ఉద్యాన పంటల అభివృద్ధి
-
ఉద్యాన వన శాఖ డీడీహెచ్ హనుమంతరావు
ఆత్మకూరురూరల్: ఆత్మకూరు ప్రాంతాల్లో ఉద్యానవన పంటల అభివృద్ధికి రూ.12 కోట్లు మంజూరైనట్లు ఉద్యానవనశాఖ డిప్యూటీ డైరెక్టర్ పావులూరి హనుమంతరావు తెలిపారు. మండలంలోని నెల్లూరుపాళెం, పేరారెడ్డిపల్లి గ్రామాల్లోని పండ్ల తోటలు, ప్యాక్‌హౌస్‌లను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండ్ల తోటల్లో యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించాలని రైతులకు సూచించారు. తోటలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ తెగుళ్ల నివారణకు మందులను పిచికారీ చేయాలన్నారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద పండ్ల తోటలు, హైబ్రిడ్ పూలతోటలు, కూరగాయల సాగు, నిమ్మ, మామిడి ముదురు తోటల పునరుద్ధరణకు ఆత్మకూరుకు రూ.5.8 కోట్లు మంజూరుచేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్యాక్‌హౌస్‌ల నిర్మాణానికి సబ్సిడీపై నిధులు అందజేస్తుందన్నారు. పండ్ల ప్యాకింగ్, నిల్వకు ప్యాక్‌హౌస్‌లు తోడ్పడుతాయని తెలిపారు. ఆయన వెంట ఉద్యానవనశాఖ అధికారిణి పెద్దిలక్ష్మి, సాంకేతిక అధికారి కలీం, ఏఈఓ విజయమ్మ, తదితరులు ఉన్నారు.