
మల్దకల్‌లో నీట మునిగిన విత్తనపత్తి
- జిల్లా వ్యాప్తంగా 30.6మిల్లీమీటర్ల నమోదు
- అత్యధికంగా దేవరకద్ర మండలంలో 84 మి.మీ
- వరుస వర్షపాతంతో పంటలకు చేటు
- 1500హెక్టార్లలో జొన్నకు నష్టం, నలుపురంగులోకి గింజ
- తడిసిన ఉల్లి, మునిగిపోయిన పత్తి, వరి
- పొంగుతున్న వాగులు, వంకలు
- పలుచోట్ల తెగిపోయిన లింక్‌రోడ్లు
- కూలిపోయిన మట్టిమిద్దెలు
- కొల్లాపూర్ నియోజకవర్గాన్ని వర్షం అతలాకుతలం చేసింది. వీపనగండ్ల మండల పరిధిలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి జూరాల కాలువ నీళ్లు తోడవడంతో లోతట్టు ప్రాంతంలో ఉన్న చిన్నమారూర్ గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. 900 ఎకరాల పంటలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. కొల్లాపూర్‌లో 82.22 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరిదేల చెరువు, నల్లపురాతి కుంట, చుక్కాయిపల్లి చెరువులు నిండిపోయాయి. చెరువులన్నీ అలుగులు పారాయి. రామాపురం వద్ద వాగు ఉప్పొంగడంతో రహదారి మరోసారి కోతకు గురైంది. దీంతో రోజంతా వాహనాల రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. కేఎల్‌ఐ కాలువ కట్ట రెండు చోట్ల కోతలకు గురైంది. కోడేరులో ఓ మట్టి మిద్దె గురువారం అర్థరాత్రి ఆకస్మికంగా కూలడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. పానగల్ మండలం బుసిరెడ్డిపల్లి, మల్లాయిపల్లి గ్రామాలల్లో పలువురి ఇళ్లు కూలిపోయాయి.
- అడ్డాకుల మండలంలో 20 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. దేవరకద్ర మండలంలోని పెద్దరాజమూర్ గ్రామంలోకి వరద నీరు ప్రవహిస్తోంది. కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో శుక్రవారం సాయంత్రం నాటికి నీటి మట్టం 20 ఫీట్లకు చేరింది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురువడంతో ప్రాజెక్టులోకి వచ్చి చేరే ఆంకిళ్ల, కోయిలకొండ వాగులు ఉధృతంగా ప్రవహించి కోయిల్‌సాగర్‌లోకి వచ్చి చేరుతున్నాయి. దేవరకద్ర – చిన్నచింతకుంట మండల పరిధిలో ఉన్న బండర్‌పల్లి వాగునీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. చిన్నచింతకుంట మండలంలోని దుప్పల్లి, చిన్నచింతకుంట, అల్లీపురం, తదితర గ్రామాల్లో కంది పత్తి పంటల్లో నీరు వచ్చి చేరింది.
- దౌల్తాబాద్ మండలంలో పత్తి పంట బూజు పట్టింది. మాటూరు గ్రామంలో మూడు ఇళ్లు కూలిపోయాయి. కోస్గి మండలంలో 27మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. కొడంగల్ శివారులో భారీ వర్షానికి కొట్టుకుపోయిన కాగ్నా వాగు బ్రిడ్జి మరమ్మతు పనులను ఆర్‌అండ్‌బీ అధికారులు శుక్రవారం ప్రారంభించారు.
- ధన్వాడ మండలంలోని పూసల్‌పహాడ్ గ్రామంలోనే 50 ఎకరాలు వరిపంట నీట మునిగింది. గోటూర్ పెద్ద చెరువు, పెద్దచింతకుంట ఎర్రకుంట, రాంకిష్టయ్యపల్లి ఊరచెరువులు అలుగు పారాయి.
- ధరూరు మండలంలో మన్నాపురం – సోంపురానికి వెళ్లే రోడ్డు పూర్తిగా తెగిపోయింది. మల్దకల్ మండలంలోని బిజ్వారం, దాసరిపల్లి, మేకలసోంపల్లి, ఉలిగేపల్లి, అమరవాయి, నీలిపల్లి, సద్దలోనిపల్లి, పాలవాయి గ్రామాల్లో రైతులు సాగు చేసిన పత్తి, వరి, ఆముదం, మిరప, కంది పంటలు వర్షాలకు నేలకొరిగాయి. 100 ఎకరాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయని రైతులు వాపోయారు. గట్టు మండలంలోని ఆరగిద్దలో మట్టిమిద్దె కూలింది.
- అలంపూర్ నియోజకవర్గంలోని అలంపూర్, మానవపాడు, వడ్డేపల్లి మండలాల్లో పప్పుశనగ పంటకు జీవం పోసినట్లయ్యింది. మానవపాడు పరిధిలోని అమరవాయి–మానవపాడుకు వెల్లేదారిలో బ్రిడ్జిపైకి భారీగా నీరు చేరింది. అయిజ మండలంలో గుడిసెలు, మట్టి మిద్దెలు కలిపి మొత్తం 52 ఇళ్లు కూలినట్లు అధికారులు గుర్తించారు. శాంతినగర్ మండలంలో కల్లాల్లో ఉంచిన ఉల్లి తడిసిపోయింది. రాజోలి కొత్త వీవర్స్‌కాలనీ, శ్రీరాంగనర్‌లలో ఏర్పాటుచేసుకున్న చేనేత మగ్గాల్లోకి వర్షపునీరు చేరింది. రాజోలి సమీపంలోని పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.
- నవాబుపేట మండలంలో గాలివానకు నాలుగు ఇళ్లు కూలిపోయాయి. పెబ్బేరు మండలంలో బీమా, జూరాల కాలువల ద్వారా నీళ్లు వస్తుండడంతో తాటిపాముల, సూగూరు తదితర గ్రామాల చెరువులు అలుగు పారుతున్నాయి. 280 ఎకరాలలో పంటలను నీటమునిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.