- విలీన ప్రతిపాదిత పంచాయతీల్లో ఇంటి ప్లాన్ నిబంధనలు కఠినతరం
- భవన నిర్మాణదారులకు సరికొత్త ‘చెక్‌లిస్ట్’
- అవినీతి, అక్రమాలకు తావుండదంటున్న అధికారులు
- ఇబ్బందులు పడుతున్న సామాన్యులు
సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం నగరంలో విలీనం చేయాలంటూ ప్రతిపాదించిన పంచాయతీల్లో సొంతిల్లు కట్టుకోవాలనుకునే సామాన్యులకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. ఇంటి ప్లాన్ అనుమతుల కోసం నిబంధనలు కఠినతరం చేస్తూ సరికొత్తగా ఇచ్చిన ఉత్తర్వులే ఇందుకు కారణం. దీనివల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతూండగా, ఈ విధానంలో అక్రమాలకు తావుండదని అధికారులు అంటున్నారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం ధవళేశ్వరం, బొమ్మూరు, రాజవోలు, హుకుంపేట, పిడింగొయ్యి, శాటిలైట్ సిటీ, కోలమూరు, కాతేరు, వెంకటనగరం, తొర్రేడు; కోరుకొండ మండలం గాడాల, నిడిగట్ల, మధురపూడి, బూరుగుపూడి; రాజానగరం మండలం రాజానగరం, హౌసింగ్ బోర్డు కాలనీ, పాలచర్ల, చక్రద్వారబంధం, నామవరం, నరేంద్రపురం, వెలుగుబంద పంచాయతీలను రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో విలీనం చేయాలని ప్రతిపాదించారు. ఈ 21 పంచాయతీల్లో ఇంటి నిర్మాణ అనుమతుల విషయంలో నిబంధనలు కఠినతరం చేశారు.
రాజమహేంద్రవరంలో విలీనం చేయాలన్న ప్రతిపాదనల నేపథ్యంలో 2012 నుంచి ఈ 21 పంచాయతీల్లో ఎన్నికలు జరగలేదు. పాలకవర్గాలు లేకపోవడంతో ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో పంచాయతీ కార్యదర్శులు పాలన సాగిస్తున్నారు. 2014 సాధారణ ఎన్నికల తర్వాత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, గ్రామ పంచాయతీల్లో జన్మభూమి కమిటీలను నియమించింది. ఈ కమిటీల కనుసన్నల్లోనే విలీన ప్రతిపాదిత 21 పంచాయతీల్లో పాలన సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇళ్ల నిర్మాణం, కుళాయి మంజూరు తదితర అనుమతుల్లో అవినీతి విచ్చలవిడిగా జరిగింది. ఇందులో భాగంగానే కాతేరులో పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. పంచాయతీల్లో పాలన గాడి తప్పుతుండడంతో ప్రత్యేక అధికారులను తప్పించి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ వి.విజయరామరాజును ప్రత్యేక అధికారిగా నియమించారు. ఐఏఎస్ అధికారి కావడంతో పాలన గాడిన పెడతారన్న భావనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే భవన నిర్మాణ అనుమతుల మార్గదర్శకాలను కమిషనర్ సవరించారు. 11 అంశాలతో కూడిన చెక్‌లిస్ట్ తయారు చేసి, ఆ వివరాలు సమర్పించిన తర్వాతే నిర్మాణ అనుమతులు ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనర్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టక ముందు వరకూ స్థలం హక్కు పత్రాలు, లైసెన్స్‌డ్ సర్వేయర్ వద్ద భవన నిర్మాణ ప్లాన్ తీసుకువచ్చి, నిబంధనల మేరకు ఫీజు చెల్లిస్తే పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక అధికారుల సంతకాలతో అనుమతులు ఇచ్చేవారు. ఇందులో అనేక అవకతవకలు జరిగాయి. కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయి. ఈ నేపథ్యంలో కమిషనర్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిబంధనలను కఠినతరం చేశారు.
