1957 కల్లా మరింత బలపడ్డ కాంగ్రెస్
రెండో లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం
బలమైన ప్రతిపక్షం లేకపోవడమే కారణం
27 సీట్లతో రెండో అతి పెద్ద పార్టీగా సీపీఐ
స్వాతంత్య్రం సిద్ధించి అప్పటికి దశాబ్దం గడిచింది. నెహ్రూ పాలనే సాగుతోంది. ముప్పిరిగొన్న సమస్యల నడుమే రెండో లోక్‌సభ ఎన్నికలు ముంచుకొచ్చాయి. ప్రజలకు ఓటు విలువ తెలియజెప్పి ఓటేసేలా చేయడం ఎన్నికల సంఘానికి కీలక సవాలుగా నిలిచింది. అయితే 1952 తొలి ఎన్నికల నిర్వహణ తాలూకు అనుభవం ఈసారి బాగా పనికొచి్చంది. పాకిస్తాన్ రాజ్యాంగ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉండగానే మనం రెండో ఎన్నికలు కూడా విజయవంతంగా నిర్వహించుకున్నాం. దేశంలో ప్రజాస్వామ్యం గట్టిగా వేళ్లూనుకుందని ప్రపంచానికి చాటాం.
దేశాన్ని ఎన్నో సమస్యలు వేధిస్తున్నప్పటికీ రెండో లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు మరోసారి నెహ్రూకే పట్టం కట్టారు. బలమైన ప్రతిపక్షం లేకపోవడమే దీనికి కారణం. 1952లో తొలి ఎన్నికల్లో 364 లోక్‌సభ సీట్లు గెలిచిన కాంగ్రెస్ బలం ఈసారి 371 స్థానాలకు పెరిగింది. ఓట్ల శాతం కూడా 45 శాతం నుంచి 47.8 శాతానికి పెరిగింది. సీపీఐ 27 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది.
1952తో పోలిస్తే 11 స్థానాలు పెరిగినా ఓట్ల శాతం మాత్రం 32.65 నుంచి 24.55కు క్షీణించింది. కాంగ్రెస్ తర్వాత అధిక స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులే నెగ్గడం విశేషం! వారు 19.3 శాతం ఓటింగ్‌తో 42 స్థానాలు గెలుచుకున్నారు. రాష్ట్రాల స్థాయిలో జనతా, ఫార్వార్డ్ బ్లాక్, గణతంత్ర పరిషత్, అఖిల భారతీయ హిందూ మహాసభ, జార్ఖండ్ పార్టీ, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్, ప్రజాపార్టీ, పీసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ, అఖిల భారతీయ రామ్ రాజ్య పరిషత్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ పోటీ చేశాయి.
సమస్యలు ఎన్నున్నా...
నిరుద్యోగం, ఆహార కొరత, నిత్యావసరాల ధరల పెరుగుదల, రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ విషయంలో ప్రజల్లో అసంతృప్తి, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, ఆశించిన అభివృద్ధి లేకపోవడం, భూ సంస్కరణల నత్తనడక, రాష్ట్రాల్లో పాలనా సామర్థ్యం లోపించడం, ఉత్తరాధి ఆధిపత్యంపై దక్షిణ భారతీయుల్లో ఆగ్రహం... ఇలాంటి పలు సమస్యలను రెండో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పార్టీలు బలంగా ప్రజల ముందుకు తీసుకెళ్లాయి.
ఇన్ని సమస్యలున్నా కాంగ్రెస్‌ను ఢీకొట్టే బలమైన ప్రతిపక్షం లేకపోవడంతో పోటీ ఏకపక్షమేనని ముందే తేలిపోయింది. నెహ్రూ సర్కారుకు ఎన్ని స్థానాలొస్తాయన్నదే కాస్త ఆసక్తి కలిగించిన అంశం. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచి్చన సీట్లలో మూడింట రెండొంతులు ఉత్తరాది చలవే! ఒక్క యూపీయే కాంగ్రెస్‌కు ఏకంగా 70 సీట్లు కట్టబెట్టింది!
ఒక స్థానం.. ఇద్దరు ప్రజాప్రతినిధులు
బహుళ అభ్యర్థుల నియోజకర్గాలకు చివరి ఎన్నికలుగా 1957 లోక్‌సభ ఎన్నికలు చరిత్రలో గుర్తుండిపోతాయి. 1957లో 91 స్థానాలు ద్వంద్వ నియోజకవర్గాలున్నాయి. జనరల్ కోటా నుంచి ఒకరు, ఎస్సీ/ఎస్టీ కోటా నుంచి ఒకరు చొప్పున ఆ స్థానాల్లో ఇద్దరు విజేతలుండేవారు. ఆ తర్వాత ఈ విధానాన్ని తొలగించారు. 1952 తొలి ఎన్నికల్లోనైతే పశి్చమబెంగాల్‌లో ముగ్గురు అభ్యర్థులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కూడా ఉంది...!
వాజ్‌పేయి అరంగేట్రం...
దిగ్గజ నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి 1957 ఎన్నికల్లో నెగ్గి తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. ఆయనను గొప్ప వక్తగా నెహ్రూ కొనియాడారు. అంతేకాదు, ‘ఏదో ఒక రోజు ప్రధాని అవుతాడు’ అంటూ కచి్చతంగా భవిష్యద్దర్శనం కూడా చేశారు! ఇక, సీఈసీగా వరుసగా రెండుసార్లు సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన సుకుమార్ సేన్ 1958 డిసెంబర్ 19న కన్నుమూశారు.
విశేషాలు ఎన్నెన్నో ...
► 1957లో రెండో లోక్‌సభ ఎన్నికలు మొత్తం 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో జరిగాయి.
► ఆంధ్రప్రదేశ్, అసోం, బిహార్, బాంబే, కేరళ, మధ్యప్రదేశ్, మద్రాస్, మైసూరు, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశి్చమబెంగాల్, జమ్మూ అండ్ కశీ్మర్‌తో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, అండమాన్ నికోబార్, లక్షద్వీప్–మినీకాయ్– మినిందివిల్లో పోలింగ్ జరిగింది.
► మొత్తం 494 లోక్‌సభ స్థానాలకు గాను ఒక్కో చోట సగటు ముగ్గురు అభ్యర్థుల కంటే బరిలో లేరు.
► కాంగ్రెస్ మినహా మరో బలమైన జాతీయ పార్టీ లేనే లేదు. ప్రాంతీయ పార్టీలు అప్పుడప్పుడే మొగ్గ తొడుగుతున్నాయి.
► జాతీయ స్థాయిలో నాలుగే పార్టీలు ఎన్నికల్లో పాల్గొన్నాయి. రాష్ట్రాల్లో మరో 15 పార్టీలు అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి.
► 1957 ఫిబ్రవరి 24 నుంచి జూన్ 9 దాకా మూడున్నర నెలల పాటు ఎన్నికల నిర్వహణ క్రతువు సాగింది.
► ఓటు ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈసీ ఎంతో కృషి చేసినా పెద్దగా ఫలితం కనిపించలేదు.
► 1952 తొలి ఎన్నికల్లో 44.87 శాతం ఓటింగ్ నమోదవగా 1957లో 45.44 శాతానికి పెరిగింది. 19,36,52,179 మంది ఓటేశారు.
► ఈ ఎన్నికలూ తొలి ఎన్నికల ప్రధాన కమిషనర్ సుకుమార్ సేన్ సారథ్యంలోనే జరిగాయి.
► ఎన్నికల నిర్వహణ వ్యయాన్ని బాగా తగ్గించడంతో పాటు వాటిని మరింత సమర్థంగా నిర్వహించారాయన.
► దాంతో సుడాన్ తమ తొలి ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సేన్‌కే అప్పగించడం విశేషం...!
► పోలింగ్ బూత్‌లను ఆక్రమించే పెడ ధోరణి 1957 ఎన్నికల్లోనే తొలిసారిగా కనిపించింది!
Comments
Please login to add a commentAdd a comment