
మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక వయసులో ప్రేమలో పడటం సహజం. నచ్చిన వ్యక్తి కంటికి తారసపడితే మనసులో కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. రెండు అక్షరాల ప్రేమను పొందిన వారంతా మూడు మూళ్ల బంధంతో ఒకటి కాలేరు. యుద్ధం చేసి అయిన ప్రేమను దక్కించుకునే వారు కొందరైతే, చిన్న చిన్న కారణాలకే విడిపోయే జంటలు అనేకం. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్లు దూరం అయితే కలిగే బాధ నరకం కంటే దారుణంగా ఉంటుంది. కారణాలేమైనా ప్రాణం అనుకున్న వాళ్లు మన కళ్ల ముందే వేరే వారితో జీవితాన్ని పంచుకునేందుకు సిద్ధపడితే కలిగే వేదన వర్ణణాతీతం.
అలాంటి హృదయవిదారక వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ప్రేమించిన వ్యక్తి మరో అమ్మాయిని వివాహం చేసుకుంటుండగా పెళ్లి మండపం వద్ద ప్రియురాలు గుండెలు పగిలేలా రోదించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని హోసంగాబాద్‌లో జరిగింది. వివరాలు.. కాన్పూర్‌కు చెందిన ఓ యువతి ఉద్యోగ నిమిత్తం భోపాల్‌లో ఉంటోంది. ఈమె పనిచేసే సంస్థలోనే ఉద్యోగం చేసే ఓ వ్యక్తితో గత మూడేళ్ల నుంచి సహజీవనం చేస్తోంది. అయితే ఇటీవల అతనికి తల్లిదండ్రులు వేరే మహిళతో రహస్యంగా పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రేయసి పెళ్లి జరుగుతున్న వేడుక వద్దకు వెళ్లింది. లోపలికి వెళ్లేందుకు యువతి ప్రయత్నించగా.. సెక్యూరిటీ గార్డులు అడ్డుకున్నారు.
దీంతో ఆమె మండపం బయట నుంచే ‘బాబు..బాబు’(అతన్ని ముద్దుగా పిలుచుకనే పేరు) అంటూ గుండెలు పగిలేలా రోదించింది. మండపం నుంచి బయటకు రావాల్సిందిగా కేకలు చేసింది. తనతో ఒక్కసారి మాట్లాడాలని వేడుకుంది. కాగా యువతి హల్‌చల్ చేస్తుండడం పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఆమెను వివరాలు అడగడంతో.. ప్రస్తుతం పెళ్లి చేసుకుంటున్న వరుడు తన ప్రేమికుడని, తనతో కలిసి మూడేళ్లు సహజీవనం చేసి, ఇప్పుడు రహస్యంగా పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పింది. అతడిపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలపగా.. ఇంట్లో వాళ్లకు ఇబ్బందులు వస్తాయని సదరు యువతి కంప్లైంట్ ఇవ్వలేదని సమాచారం. వెంటనే తనతోపాటు వచ్చిన వారితో కలిసి భోపాల్ వెళ్లిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment