జలదిగ్బంధంలో మూడు జిల్లాలు
- రక్షణ చర్యల్లో ఆర్మీ
- 165 చెరువులకు గండ్లు
- 18 మంది మృతి
చెన్నై, సాక్షి ప్రతినిధి: నాలుగు రోజులు కురిసిన భారీ వర్షాలు తమిళనాడులోని చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలను కుదిపేశాయి. చెరువుల్లో నీటి మట్టం ప్రమాదస్థాయికి చేరింది. మూడు జిల్లాల్లోని 165 చెరువులకు గండ్లు పడ్డాయి. లక్షలాది ఇళ్లు నీటమునిగాయి. వరద తాకిడికి విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో మూడు జిల్లాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
ముంపునకు గురైన మూడు జిల్లాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేందుకు సోమవారం రాత్రి ఆర్మీ రంగంలోకి దిగింది. ఆరు హెలికాప్టర్లు, 50 మంది సిబ్బంది, ఐదుగురు అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. హెలికాప్టర్ల నుంచి ఆహారపొట్లాలను జారవిడుస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వరదల కారణంగా 18 మంది మృతి చెందారు. ఇక తెలుగు జిల్లాలైన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, చిత్తూరు, కడప జిల్లాలు కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చలి తీవ్రతకు, వరదల్లో కొట్టుకుపోయి సుమారు 12 మందికిపైగా నెల్లూరు జిల్లాలో మృతి చెందారు. అలాగే చిత్తూరు జిల్లాలో కూడా పలు చోట్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం భారీగానే సంభవించింది. కడప జిల్లాలో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది.