బతుకుపోరులో హిజ్రా విజయగాథ | hijra marenna life story | Sakshi
Sakshi News home page

బతుకుపోరులో హిజ్రా విజయగాథ

Published Fri, Oct 14 2016 10:32 PM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM

బతుకుపోరులో హిజ్రా విజయగాథ

బతుకుపోరులో హిజ్రా విజయగాథ

పుట్టుకలో లోపం లేదు... హార్మోన్ల మార్పు అతని శారీరక మార్పులకు కారణమయ్యాయి. పురుషుడిగా ఎదగాల్సిన తరుణంలో స్త్రీ లక్షణాలు చోటు చేసుకున్నాయి. వేషధారణలో మార్పు వచ్చింది. సమాజంలో ఛీత్కారాలు... ఈసడింపులు... బంధువులు, స్నేహితుల ఎద్దేవా మాటలు కొంత అసహనానికి లోను చేశాయి. అదే సమయంలో కుటుంబసభ్యుల ఆదరణ కొండంత అండగా నిలిచింది. ఛీత్కారాలు ఎదురైన చోటే తన విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వచ్చారు. సమాజంలో గౌరవప్రదంగా బతుకుతూ... మరో నలుగురుని పోషిస్తూ పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అతనే మారిన మనిషి గొల్ల మారెన్న.

రాయదుర్గం మండలం కొంతానపల్లికి చెందిన గొల్ల సంజీవప్ప, హనుమక్క దంపతులకు ఆరుగురు సంతానం. వీరిలో రెండవ కుమారుడు మారెన్న. చిన్నప్పటి నుంచి పశువుల పోషణపై ఆసక్తి కనబరిచేవాడు. వయసు పెరుగుతున్న కొద్ది అతని శరీర ఎదుగుదలలో మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. క్రమేణ స్త్రీ లక్షణాలు చోటు చేసుకోవడంతో వేషధారణ పూర్తిగా మారిపోయింది. గొల్ల మారెన్న పేరు కాస్త... గొల్ల జోగమ్మగా మారిపోయింది. ఈ మార్పును సమాజంలోని తోటి స్నేహితులు.. బంధువులు జీర్ణించుకోలేక పోయారు. మనిషి ఎదురుగా విమర్శ చేయకపోయినా.. చాటుమాటుగా ఎద్దేవా మాటలతో గుసగుసలాడేవారు. ఈ విషయాలు తెలిసినా ఏనాడూ జోగమ్మ బాధపడలేదు. జీవితంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకోవాలనే తపనతో మౌనంగానే అన్ని భరిస్తూ వచ్చింది.

పాడి పోషణతో...
చిన్నప్పటి నుంచి పశువుల పోషణపై ఆసక్తి పెంచుకున్న జోగమ్మ... తన 24వ ఏట అతి కష్టంపై రూ. 1,500 సమకూర్చుకుని రెండు పాడి పశువులను కొనుగోలు చేసింది. నిత్యం వాటిని మేతకు తీసుకెళ్లడంతో పాటు పాలు, పెరుగు విక్రయిస్తూ సమాజంలో గౌరవంగా బతికేందుకు శ్రీకారం చుట్టింది. జోగమ్మ ఆశయాన్ని గుర్తించిన స్థానికుల్లో క్రమేణ మార్పు వచ్చింది. ఈసడింపులు... ఛీత్కారాలు చేసిన వారే... జోగమ్మ పట్ల గౌరవభావం ప్రదర్శించసాగారు. ఈ నేపథ్యంలోనే తాను నమ్ముకున్న పాడి పరిశ్రమలో జోగమ్మ విజయప్రస్థానం కొనసాగిస్తూ వచ్చింది. రెండు పాడి పశువులతో మొదలైన జీవనం... ప్రస్తుతం 40 పశువులకు చేరుకుంది. నిత్యం 15 లీటర్ల పాలు, మరో పది లీటర్ల పెరుగును విక్రయించడంతో పాటు తన ఇద్దరు తమ్ముళ్లు, వారి సంతానాన్ని పోషిస్తోంది.  

అలుపెరగని శ్రమ
పాడి పోషణలో జోగమ్మ అవిశ్రాంతిగా శ్రమిస్తూనే ఉన్నారు. ప్రతి రోజూ ఉదయం పాలు పితికి తన గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయదుర్గానికి చేరుకుని ఇంటింటికి తిరిగి విక్రయిస్తుంటారు. అనంతరం మధ్యాహ్నం ఇంటికి చేరుకుని పశువులను మేపునకు సమీపంలోని అటవీ శివారు ప్రాంతంలోకి తీసుకెళతారు. ప్రస్తుతం 55వ పడిలో ఉన్న జోగమ్మ ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి పశువుల పాకను శుభ్రం చేసుకోవడం, పశువులకు స్నానం చేయించడం, మేత వేయడం, నీళ్లు పెట్టడం తదితర అన్ని పనులు స్వయంగా తానే చేసుకుంటూ పలువురికి స్ఫూర్తిదాయకంగా ఉంటున్నారు. కరువు నేపథ్యంలో ఒకటి... రెండు పశువులను పోషించుకోలేక రైతులు విలవిల్లాడుతుంటే... జోగమ్మ ఏకంగా 40 పశువులను పోషిస్తున్నారు. వాటికి మేత సమకూర్చడం కొంత భారమే అయినా మొండి ధైర్యంతో ఏనాడూ పశు పోషణను నిర్లక్ష్యం చేయలేదు.

పశుగ్రాసం దొరకడం కష్టంగా ఉంది
వర్షం లేకపోవడంతో పశుగ్రాసం దొరకడం లేదు. పాడి రైతులకు ప్రభుత్వం పశుగ్రాసం అందించాలి. మాలాంటి వాళ్లను అన్ని విధాలుగా ప్రోత్సాహించాలి. లేకుంటే పాడి పశువులను అమ్ముకోవాల్సి వస్తుంది.
– మారెన్న (జోగమ్మ), పాడి రైతు, కొంతానపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement