ఇప్ప.. కాసుల కుప్ప! | huge profits with mahua tree | Sakshi
Sakshi News home page

ఇప్ప.. కాసుల కుప్ప!

Published Mon, Dec 7 2015 4:41 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 PM

ఇప్ప చెట్టు

ఇప్ప చెట్టు

- ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించనున్న ప్రభుత్వం
- పువ్వుతో నూనె, హల్వా, లడ్డూ, కేక్ తయారీ
- లీటరు ఇప్పనూనె రూ.100 పైనే..
- ఒడిశా తరహాలో వినూత్న ఉత్పత్తులకు శ్రీకారం చుట్టే యత్నాలు
- ప్రణాళికలు రచిస్తున్న ట్రైఫెడ్
 
సాక్షి ప్రతినిధి, వరంగల్:
ఇప్పపువ్వంటే ఇప్పటిదాకా సారా మాత్రమే గుర్తొచ్చేది! కానీ ఇకపై ఇప్ప నూనె, ఇప్ప హల్వా, ఇప్ప లడ్డూ, ఇప్ప కేక్ కూడా గుర్తుకువస్తాయి. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఇప్పతో అటవీ ఉత్పత్తుల తయారీని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని భారతీయ గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమాఖ్య(ట్రైఫెడ్) ఇప్పటికే ఇప్పపువ్వు సేకరణకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తోంది.

ఇప్ప పువ్వు సేకరణతోపాటు ఇప్ప ఆకులు, ఇప్ప నూనె, హల్వా, లడ్డూ, కేక్, బెరడుకు మార్కెటింగ్ పెంచేందుకు ప్రయత్నిస్తోంది. గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉండే ఒడిశాలో ప్రస్తుతం ఇప్పనూనెతోపాటు ఇప్ప లడ్డూ, ఇప్ప హల్వా వంటి ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్నారు. ఆ రాష్ట్రంలోని ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి ట్రైఫెడ్ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మన రాష్ట్రంలోనూ ఇప్ప ఉత్పత్తుల మార్కెటింగ్‌ను పెంచేందుకు ట్రైఫెడ్ కార్యక్రమాలు చేపడుతోంది. ఖమ్మం జిల్లా చింతూరు కేంద్రంగా పనిచేస్తున్న అసోసియేషన్ ఫర్ సోషల్ అండ్ హ్యూమనైజ్ యాక్షన్(ఆశా) సహకారంతో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

ఒక చెట్టు నుంచి 80 కిలోల విత్తనాలు
ట్రైఫెడ్ సహకారంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఇప్ప నూనె ఉత్పత్తి చేస్తున్నారు. మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైనదిగా గిరిజనులు చెపుతున్న ఈ నూనెకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. దీపారాధనకు ఉపయోగించే ఇప్పు నూనెకు లీటరు రూ.100 పైనే ధర పలుకుతోంది. చర్మ, కేశాల సంరక్షణకు, కీళ్ల నొప్పులకు, సబ్బుల తయారీకి కూడా దీన్ని వినియోగిస్తారు. జూన్, జూలైలో ఇప్పకాయలు పండి విత్తనాలు ఏర్పడుతాయి. ఒక చెట్టు ఏటా 80 కిలోల వరకు విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. విత్తనాలలో 35 శాతం నూనె, 14 శాతం ప్రొటీన్‌లు ఉంటాయి. పండ్లు పక్వానికి వచ్చిన తర్వాత కింద పడతాయి.

వీటిని గిరిజనులు సేకరించి వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. అయితే మంచి ధర కల్పించేందుకు ట్రైఫెడ్ వంటి సంస్థలు గిరిజనుల నుంచి ఈ గింజలను సేకరిస్తున్నాయి. గింజల నుంచి పప్పులను తీసేందుకు గిరిపుత్రులు ఎక్కువ కష్టపడుతున్నారు. రాళ్లతో గింజను పగులగొట్టి పప్పులను తీస్తున్నారు. ఇది శ్రమతో కూడుకున్నది కావడంతో ప్రత్యేకంగా రూపొందించిన యంత్రాన్ని ట్రైఫెడ్ సహకారంతో గిరిజనులకు పంపిణీ చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

పువ్వులో ఔషధ గుణాలు!
ఇప్ప పూలు, గింజల నుంచి తీసే నూనెలో ఔషధ, పోషక గుణాలు ఉన్నాయని జాతీయ పోషకాహార సంస్థ అధ్యయనంలో తేలిందని ట్రైఫెడ్ చెబుతోంది. బాలింతలకు ఆరోగ్యాన్ని ఇవ్వడంతోపాటు శారీరక బలహీనత నివారించే గుణాలు వీటిలో ఉన్నాయని పేర్కొంటోంది. 30 ఏళ్ల వయసున్న ఇప్ప చెట్టు సగటున 150 కిలోల పూలను ఉత్పత్తి చేస్తుంది. మట్టి అంటకుండా ఈ పూలను సేకరించి నిల్వ చేస్తారు. అనంతరం వీటి నుంచి పంచదార పాకం చేసి దాంతో బిస్కెట్, చాక్లెట్, జామ్, కేక్‌లను తయారు చేస్తారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహించిన పరిశోధనలో ఢిల్లీకి చెందిన డాక్టర్ ఎస్.ఎన్.నాయక్ ఈ ప్రక్రియపై పేటెంట్ కోసం కూడా దరఖాస్తు చేశారు. ట్రైఫెడ్-ఆశా సంస్థల ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలంలో 20 గ్రామాల్లో, వరంగల్ జిల్లా ఏటూరు నాగారం, మంగపేట మండలాల్లోని ఐదు చొప్పున గ్రామాల్లో ఇప్ప పువ్వు సేకరణ కార్యక్రమం అమలవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement