కట్టపై బురద మట్టిని పరిశీలిస్తున్న మంత్రి
- రెండేళ్లయినా చాలదా?
- కోమటి చెరువు పనులపై కాంట్రాక్టర్‌పై మండిపడ్డ మంత్రి
- సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు ఆకస్మిక తనిఖీలు
- చెరువులు, కుంటల పరిశీలన
- కబ్జాలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచన
సిద్దిపేట జోన్: పట్టణ శివారులోని కోమటి చెరువు ఆధునికీకరణ పనుల్లో జాప్యంపై రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులపై మండిపడ్డారు. మినీట్యాంక్ బండ్ తరహాలో ఆధునికీకరించే క్రమంలో నిధుల మంజూరు చేసి రెండేళ్లు గడిచినా పూర్తికాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సిద్దిపేటలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పట్టణంలోని చెరువుల స్థితిగతులను మంగళవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
కోమటి చెరువు, ఎర్రచెరువు, చింతల చెరువులను అధికారులతో కలిసి సందర్శించారు. ముందుగా కోమటి చెరువుకు చేరుకున్న మంత్రి అక్కడ జరుగుతున్న పనుల జాప్యంపై నీటి పారుదల, టూరిజం, మున్సిపల్ అధికారులను ఆరా తీశారు. చెరువు కట్టపై వర్షపు నీరు నిల్చి ఉండడం, పిల్లల పార్కులో గుంతలు ఏర్పడడం, కట్టపైన ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్ టైల్స్, బండల మధ్య పొదలు పెరగడం చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్‌ను పిలిచి పనులు త్వరిగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
గడువు కావాలని కాంట్రాక్టర్ కోరడంతో విస్మయాన్ని వ్యక్తం చేశారు. గత ఏడాది బతుకమ్మ పండుగ నాటికే పూర్తి స్థాయిలో ఆధునికీకరణ చేపట్టాలని చెప్పినా.. మళ్లీ బతుకమ్మ పండుగ వస్తుందన్నారు. సమయం ఎంత ఇచ్చినా సరిపోదు, మరో రెండేళ్లయినా చాలదంటూ అసహనం వ్యక్తం చేశారు.
అక్కడే ఉన్న నీటి పారుదల శాఖ ఈఈ రవీందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణచారి, ఓఎస్డీ బాల్‌రాజుతో మంత్రి మాట్లాడుతూ.. బుధవారం ఆయా శాఖల ముఖ్య అధికారులు సిద్దిపేటకు వస్తారని పనులను వేగవంతం చేసేందుకు సమన్వయంతో కృషి చేయాలని, బతుకమ్మ పండుగ నాటికి పూర్తి స్థాయిలో పనులు జరగాలని మంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్తులో కోమటి చెరువు పరిసరాల్లో శిల్పారామం తరహాలో నిర్మాణం చేపట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు.
చెరువుపై రోప్ వే ఏర్పాటు చేస్తే పర్యాటక ప్రాంతంగా మంచి గుర్తింపు వస్తుందన్నారు. నాసర్‌పురా కప్పల కుంటలో భారీ గుంతలు తీయడంపై ఆరా తీశారు. చింతల చెరువు పనులను వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం బైపాస్ రోడ్డు మీదుగా రంగధాంపల్లి చౌరస్తా, ఎంపీడీఓ చౌరస్తాకు చేరుకొని బాబూ జగ్జీవన్‌రామ్ కూడలి ఆధునికీకరణపై అధికారులతో సమీక్షించి, పనులను త్వరితగతిన పూర్తి చేయలన్నారు.
ఫుట్‌పాత్ పనులను పరిశీలించారు. దసరా రోజు సీఎం సిద్దిపేటకు వస్తున్నారని, పనులను వేగవంతంగా చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్లు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, బర్ల మల్లికార్జున్, మరుపల్లి శ్రీనివాస్‌గౌడ్, బ్రహ్మం, ప్రవీణ్, తాళ్లపల్లి సత్యనారాయణ, అధికారులు నాగరాజు, విష్ణువర్ధన్‌రెడ్డి, లక్ష్మణ్, యాదగిరి తదితరులు ఉన్నారు.