ఈ సమాచారం ఉంటేనే అనుమతి
భవన నిర్మాణదారుడు ఎంత స్థలంలో ఇల్లు కట్టాలనకుంటున్నారు, ఆ స్థలం సర్వే నంబర్, బ్లాక్ నంబర్, పట్టాదారు పాసు పుస్తకం, రిజిస్టర్డ్ దస్తావేజు, అడంగల్, ఎ-రిజిస్టర్ ఎక్స్‌ట్రాక్ట్, డి-ఫారం పట్టా, స్థలం అభివృద్ధి వివరాలు (గ్రామకంఠమా లేక అప్రూవ్డ్ లే అవుట్ అయితే సర్వే నంబర్, ప్లాట్ నంబర్), ల్యాండ్ కన్వర్షన్ అయితే ఆ ఉత్తర్వుల నంబర్, జారీ చేసిన తేదీ, సబ్ రిజిస్ట్రార్ ప్రకారం భూమి ధర, ఆ స్థలంలో హెచ్‌టీ విద్యుత్ వైర్లు, వాటర్ బాడీ (నది, చెరువు, వాగు), రైల్వే లైను, గ్యాస్ పైప్‌లైను, పురాతన కట్టడాలు, మత సంబంధిత నిర్మాణాలు ఉన్నాయా, ప్రతిపాదిత స్థలం నగరపాలక సంస్థ మాస్టర్‌ప్లాన్‌లో ఉందా, ఉంటే ఆ స్థలం వివరాలను భవన నిర్మాణదారుడు సమర్పించాలి. దీంతోపాటు బెటర్‌మెంట్ చార్జీ, ఖాళీ స్థలంపై పన్ను, అభివృద్ధి చార్జీ, బిల్డింగ్ లైసెన్స్ ఫీజు, పబ్లికేషన్ చార్జీ, ఇతర చార్జీలను పంచాయతీకి చెల్లించాలి. అనంతరం పంచాయతీ కార్యదర్శి భవన నిర్మాణదారు సమర్పించిన ప్లాన్‌ను పరిశీలించి, క్షేత్రస్థాయిలో ఆ వివరాలు సరిపోల్చాలి. దీంతోపాటు జీవో ప్రకారం నిర్మాణం చేపట్టాల్సిన భవనం చుట్టూ వదలాల్సిన సెట్‌బ్యాక్స్ ఉన్నాయా అన్నది పరిశీలించాలి. చివరిగా ఏమైనా రిమార్కులు ఉన్నాయేమో పేర్కొంటూ, కార్యదర్శి ధ్రువీకరించిన తర్వాత అనుమతులు మంజూరు చేస్తారు. ఈ నిబంధనలతో సామాన్యులు ముప్పుతిప్పలు పడుతున్నారు. ఏ ఒక్క వివరం లేకపోయినా అనుమతులు రాకపోవడంతో పంచాయతీల్లో దరఖాస్తులు పేరుకుపోతున్నాయి. బిల్డర్లు, పెద్ద నిర్మాణాలు చేపట్టే వారితోపాటు స్వతహాగా చిన్న ఇల్లు నిర్మించుకునేవారికి కూడా ఒకేలా నిబంధనలు విధించడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు కొంతమేర వెసులుబాటు కల్పించాలని సొంతంగా చిన్న ఇళ్లు నిర్మించుకునేవారు కోరుతున్నారు.
అక్రమాలకు తావుండదు
ఇప్పటివరకూ కొన్ని విలీన ప్రతిపాదిత పంచాయతీల్లో భవనాల అనుమతుల్లో అనేక అక్రమాలు జరిగాయి. గ్రామ ప్రజల మధ్య గొడవలు చెలరేగాయి. ఇలాంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతోనే చెక్‌లిస్ట్ పెట్టాము. అందులో అడిగినవి స్థల యజమానుల వద్ద తప్పక ఉంటాయి. వాటిని తీసుకురావడంవల్ల భవిష్యత్తులో ఆయా యజమానులు, ఇళ్లు కొనుగోలు చేసిన వారికి ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.
- వి.విజయరామరాజు, ప్రత్యేక అధికారి, విలీన పంచాయతీలు