తీరంలో ‘అల’జడి
పూసపాటిరేగ : బంగాళాఖాతంలో ఎర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులవల్ల తీరంలో అలల ఉధతి తీవ్రంగా వుంది. తీరప్రాంతాల్లో గాలులతో కూడిన వర్షం పడటంతో మత్స్యకార్లు వేటను పూర్తిగా నిలిపివేశారు. వలలు, పడవలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చింతపల్లి, పతివాడబర్రిపేట, తమ్మయ్యపాలెం, తిప్పవలస, పులిగెడ్డ గ్రామాల్లో కూడా వేటను నిలిపివేశారు. జిల్లాలో తీరప్రాంత మండలాలైన పూసపాటిరేగ, భోగాపురంలో సుమారు వెయ్యి వరకు సంప్రదాయ, సాంకేతిక బోట్లు వున్నాయి. వాటిపై ప్రత్యక్షంగా నాలుగువేల మంది మత్స్యకారులు వేటను సాగిస్తున్నారు. వీరంతా వేటకు వెళ్లలేదు. సముద్రంలో వేటచేయకుండా తీరప్రాంత గ్రామాల్లో మత్స్యకారులను అప్రమత్తం చేసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.