ఆరాధించిందే తప్ప ఆరడి పెట్టలేదు..
స్త్రీకి సమున్నత స్థానమిచ్చిన భారతదేశం
విశిష్ట మహిళల సత్కార సభలో ‘భారతీయం’ సత్యవాణి
రాజమహేంద్రవరం కల్చరల్ : ‘భారతదేశం స్త్రీని ఆరాధించిన దేశం.. ఆరడి పెట్టిన దేశం కాదు. ఈ దేశం స్త్రీని ఏనాడూ అణగదొక్కలేదు’ అని ‘భారతీయం’ సత్యవాణి అన్నారు. వివిధ రంగాలలో విశిష్టసేవలందించిన మహిళలను లయన్స్ క్లబ్ ఆఫ్ రాజమండ్రి, ఇతర సంస్థల ఆధ్వర్యంలో ఆదివారం రివర్‌బే సమావేశమందిరంలో సత్కరించారు. ప్రధాన వక్తగా సత్యవాణి మాట్లాడుతూ త్రేతాయుగం నుంచీ స్త్రీ పక్కన ఉంటేనే పురుషునికి యజ్ఞయాగాలు చేసే అవకాశం లభిస్తోందన్నారు. బ్రహ్మ నాలుకపై సరస్వతి, విష్ణువు వక్షస్థలంలో లక్ష్మీదేవి, శివుని అర్ధశరీరంగా పార్వతి ఉన్నారన్నారు. పురుషుడికి ఈ దేశం ఇచ్చిన వరం ఏకపత్నీవ్రతమని, స్త్రీ చేసే వ్రతాలన్నీ కుటుంబసౌభాగ్యం కోసమేనని తెలిపారు. దైనందిన కార్యక్రమాల నిర్వహణకు మొట్టమొదట లేచేది ఆడది, అందరికన్నా చివర్న నడుం వాల్చేది కూడా ఆడదేనని అన్నారు. ‘స్త్రీని సర్దుకు పొమ్మని ఏ శాస్త్రమూ చెప్పలేదు.భారతంలో ద్రౌపది ‘ధర్మజుడు తన్నోడి నన్నోడెనా? నన్నోడి తన్నోడెనా’ అని ప్రశ్నించడం, తాను ఎవరో తెలియదని దుష్యంతుడు అన్నప్పుడు శకుంతల చెప్పిన ధర్మాలు, వనవాసానికి రావద్దని నచ్చచెబుతున్న రామునితో సీత మాట్లాడిన తీరు చూస్తే స్త్రీకి సర్దుకుపోవడం కాదు, ప్రశ్నించడం నాటి రివాజు అని అర్థమవుతుందన్నారు. తల్లితండ్రులు కుదిర్చిన వివాహ బంధంలో ముక్కూమొహం తెలియని వాడి చిటికెనవేలు పట్టుకుని కొత్త ఇంటిలోకి అడుగుపెట్టే స్త్రీ ఈ జాతి ఔన్నత్యానికి మచ్చుతునకన్నారు. ఎవరో పార్టీ పెట్టి మనకు 33 శాతం సీట్లు ఇస్తాననడం కాదు, మనమే పార్టీ పెట్టి 33 శాతం సీట్లు ఇచ్చే స్థాయికి ఎదగాలని సూచించారు. తాగుబోతుతో జీవించే ఓర్పు స్త్రీకి ఉన్నట్టే, గయ్యాళితో జీవించే నేర్పు భర్తకు ఉంటుందని, తాను పురుషులను తక్కువ చేయడం లేదని అన్నారు. సభకు పాత్రికేయుడు సన్నిధానం శాస్త్రి అధ్యక్షత వహించారు. సరసకవి ఎస్వీ రాఘవేంద్రరావు స్త్రీ ఔన్నత్యంపై స్వీయపద్యాలను వినిపించారు. వివిధ రంగాలలో నిష్ణాతులను సత్యవాణి చేతుల మీదుగా సత్కరించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ రాజమండ్రి అధ్యక్షురాలు నేరెళ్ళ జయశ్రీ, ఘంటసాల శ్యామలాకుమారి, కలపటపు అనురాధ తదితరులు పాల్గొన్నారు.