
గుండు మీద కేసీఆర్ అక్షరాలు గీయించుకున్న అభిమాని
వర్గల్/ములుగు/జగదేవ్‌పూర్: కోమటిబండ గుట్టపైన ఆదివారం ప్రధాని మిషన్ భగీరథ ప్రారంభోత్సవం జరిపి వెళ్లిన కొద్దిసేపటికే జనం గుంపులు గుంపులుగా గుట్టపైకి చేరుకున్నారు. సభలో సీఎం మాట్లాడుతుండగానే సభ ప్రాంగణంలో ఉన్న జనాలు గుట్ట వైపు తరలారు. అప్పటిదాకా గుట్ట మీద పోలీసుల ఆంక్షలు కొనసాగడం, ఆ తరువాత కొద్దిగా సడలించడంతో గుట్టపైనే పథకం చూసేందుకు వారు ఆసక్తి కనపరచారు. ఎట్లాగు ఇక్కడిదాక వచ్చాం.. పథకం చూసి పోదాం అనే భావనలో వారంతా గుట్ట మీదికి గుంపులుగా చేరిపోయారు.
సభ ప్రాంగణంలో ‘సెల్ఫీ’ల జోరు
ప్రధాని సభ ప్రాంగణంలో ఏ వైపు చూసినా ‘సెల్ఫీ’ల జోరు కన్పించింది. సభకు వచ్చిన ప్రతి ఒక్కరు తమ సెల్‌ఫోన్‌లో సెల్ఫీలు తీసుకున్నారు. కొందరు గుట్టపైన సెల్ఫీలు తీసుకుంటే, మరికొందరు తరలివస్తున్న జనంలో కలిసిపోయి సెల్ఫీలు తీసుకున్నారు. ఇంకొందరు సభ ప్రాంగణంలోని ఎల్‌సీడీల వద్ద సెల్ఫీలు తీసుకున్నారు. ఎక్కువ శాతం యువతీ యువకులు, ప్రజా ప్రతినిధులు, పోలీసులు కూడా సెల్ఫీలు దిగుతూ హంగామాగా కన్పించారు.
పులిహోర తిని.. గోదావరి నీళ్లు తాగి..
సభకు వచ్చిన జనం తమ వెంట తెచ్చుకున్న పులిహోర ప్యాకెట్లు సభా ప్రాంగణంలోనే తిని అక్కడే ఏర్పాటు చేసిన నల్లాల ద్వారా వచ్చిన గోదారమ్మ నీళ్లు తాగారు. వృద్ధులు నల్లాల వద్దకు చేరుకుని గోదారి నీళ్లతో గొంతు తడుపుకున్నారు. బాగున్నాయంటూ మురిసిపోయారు. ఇక మా పల్లెల్లో కూడా ఈ నీళ్ల తాగుతామని సంబరపోయారు.
సక్సెస్ కోసం నమాజ్
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మక మిషన్ భగీరథ పథకం సఫలం కావాలని ఓ ముస్లిం అభిమాని సభా ప్రాంగణం పక్కన మొక్కల నడుమ ‘నమాజ్’ చేస్తూ కన్పించాడు. పది నిమిషాల పాటు ప్రార్థన కొనసాగించాడు. భారీ జనాన్ని పట్టించుకోకుండా అతను నమాజ్‌లో మునిగిపోయాడు. ఆ తరువాత ఆయనను ఆరా తీస్తే మిషన్ భగీరథ సక్సెస్ కావాలని అల్లాను ప్రార్థించినట్లు తెలిపాడు.
నృత్యాలు చేస్తూ ముందుకుసాగిన బంజారాలు
సభకు వివిధ ప్రాంతాలనుంచి గిరిజనులు తరలివచ్చారు. ఈ సందర్భంగా మహిళలు తమ సంప్రదాయ బంజారా నృత్యం చేసుకుంటూ సభికులను ఆకట్టుకున్నారు. వీరు పార్కింగ్ స్థలం నుంచి నృత్యం చేస్తూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
బైక్‌లాంటి సైకిల్‌పై..
బైక్ సీటు, పెట్రోల్ ట్యాంక్, హెడ్‌ల్యాంప్‌తో వెనక హరితహారం మొక్క డిజైన్‌తో గజ్వేల్‌కు చెందిన ముస్లిం యువకుడు హల్‌చల్ చేసాడు.
‘గుండు’ మీద కేసీఆర్
వీరాభిమానం ఓ యువకుని గుండు చేయించుకునేలా చేసింది. కేసీఆర్ అక్షరాలు ఉండేలా గుండు గీయించుకుని గజ్వేల్‌కు చెందిన మెకానిక్ మల్లేషం ఆకట్టుకున్నాడు. అతన్ని అందరూ ఆసక్తిగా తిలకించారు.