తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది.
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం తీసుకుంటోంది. అన్ని కంపార్ట్మెంట్లూ భక్తులతో నిండిపోయాయి. కాలినడకన వచ్చిన భక్తులకు 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు మూడు గంటల్లోపు దర్శనం లభిస్తోంది.
జూలై నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లనుఈవో సాంబశివరావు శుక్రవారం ఇక్కడ విడుదల చేశారు. మొత్తం 56,640 టికెట్లను టీటీడీ వెబ్‌సైట్‌లో శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి భక్తులకు అందుబాటులో ఉంటాయని ఈవో తెలిపారు. వీటిలో సుప్రభాతం 6,426, తోమాల సేవ 120, అర్చన 120, విశేషపూజ 1,497, అష్టదళ పాదపద్మారాధన 60, నిజపాద దర్శనం 1,859, కల్యాణం 11,248, ఊంజలసేవ 3000, ఆర్జిత బ్రహ్మోత్సవం 6,450, వసంతోత్సవం 11,610, సహస్ర దీపాలంకరణసేవ 14,250 ఉన్నాయి.
రూ.300 ప్రత్యేక దర్రశనం, గదులను ఇకపై 90 రోజల ముందు నుంచి బుక్ చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు. నడకదారి భక్తులకు స్వామి వారి దర్శనం కోసం 22 కంపార్టుమెంట్లను అందుబాటులో ఉంచుతామన్నారు. మే నెలలో 25.05 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు వెల్లడించారు.టీటీడీ వెబ్‌సైట్‌లో 14వేల అన్నమయ్య సంకీర్తనలు అందుబాటులో ఉంచామని చెప్పారు. 3,700 పుస్తకాలను టీటీడీ వెబ్‌సైట్‌లో ఉంచగా, 10 లక్షలకు పైగా హిట్స్ వచ్చాయన్నారు. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో అర్చక శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు.