భోపాల్: అడవిలోని చెట్టును తాకనీయక పోవడంతో.. ఊరి ప్రజలంతా ఒక్కటై పోలీసులను చితకబాదారు. ఈ ఘటన బుధవారం మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. తమ గ్రామానికి సమీపంలోని అడవిలో ఉన్న ఒక పవిత్ర చెట్టును తాకనీయకుండా పోలీసులు అడ్డుపడుతున్నారనే కోపంతో.. గ్రామస్తులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో 11 మంది పోలీసులు తీవ్రంగా గాయపడగా.. ఒక ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని హోషంగాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఘన్‌శ్యామ్ మాలవీయ తెలిపారు. గ్రామస్తులు పోలీసులపై తెగబడడానికి గల కారణాలేమిటో ఇంకా తెలియలేదని అన్నారు.
అడవిలో ఉన్న ప్రత్యేకమైన ఆ పవిత్ర చెట్టును వరుసగా ఐదు బుధవారాలు లేదా ఐదు ఆదివారాలు ఎవరైనా తాకితే వారికి ఉన్న సర్వరోగాలు నయమవుతాయనే వదంతులు గత సెప్టెంబర్ నవరాత్రి ఉత్సవాల నుంచి ఊపందుకున్నాయని అధికారి పేర్కొన్నారు. దీంతో అక్కడి గోండులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి.. ఇప్ప చెట్టును తాకడం ప్రారంభించారు. వదంతుల కారణంగా సాత్పురా టైగర్ రిజర్వ్ ఉన్న ఆ అడవిలోకి.. అధిక సంఖ్యలో గోండులు తరలివచ్చి.. పవిత్ర ఇప్ప చెట్టును దర్శించుకుంటున్నారని సదరు పోలీసు అధికారి వివరించారు. కాగా బంఖేడి ప్రాంతానికి చెందిన రూప్ సింగ్ అనే వ్యక్తి తాను అటవి గుండా ప్రయాణిస్తుండగా.. అద్భుతమైన దైవశక్తి తనను ఇప్ప చెట్టు వైపుకు లాగిందని.. జోరుగా నయాగావ్‌లో ప్రచారం చేశాడని ఓ పోలీసు అధికారి చెప్పారు.
రాష్ట్ర రాజధాని భోపాల్‌కు దక్షిణంగా 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో అనూహ్యంగా నెల రోజుల నుంచి జనాలు గుంపులు కడుతున్నారని.. దీంతో అక్కడ ఒక నెల వ్యవధిలోనే అకస్మాత్తుగా 400కు పైగా పూజ సామాగ్రిని అందించే షాపులు పుట్టుకొచ్చాయని విషయాన్ని మీడియా ముందు వెల్లడించారు. నయాగావ్‌లో ఉద్రిక్త పరిస్థితులకు తెరదీసిన కారణాలేమిటో ఇంకా తెలియరాలేదని.. పోలీసులపై దాడి విషయమై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. అయితే అక్కడి షాపులను పాలకవర్గం ఇప్పటికే తొలగించిందని.. కుప్పలు తెప్పలుగా వస్తున్న జన సమూహాన్ని క్రమబద్దికరించే ప్రయత్నంలో పోలీసుల పైకి దాడికి దిగారన్నారు. అడవిలోకి ప్రవేశం కల్పించడంపై పోలీసులు, గ్రామస్తుల మధ్య తరచు వాగ్వాదం జరుగుతుండేదని తెలిపారు.
పరిస్థితి తమ చేయి దాటిందని.. వారిని నిలువరించేందుకు బారికేడ్లు ఏర్పాటు చేసినా.. కొత్త మార్గాల్లో అడవిలోకి చొరబడి వెళుతున్నారని పోలీసు అధికారులు అసహనం వ్యక్తం చేశారు. పోలీసులపై దాడి జరగడంతో ఇప్పటికైనా ఈ సమస్యకు పరిష్కారం కనుగొని పరిస్థితులను చక్కదిద్దేందుకు అక్కడి పాలకవర్గం సరియైన ప్రణాళికతో ముందుకు వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment