depression in sea
-
కోస్తాకు తప్పిన వాయుగుండం ముప్పు
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలోని అల్పపీడనం దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్రల సమీపాన వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య ప్రాంతానికి ఆనుకుని కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో తుఫాను ఆవర్తనం నెలకొంది. ఈ అల్పపీడనం ఈ రోజు సాయంత్రానికి వాయుగుండంగా బలపడవచ్చు. ఇది ఉత్తర వాయవ్య దిశగా ఒడిసా తీరం వెంబడి, వాయవ్య బంగాళాఖాతంలో పయనిస్తూ 48 గంటల్లో బెంగాల్ బంగ్లాదేశ్‌ల మీదకు వెళుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపు సాయంత్రానికి ఇది తీవ్ర వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. చదవండి: వదలని వరద తూర్పు తీరం నుంచి పశ్చిమ తీరం వరకూ ద్రోణి కొనసాగుతోంది. ఇది మరో మూడురోజులు ప్రభావశీలంగా ఉంటుంది వీటి ప్రభావం తెలంగాణ కోస్తాంధ్రలమీద తక్కువగా కోస్తా రాయలసీమలో మాత్రం కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర సుముద్రతీరం అల్లకల్లోలంగా ఉంటుంది. మత్స్యకారులు వేటకు పోరాదనీ వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. -
రేపు, ఎల్లుండి గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు
సాక్షి, విజయవాడ : వాయువ్య బంగాళాఖాతం అల్పపీడనం ప్రభావంతో ఈ రోజు, రేపు ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. గోదావరికి వరద ఉధృతి ఉన్నందున జిల్లా అధికారులను అప్రమత్తం చేశామని కమిషనర్ కె కన్నబాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. లోతట్టు ప్రాంత, లంక గ్రామల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. వచ్చే మూడు రోజుల వాతావరణ వివరాలను కమిషనర్ కన్నబాబు వెల్లడించారు. ►ఆగష్టు 19వ తేదిన: తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశం. రాయలసీమ, నెల్లూరు చెదురుమదురుగా తేలికపాటి జల్లులు పడే అవకాశం ►ఆగష్టు 20వ తేదిన: తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశం. రాయలసీమ, నెల్లూరు చెదురుమదురుగా తేలికపాటి జల్లులు పడే అవకాశం. ►ఆగష్టు 21వ తేదిన: తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం. రాష్ట్రంలో మిగిలిన చోట్ల చెదురుమదురుగా తేలికపాటి జల్లులు పడే అవకాశం. -
కరీంనగర్లో భారీ వర్షం..
సాక్షి, కరీంనగర్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జోరుగా వర్షం కురుస్తోంది. జిల్లాలోని చిగురుమామిడి మండలంలో అత్యధికంగా 12.5 సెంటీ మీటర్ల వర్షపాతంనమోదైంది. జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోంది. ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలుజలకళను సంతరించుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై పంట పొలాలు నీట మునిగాయి. భారీ వర్షానికి చిగురుమామిడి మండలం ముదిమాణిక్యంలో పోచమ్మ చెరువు, సుందరగిరిలోని కోమటికుంట మత్తడి దూకుతున్నాయి. పంట పొలాలు నీట మునిగి రైతులు ఆందోళన చెందుతున్నారు. బోర్నపల్లిలో 11.2 సెంటీమీటర్లు, రేణికుంటలో 10.85 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట 10.3 సెంటి మీటర్లు, కొహెడ మండలంలో 9.93 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలుచోట్ల రోడ్లపై నుంచి వరద పొంగిపొర్లడంతో రోడ్లు దెబ్బతిన్నాయి. వర్షం, వరదలతో రైతన్నకు అపార నష్టం వాటిల్లింది. అధికారులు పంట నష్టాన్ని పరిశీలించి తగిన పరిహారం చెల్లించి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. -
కుండపోత వర్షానికి వణికిన బెజవాడ
ఉదయం నుంచే దట్టంగా అలముకున్న మబ్బులు.. అడపాదడపా చిరు జల్లులు.. కొన్ని చోట్ల భారీ వర్షం.. మరి కొన్నిచోట్ల మోస్తరు వర్షం.. చల్ల చల్లగా మారిపోయిన వాతావరణం.. ఇదీ విజయవాడ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా మంగళవారం వాతావరణం. ముఖ్యంగా బెజవాడలో వర్షం ముంచెత్తింది. ప్రధాన రహదారులైన బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, ఎన్టీఆర్ సర్కిల్, ఆటోనగర్, కాళేశ్వరరావు మార్కెట్‌రోడ్డు, గణపతిరావు రోడ్లలో వరద నీరు మురుగుతో కలిసి ఉధృతంగా ప్రవహించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సాక్షి, అమరావతి : వాయువ్య బంగళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి దానికి అనుగుణంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ఫలితంగా కోస్తాంధ్రలో పలుచోట్ల మోస్తరు వర్షాలు.. మరికొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేపు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంటోంది. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల వైరల్ జ్వరాలు ప్రబలే అవకాశముందని వైద్య, ఆరోగ్యశాఖ హెచ్చరిస్తోంది. ఈ కాలంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని.. కాచి వడబోసిన నీటిని తాగడంతోపాటు, వేడివేడి ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం సాయంత్రం వరకు సగటు వర్షపాతం 30.03 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదవగా.. ఒక్క విజయవాడ నగరంలోనే 44.56 మి.మీ నమోదైంది. జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. పెనమలూరు మండలం గంగూరులో 32.75 మి.మీ, ఉయ్యూరులో 31 మి.మీ, పెనమలూరులో 28.25 మి.మీ కంకిపాడు మండలం మద్దూరు 23.50 మి.మీ, కంచికచర్ల మండలం మొగులూరు 23.00 మి.మీ, ఇబ్రహీంపట్నంలో 18.50 మి.మీ, కౌతవరం 18.50 మి.మీ, చాట్రాయి మండలం కోతపాడులో 16.25, విస్సన్నపేట మండలం కోర్లమండలో 13.50 మి.మీ వర్షపాతం నమోదైంది. నగరాన్ని ముంచెత్తిన వాన! మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షంతో బెజవాడ మంగళవారం వణికిపోయింది. ఉదయం నుంచే ముసురేసినట్లు నగరాన్ని మబ్బులు కమ్మేశాయి. 10 గంటల నుంచే మోస్తరుగా ఆయా ప్రాంతాల్లో జల్లులు కురిశాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కుండపోతగా పడిన వర్షానికి రోడ్లపై నీరు వరదలా ప్రవహించింది. మోకాలు లోతున వరద నిలిచింది. ప్రధాన రహదారులపై వాహనాలు అరగంటకు కిలోమీటరు చొప్పున కదిలాయి. కిక్కిరిసిన రోడ్లతో పాదచారులు, బస్‌స్టాపుల్లో ఎదురుచూస్తున్న ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వినాయకచవితి నేపథ్యంలో విగ్రహాలు చూడ్డానికి వచ్చిన ప్రజలు అవస్థలు పడ్డారు. వన్‌టౌన్, కృష్ణలంక, బందరురోడ్డు, ఆటోనగర్, ఏలూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రంగంలోకి దిగిన వీఎంసీ, అత్యవసర బృందాలు సహాయక చర్యలను చేపట్టాయి. బందరు రోడ్డు ముందు మోకాళ్ల లోతులో నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజయవాడ వన్‌టౌన్ ప్రాంతంలో అత్యధికంగా 49 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా అత్యల్పంగా ఎంకే బేగ్ స్కూల్ ప్రాంతంలో 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో మంగళవారం ఉదయం అల్పపీడనం ఏర్పడిందని.. రాగాల 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడనున్నట్టు వాతావరణ కేంద్రం పేర్కొంది. అయితే ఈ అల్పపీడనానికి అనుబంధంగా సుమారు 7.6 కి. మీ ఎత్తులో నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం ఉన్నందున కోస్తా ఆంధ్ర, తెలంగాణకు మోస్తరు లేదా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. -
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం..!
సాక్షి, హైదరాబాద్ : వాయువ్య బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. గాంగేటిక్ పశ్చిమ బెంగాల్ దక్షిణ ప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒరిస్సా ప్రాంతాల్లో ఇది కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధముగా 7.6 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది. రాగల 48 గంటల్లో ఇది మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని చెప్పింది. రాగల మూడురోజులకు వాతావరణ సూచనలు చేసింది. అల్పపీడనం కారణంగా తెలంగాణలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈరోజు (మంగళవారం), రేపు చాలాచోట్ల, ఎల్లుండి అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్ర, యానాంలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడిచింది. ఈరోజు, రేపు కొన్నిచోట్ల, ఎల్లుండి అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. రాయలసీమలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. -
కోస్తాకు తప్పిన ముప్పు
సాక్షి, విశాఖపట్నం : కోస్తా ప్రజలకు ఉపశమనం లభించింది. గత రెండు రోజులుగా భయపెడుతున్న వాయుగుండం ముప్పు తప్పింది. అయితే అల్పపీడనం గంటకు 30కిలోమీటర్ల వేగంతో కదులుతూ వాయువ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. పారాదీప్‌కు 40 కిలోమీటర్లు, చాంద్‌బలికి 90 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయింది. ఈ అర్థరాత్రి పారాదీప్ సమీపంలో ఉత్తర ఈశాన్య దిశగా తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాలో చదురుమదురు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా తీరం వెంబడి గంటకు 45-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్సకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ అధికారులు హెచ్చరించారు. కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో ఇప్పటికే ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. -
తీరంలో ‘అల’జడి
పూసపాటిరేగ : బంగాళాఖాతంలో ఎర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులవల్ల తీరంలో అలల ఉధతి తీవ్రంగా వుంది. తీరప్రాంతాల్లో గాలులతో కూడిన వర్షం పడటంతో మత్స్యకార్లు వేటను పూర్తిగా నిలిపివేశారు. వలలు, పడవలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చింతపల్లి, పతివాడబర్రిపేట, తమ్మయ్యపాలెం, తిప్పవలస, పులిగెడ్డ గ్రామాల్లో కూడా వేటను నిలిపివేశారు. జిల్లాలో తీరప్రాంత మండలాలైన పూసపాటిరేగ, భోగాపురంలో సుమారు వెయ్యి వరకు సంప్రదాయ, సాంకేతిక బోట్లు వున్నాయి. వాటిపై ప్రత్యక్షంగా నాలుగువేల మంది మత్స్యకారులు వేటను సాగిస్తున్నారు. వీరంతా వేటకు వెళ్లలేదు. సముద్రంలో వేటచేయకుండా తీరప్రాంత గ్రామాల్లో మత్స్యకారులను అప్రమత్తం చేసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.