సమరానికి సై | hen fight in godavari districts | Sakshi
Sakshi News home page

సమరానికి సై

Published Thu, Dec 24 2015 9:46 AM | Last Updated on Sun, Sep 3 2017 2:31 PM

సమరానికి సై

సమరానికి సై

కాలుదువ్వుతున్న పందెం కోళ్లు
పెద్ద పండగకు సిద్ధం చేసుకుంటున్న పందెంరాయుళ్లు
ఒక్కొక్కటి రూ.5 వేల నుంచి రూ.25 వేలకు కొనుగోలు

 
రాయవరం/ఉప్పలగుప్తం :  మరో మూడు వారాల్లో పెద్ద పండగ రానుంది. ధనుర్మాసం ప్రారంభం కావడంతో ఇప్పటికే హరిదాసులు, గంగిరెద్దుల వాళ్లు, జంగమదేవర్లు, పగటివేషగాళ్లు గ్రామాల్లో సందడి చేస్తున్నారు. అన్నిటికంటే ప్రధానమైనది సంక్రాంతిలో కోడిపందేలు. వీటి పై నిషేధం విధించినా.. చాటుమాటుగా పందెంరాయుళ్లు కోడిపందేలు నిర్వహిస్తూనే ఉంటారు. రెండేళ్లుగా ప్రభుత్వం దీనిని చూసీచూడనట్టు వ్యవహరించడంతో.. ఈ ఏడాది కూడా అవే పరిస్థితులు ఉంటాయన్న ఉద్దేశంతో పందెంరాయుళ్లు సుమారు మూడు నెలల ముందుగానే పుంజులను కొనుగోలు చేసి, పందేలకు సిద్ధం చేస్తున్నారు.


పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ
పందెం కోడిపుంజులు అనగానే వాటి పెంపకం తీరు ప్రత్యేకంగా ఉంటుంది. వాటి ఆరోగ్యం కోసం చెరువులో ఈత, వాకింగ్, ఎండలో కట్టి ఉంచడం వంటివి చేస్తారు. ఆహారంగా బాదం, పిస్తా, జీడిపప్పు, తాటిబెల్లం, నువ్వుల నూనెతో చేసిన ఉండలు, కోడిగుడ్లు, ఉడికించిన వేటమాంసంతో పాటు చోళ్లు, గంట్లు, వడ్లను తినిపిస్తారు. వారానికోకసారి టెర్రామైసిన్, రెవిటాల్ వంటి టాబ్లెట్లు వేస్తారు. ఇలా రోజుకు ఒక్కో కోడికి రూ.40 నుంచి రూ.100 వరకు ఖర్చు చేస్తారు. ఈ లెక్కన పందెంరాయుళ్లు ఒక్కోదానికి రూ.6 వేల వరకు కేవలం వాటి ఆహారానికే ఖర్చు చేస్తున్నారు. ఆర్థికంగా స్థితిమంతులైతే రూ.10 వేల వరకూ ఖర్చు చేయడానికి వెనుకాడడం లేదు.
 
పెద్దఎత్తున విక్రయాలు
ఒక్కో వ్యక్తి రెండు నుంచి నాలుగు పుంజులను పందేలకు సిద్ధం చేస్తున్నారు. వాటిని విక్రయించే వారు సుమారు 20 పుంజుల వరకు పోషిస్తున్నారు. జిల్లాలోని మండపేట, రావులపాలెం, ఐ.పోలవరం, అమలాపురం, పెదపూడి, జగ్గంపేట తదితర ప్రాంతాల్లో పందెంకోళ్ల విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నట్టు తెలిసింది. జిల్లాలో సుమారు 50 వేల పందెం కోడిపుంజులను సిద్ధం చేస్తున్నట్టు అంచనా. ఒకొక్కటి రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు విక్రయిస్తున్నారు. గతేడాది పెద్ద పండగ మూడు రోజులు రూ.100 కోట్ల పైబడి పందేలు సాగినట్టు చెప్పుకొంటున్నారు. పందెంరాయుళ్లు కోడిపుంజుల కొనుగోలుకు వేలాది రూపాయలు వెచ్చిస్తుండడంతో గ్రామాల్లో అనేకమంది వీటిని పెంచుతూ, ఉపాధి పొందుతున్నారు.
 
కోడిపుంజుల్లోరకాలు
కోడి పుంజుల్లో వాటి ఈకల ఆధారంగా రకాలను నిర్ణయిస్తారు. డేగ, కాకి, పూల, పర్ల, సేతువ, రసంగి, నెమలి, మసరకాకి, తెల్లచెవల, గేరువా డేగ, కాకినెమలి, కాకి డేగ, కోడి డేగ, నల్లచెవల, పెట్టమారు, అబ్రాస్ తదితర రకాల కోడిపుంజులున్నాయి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement