగర వాసులు భయాందోళన చెందుతున్నారు.
ప్రభుత్వ కార్యాలయాలు జలమయం
భారీ వర్షాలకు ప్రభుత్వ కార్యాలయాలు జలమయమయ్యాయి. తుడా కార్యాలయంలోని సమావేశ మందిరం, ఇందిరా మైదానం, బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయం, మహిళా ప్రాంగణం, వివిధ ఇంజినీరింగ్ శాఖల కార్యాలయాల్లోని మైదానాల్లో మోకాటి లోతు వరద నీరు నిలిచిపోయింది. ఇందిరా మైదానం ఏకంగా పెద్ద చెరువును తలపించింది.
నీటిలో తేలియాడిన కూరగాయలు
ఎడతెరిపి లేని వర్షాలతో నగరంలోని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల(పెద్ద) మార్కెట్‌లో గురువారం రాత్రి మోకాటి లోతు నీరు నిలిచిపోయింది. దుకాణాల్లోని కూరగాయలు, ఇతర వంట పదార్థాలు, కొన్ని షాపులు సైతం నీటిలో తేలాడాయి. కొందరు ముందస్తుగా షాపులను ఖాళీ చేసుకుని వెళ్లిపోయారు. చిరువ్యాపారులకు తీవ్ర నష్టం వాటిల్లింది.