విలన్ అవుదామనుకున్నా
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) :తానొకటి తలచితే.. దైవమొకటి తలచిందన్నట్టుగా తన జీవితం చక్కగా సాగుతోందని అన్నారు ప్రముఖ హీరో, కమెడీయన్ సునీల్. హీరో గా చిత్ర పరిశ్రమలో స్థిరపడతానని కలలోనైనా అనుకోలేదని తన మనస్సులోని భావాలను వెల్లడించారు. ఆయన హీరోగా నటించిన ‘ఈడు గోల్డ్ ఎహే’ సినిమాలోని మూడో పాట విడుదల సందర్భంగా శుక్రవారం రాజమహేంద్రవరం వచ్చిన ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
చిన్నప్పుడు చాలా సినిమాలు చూసేవాడిని. వాటిలో చిరంజీవి సినిమాలు ఎక్కువగా ఉండేవి. వాటిని చూసి ఆయన చేసిన డ్యాన్స్ చూసి ఆ కోరిక ఏర్పడింది. రాగానే ఎవరూ ఎర్ర తీవాచీ పరచరుకదా! చాలా కష్టాలు పడ్డాను. అన్నం తినని రోజులున్నాయి. అదే సమయంలో సలీం మాస్టర్ డ్యాన్స్ స్కూలు పెడుతున్నారని విని వెళితే ఆయన నా అభినయం చూసి అసిస్టెంట్‌గా చేర్చుకున్నారు. జగపతిబాబు హీరోగా నటించిన శ్రీకారం సినిమాకు పనిచేస్తుండగా అందులో ఒక పాటకు డ్యాన్సర్స్ తక్కువయ్యారు. దాంతో ఆ పాటకు నేను వెనుక ఎక్కడో నటించాను. తర్వాత అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేశా. ‘నా ఫేస్ విలన్‌కు సరిపోతుంది కాబట్టి ఆ విధంగానే ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని ప్రయత్నించా.. అయితే అనుకోకుండా కమెడియన్‌గా, ప్రస్తుతం హీరోగా నిలదొక్కుకున్నా.
ఊరి రుణం తీర్చుకోలేనిది..
నా ఊరు నన్ను మోసింది. ఆ గడ్డ రుణం ఎన్ని జన్మలైనా తీర్చుకోలేనిది. అక్కడ పరిసరాలు, వాతావరణం, తిరిగి ప్రదేశాలు ఎప్పటికీ మర్చిపోను. అవి తీపిజ్ఞాపకాలు. తండ్రి నా చిన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుంచి అమ్మే నన్ను కంటికిరెప్పలా పెంచింది. నేను ఏం చెప్పినా కాదనేదికాదు. సినిమాల్లో నటిస్తానంటే ఆమె నాకు డబ్బులిచ్చి పంపింది. నా తల్లి లేకపోతే నేను ఈ స్థానంలో ఉండేవాడిని కాదు.
హీరోగా తొమ్మిది సినిమాలు..
మొత్తం 197 సినిమాలు చేస్తే.. హీరోగా చేసిన సినిమాలు తొమ్మిది. నా జీవితంలో మర్చిపోలేని సినిమా మర్యాద రామన్న.