mahua tree
-
Viral Story: తప్పతాగి పడిపోయిన ఏనుగుల గుంపు.. అందులో నిజమెంత?
సాక్షి, భువనేశ్వర్: ఏనుగులు తప్పతాగి పడిపోవడంమేంటి? అని ఆశ్చర్యపోకండి. ఇది నిజం. ఒడిశాలోని కియోంజర్ జిల్లాలోని షిల్పాద గిరిజన గ్రామ ప్రజలు అదే చెప్తున్నారు. తాము నాటు సారా తయారీ కోసం పులియబెట్టిన ద్రావణాన్ని 24 ఏనుగుల గుంపు తాగేసి సోయి తప్పి పడిపోయాయని అంటున్నారు. స్థానిక గిరిజనులు చెప్తున్న వివరాల ప్రకారం.. షిల్పాదా జీడిమామిడి అడవిలోకి గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో వెళ్లాం. అక్కడే తమకు మహువా (ఇప్ప పూలు) పువ్వులతో నాటు సారా తయారు చేసుకునే కుటీరం ఉంది. మొత్తం 24 ఏనుగుల గుంపు తమ కుటీరం వద్ద ఒక్కోటి ఒక్కోచోట పడుకుని ఉన్నాయి. అవి నిద్రకు ఉపక్రమించాయేమోనని తొలుత భావించాం. వాటిని నిద్ర లేపేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కానీ, సారా తయారీకని మహువా పువ్వులను నీటిలో పులియబెట్టిన ద్రావణాన్ని అక్కడ నిల్వ ఉంచాం. అది కనిపించలేదు. ఆ కుండలన్నీ పగలిపోయి ఉన్నాయి. కొన్ని ఖాళీగా కనిపించాయి. అప్పుడు తెలిసింది.. అవి ఆ ద్రావణాన్ని ఫూటుగా సేవించి మత్తుగా పడుకుని ఉన్నాయని! వెంటనే విషయాన్ని అటవీ అధికారులకు తెలిపామని నిరయా సేథి అనే వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఏనుగుల్లో 9 మగ, 9 ఆడ, 6 గున్నవి ఉన్నాయని వెల్లడించారు. (చదవండి: ప్రెగ్నెంట్ అంటూ... ప్లాస్టిక్ బొమ్మతో షాకిచ్చిన మహిళ!) అటవీ అధికారులు ఏమన్నారంటే.. పాటనా అటవీ రేంజ్ అధికారులు షిల్పాద ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని తెలుసుకున్నారు. ఏనుగులను నిద్ర లేపేందుకు భారీ డ్రమ్ములను వాయించారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఏనుగులు నిద్ర లేచి అక్కడ నుంచి వెళ్లిపోయినట్టు పాటనా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఘసీరాం పాత్రా తెలిపారు. అయితే, గ్రామస్తులు చెప్తున్నట్టుగా ఏనుగులు సారా తయారీ ద్రావణాన్ని తాగడంపై క్లారిటీ లేదని.. అవి గాఢ నిద్రలో ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. కాగా, మహువా పూల శాస్త్రీయ నామం మధుకా లోంగిఫోలియా. భారత్‌లోని పలు ప్రాంతాల గిరిజన ప్రజలు ఈ పూలతో సారా తయారు చేసుకుంటారు. (చదవండి: ఎవరీ వేటగాడు! 24 క్రూరమృగాలను వేటాడిన చరిత్ర) -
కృషి: ఇప్పపూల లడ్డు పసుపు మసాలా పానీయం
అడవి నుంచి దూరమయ్యాం.. పల్లె నుంచి పట్టణవాసంలో కరెన్సీ కోసం నిత్యం కసరత్తులు చేస్తున్నాం. కానీ, అడవి పంచే ఔషధం.. పల్లె ఇచ్చే పట్టెడన్నమే మనకు అమ్మ చేతి గోరుముద్దంత ప్రేమను అందిస్తుంది. అలాంటి ప్రేమకు వారధిగా నిలుస్తున్నారు గుంటూరు వాసి షేక్ రజియా. ఛత్తీస్‌గడ్‌లోని అటవీ ప్రాంతాల్లో గిరిజనుల స్థావరాలను వెతుక్కుంటూ వెళ్లి వారి ఆహారపు అలవాట్లు తెలుసుకుని, ‘బస్తర్ ఫుడ్ ఫర్మ్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్’ పేరుతో సంస్థను నెలకొల్పి అక్కడి మహిళల చేత ఆరోగ్యకరమైన ఉత్పత్తులను తయారు చేయిస్తున్నారు. వాటికి పట్టణాల్లోనే కాదు అంతర్జాతీయ మార్కెట్లోనూ విలువనూ.. అక్కడి మహిళలకు ఉపాధి అవకాశాలనూ పెంచుతున్నారు. ఆరేళ్లుగా రజియా చేస్తున్న ఈ కృషి గురించి అడిగితే ఆమె ఎన్నో అడవి ముచ్చట్లను ఆనందంగా పంచుకున్నారు. ‘‘జగ్దల్పూర్లో ‘బస్తర్ ఫుడ్ ఫర్మ్’ మెయిన్ ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ నుంచి దంతెవాడ, బస్తర్‌లోనూ మా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో ఆదివాసీలున్న చోటును వెతుక్కుంటూ వెళ్లి, అక్కడ కొంతమంది మహిళలతో మాట్లాడి ఒక యూనిట్‌ని తయారు చేస్తాను. అలా ఇప్పటివరకు పదికి పైగా యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి ఆదివాసీల ఆహార ఉత్పత్తులను నాణ్యంగా తయారు చేయిస్తుంటాను. వాటిని పట్టణవాసులకు మార్కెటింగ్ చేస్తుంటాను. వీటిలో.. మహువా (ఇప్పపూల) లడ్డూ, టీ పొడి, కుకీస్, పసుపు మసాలా, చింతపండు సాస్, ఇన్స్టంట్ చింతపండు రసం పౌడర్, చాక్లెట్స్, తేనె, సేంద్రియ బియ్యం, కారం, బెల్లం.. ఇలా 22 ఉత్పత్తులు ఉన్నాయి. ఆంధ్రా నుంచి ఛత్తీస్గడ్ మా నాన్నగారు గుంటూరులో ఉండేవారు. వ్యాపారరీత్యా ఛత్తీస్‌గడ్‌లో స్థిరపడ్డారు. అమ్మ, ఇద్దరు తమ్ములు, బాబాయ్ కుటుంబ సభ్యులు ..అందరం కలిసే ఉంటాం. అలా నా చదువు అంతా అక్కడే సాగింది. మైక్రోబయాలజీలో డిగ్రీ చేశాను. స్వచ్ఛమైన అడవి సౌందర్యం గురించి నాకు తెలుసు. అందుకే ఎప్పుడూ అడవి బిడ్డల జీవనశైలి మీద నా చూపు ఉండేది. నా చదువులో భాగంగా మొక్కల పరిశోధనకు రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లి, గిరిజనులను కలిశాను. అప్పుడు అక్కడి గ్రామాల్లో కొంతమంది మహిళలు మహువా (ఇప్పపూల) లడ్డూలను తయారుచేస్తున్నారు. నాకు చాలా ఆసక్తి అనిపించింది. ఇప్పపూలలో ఉండే పోషకాలను అడిగి తెలుసుకున్నాను. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే ఇప్పపూలలో తలనొప్పి, విరేచనాలు తగ్గించే సుగుణాలు ఉన్నాయి. చర్మ, కంటి సమస్యలతో సహా చాలా వ్యాధులకు ఔషధంగా వాడచ్చు. వంటకాలకు సహజమైన తీపిని అందిస్తాయి. దీంతో పోషకాహార నిపుణులు, మరికొంత మంది సాంకేతి నిపుణులు, ఆరుగురు గిరిజన మహిళలతో కలిసి అన్ని అనుమతులతో 2017లో ‘బస్తర్ ఫుడ్ ఫర్మ్’ ప్రారంభించాను. సవాళ్లను ఎదుర్కొంటూ... ముందు ఈ బిజినెస్‌కి ఇంట్లో వాళ్లే ఒప్పుకోలేదు. ‘ఎందుకు కష్టం. ఉద్యోగం చూసుకోక’ అన్నారు. బ్యాంకులను సంప్రదిస్తే లోన్ ఇవ్వలేదు. మహువా లడ్డూలను రుచిగా తయారు చేయడంలోనూ సవాళ్లు ఎదురయ్యాయి. చాలా మంది ‘ఎందుకు ఇదంతా వృథా... ఇది ఫెయిల్యూర్ బిజినెస్’ అన్నారు. దీనికి కారణం లేకపోలేదు. చాలాకాలంగా మన దేశంలో ఇప్పపూలను మద్యం తయారీలోనే వాడతారని తెలుసు. ఆదివాసీలే వీటిని ఉపయోగిస్తారు మనకెందుకు అనే అభిప్రాయమే ఉంది. వీటిలోని సానుకూల కోణాన్ని బయట ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాను. అనుమతి కోసం చాలా మంది అధికారులను సంప్రదించాను. 2018లో ఒక ఐఎఎస్ ఆఫీసర్ రెండు నెలల ప్రోగ్రామ్‌కు అనుమతి ఇచ్చారు. లడ్డూల నాణ్యత పెంచడానికి చాలా ప్రయోగాలు చేశాం. మహువా లడ్డూల తయారీ మార్కెటింగ్ చేస్తే రెండు లక్షల రూపాయల లాభం వచ్చింది. అప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగింది. నేర్చుకునేవారికి శిక్షణాలయం బస్తర్ ఫుడ్ ఫర్మ్ని ఇన్స్టిట్యూట్లా మార్చాలని ప్రయత్నాలు చేస్తున్నాను. ఆదివాసీల ఆహారాలు ఏవున్నాయో వాటిని బయటి ప్రపంచానికి చూపించాలన్నదే నా తాపత్రయం. ప్రస్తుతం లండన్ కంపెనీతో కలిసి పని చేయబోతున్నాం. దీనివల్ల అంతర్జాతీయ మార్కెటింగ్ కూడా బాగా పెరుగుతుంది. ఈ బిజినెస్ మోడల్‌గా రాబోయే తరానికి తెలియాలి. ఈ ఆలోచనతోనే ఆసక్తి గలవారు ఒక ఏడాది పాటు ఈ కోర్సు ప్రత్యక్షంగా నేర్చుకునేలా రూపొందించాను. నేర్చుకోవాలంటే ఇక్కడ చాలా పని ఉంది. మరో రెండేళ్లలో ఇన్స్టిట్యూట్ సిద్ధం అవుతుంది. ఇప్పటికే స్టూడెంట్స్ గ్రూప్స్‌గా వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఆసక్తిగలవారు నేర్చుకోవడానికి మా సంస్థను సంప్రదిస్తున్నారు’’ అని ఆనందంగా వివరించారు రజియా. పల్లెవాసుల మధ్య పని చేయాలని, కొత్త మార్గాలను అన్వేషించాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కానీ, అనుకున్నంతగా ఆచరణలో పెట్టలేరు. సవాళ్లను ఎదుర్కొంటూ, సమస్యలను అధిగమిస్తూ పల్లెకు–పట్టణానికి వారధిగా నిలుస్తున్న రజియా లాంటివారు యువతరానికి ప్రతీకగా నిలుస్తున్నారు. సమస్యలను అధిగమిస్తూ! ‘ఈ కన్సల్టెన్సీ మీద కొంత ఆదాయం వస్తుంది. దానిని పని చేస్తున్న మహిళలకే పంచుతాం. ఇక్కడి మహిళలకు పని వచ్చు కానీ మార్కెటింగ్ తెలియదు. ఊరు దాటి బయటకు వెళ్లలేరు. చదువుకున్న వారికి పట్టణ వాతావరణం గురించి తెలియదు. వారి ప్రతిభకు మేం సపోర్ట్‌గా ఉన్నాం. నక్సలైట్స్ సమస్యలూ వస్తుంటాయి. అడవుల్లోని మారుమూల పల్లెలకు వెళ్లినప్పుడు ఒక్కోసారి ఫుడ్ దొరకదు. అక్కడి ఆదివాసీలు త్వరగా అర్థం చేసుకోరు. వారి భాష మనకు రాదు. వాళ్ల భాషల్లోనే విషయం చెప్పాలన్నా కొంచెం సమస్యే. కానీ, వాటిని అధిగమిస్తేనే ఏదైనా చేయగలం. ఒక్కసారి వారికి అర్థమైతే మాత్రం మనమంటే ప్రాణం పెట్టేస్తారు. అంతబాగా చూసుకుంటారు. వాళ్లదగ్గర ఉన్న ప్రతిభను పట్టణానికి పంచే పనిని చేస్తున్నాను.’ పల్లెకు–పట్టణానికి వారధి ‘ రాష్ట్రంలో ఎక్కడ ప్రాజెక్ట్‌కి అనుకూలంగా ఉందనుకుంటే అక్కడకు మా యూనిట్ కూడా మారుతూ ఉంటుంది. నా టీమ్ మెంబర్స్ పది మంది ఎప్పుడూ నాతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉంటారు. మెట్రో సిటీస్‌లో ప్రమోషన్స్ కోసం చురుగ్గా ఉండాలి. అందరికీ పల్లె ఉత్పత్తులు ఇష్టమే. కానీ, అందరికీ అవి లభించేదెలా? అందుకే, నేను పల్లెకు–పట్టణానికి వారధిగా మారాను. నేను చేసే ఈ ప్రాజెక్ట్ వల్ల యుఎస్ వెళ్లడానికి ఫెలోషిప్ కూడా వచ్చింది. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలతో కలిసి పని చేశాను. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా ఉత్పత్తులకు మరింత ఎక్స్పోజర్ పెరిగింది. మంచి పేరు వచ్చింది.’ – నిర్మలారెడ్డి -
చెట్టు నుంచి దూరం చేయడంతో చితక్కొట్టారు
భోపాల్: అడవిలోని చెట్టును తాకనీయక పోవడంతో.. ఊరి ప్రజలంతా ఒక్కటై పోలీసులను చితకబాదారు. ఈ ఘటన బుధవారం మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. తమ గ్రామానికి సమీపంలోని అడవిలో ఉన్న ఒక పవిత్ర చెట్టును తాకనీయకుండా పోలీసులు అడ్డుపడుతున్నారనే కోపంతో.. గ్రామస్తులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో 11 మంది పోలీసులు తీవ్రంగా గాయపడగా.. ఒక ఎస్ఐ, కానిస్టేబుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని హోషంగాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఘన్‌శ్యామ్ మాలవీయ తెలిపారు. గ్రామస్తులు పోలీసులపై తెగబడడానికి గల కారణాలేమిటో ఇంకా తెలియలేదని అన్నారు. అడవిలో ఉన్న ప్రత్యేకమైన ఆ పవిత్ర చెట్టును వరుసగా ఐదు బుధవారాలు లేదా ఐదు ఆదివారాలు ఎవరైనా తాకితే వారికి ఉన్న సర్వరోగాలు నయమవుతాయనే వదంతులు గత సెప్టెంబర్ నవరాత్రి ఉత్సవాల నుంచి ఊపందుకున్నాయని అధికారి పేర్కొన్నారు. దీంతో అక్కడి గోండులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి.. ఇప్ప చెట్టును తాకడం ప్రారంభించారు. వదంతుల కారణంగా సాత్పురా టైగర్ రిజర్వ్ ఉన్న ఆ అడవిలోకి.. అధిక సంఖ్యలో గోండులు తరలివచ్చి.. పవిత్ర ఇప్ప చెట్టును దర్శించుకుంటున్నారని సదరు పోలీసు అధికారి వివరించారు. కాగా బంఖేడి ప్రాంతానికి చెందిన రూప్ సింగ్ అనే వ్యక్తి తాను అటవి గుండా ప్రయాణిస్తుండగా.. అద్భుతమైన దైవశక్తి తనను ఇప్ప చెట్టు వైపుకు లాగిందని.. జోరుగా నయాగావ్‌లో ప్రచారం చేశాడని ఓ పోలీసు అధికారి చెప్పారు. రాష్ట్ర రాజధాని భోపాల్‌కు దక్షిణంగా 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో అనూహ్యంగా నెల రోజుల నుంచి జనాలు గుంపులు కడుతున్నారని.. దీంతో అక్కడ ఒక నెల వ్యవధిలోనే అకస్మాత్తుగా 400కు పైగా పూజ సామాగ్రిని అందించే షాపులు పుట్టుకొచ్చాయని విషయాన్ని మీడియా ముందు వెల్లడించారు. నయాగావ్‌లో ఉద్రిక్త పరిస్థితులకు తెరదీసిన కారణాలేమిటో ఇంకా తెలియరాలేదని.. పోలీసులపై దాడి విషయమై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. అయితే అక్కడి షాపులను పాలకవర్గం ఇప్పటికే తొలగించిందని.. కుప్పలు తెప్పలుగా వస్తున్న జన సమూహాన్ని క్రమబద్దికరించే ప్రయత్నంలో పోలీసుల పైకి దాడికి దిగారన్నారు. అడవిలోకి ప్రవేశం కల్పించడంపై పోలీసులు, గ్రామస్తుల మధ్య తరచు వాగ్వాదం జరుగుతుండేదని తెలిపారు. పరిస్థితి తమ చేయి దాటిందని.. వారిని నిలువరించేందుకు బారికేడ్లు ఏర్పాటు చేసినా.. కొత్త మార్గాల్లో అడవిలోకి చొరబడి వెళుతున్నారని పోలీసు అధికారులు అసహనం వ్యక్తం చేశారు. పోలీసులపై దాడి జరగడంతో ఇప్పటికైనా ఈ సమస్యకు పరిష్కారం కనుగొని పరిస్థితులను చక్కదిద్దేందుకు అక్కడి పాలకవర్గం సరియైన ప్రణాళికతో ముందుకు వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఇప్ప.. కాసుల కుప్ప!
- ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించనున్న ప్రభుత్వం - పువ్వుతో నూనె, హల్వా, లడ్డూ, కేక్ తయారీ - లీటరు ఇప్పనూనె రూ.100 పైనే.. - ఒడిశా తరహాలో వినూత్న ఉత్పత్తులకు శ్రీకారం చుట్టే యత్నాలు - ప్రణాళికలు రచిస్తున్న ట్రైఫెడ్ సాక్షి ప్రతినిధి, వరంగల్: ఇప్పపువ్వంటే ఇప్పటిదాకా సారా మాత్రమే గుర్తొచ్చేది! కానీ ఇకపై ఇప్ప నూనె, ఇప్ప హల్వా, ఇప్ప లడ్డూ, ఇప్ప కేక్ కూడా గుర్తుకువస్తాయి. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఇప్పతో అటవీ ఉత్పత్తుల తయారీని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని భారతీయ గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమాఖ్య(ట్రైఫెడ్) ఇప్పటికే ఇప్పపువ్వు సేకరణకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తోంది. ఇప్ప పువ్వు సేకరణతోపాటు ఇప్ప ఆకులు, ఇప్ప నూనె, హల్వా, లడ్డూ, కేక్, బెరడుకు మార్కెటింగ్ పెంచేందుకు ప్రయత్నిస్తోంది. గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉండే ఒడిశాలో ప్రస్తుతం ఇప్పనూనెతోపాటు ఇప్ప లడ్డూ, ఇప్ప హల్వా వంటి ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్నారు. ఆ రాష్ట్రంలోని ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి ట్రైఫెడ్ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మన రాష్ట్రంలోనూ ఇప్ప ఉత్పత్తుల మార్కెటింగ్‌ను పెంచేందుకు ట్రైఫెడ్ కార్యక్రమాలు చేపడుతోంది. ఖమ్మం జిల్లా చింతూరు కేంద్రంగా పనిచేస్తున్న అసోసియేషన్ ఫర్ సోషల్ అండ్ హ్యూమనైజ్ యాక్షన్(ఆశా) సహకారంతో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఒక చెట్టు నుంచి 80 కిలోల విత్తనాలు ట్రైఫెడ్ సహకారంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఇప్ప నూనె ఉత్పత్తి చేస్తున్నారు. మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైనదిగా గిరిజనులు చెపుతున్న ఈ నూనెకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీపారాధనకు ఉపయోగించే ఇప్పు నూనెకు లీటరు రూ.100 పైనే ధర పలుకుతోంది. చర్మ, కేశాల సంరక్షణకు, కీళ్ల నొప్పులకు, సబ్బుల తయారీకి కూడా దీన్ని వినియోగిస్తారు. జూన్, జూలైలో ఇప్పకాయలు పండి విత్తనాలు ఏర్పడుతాయి. ఒక చెట్టు ఏటా 80 కిలోల వరకు విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. విత్తనాలలో 35 శాతం నూనె, 14 శాతం ప్రొటీన్లు ఉంటాయి. పండ్లు పక్వానికి వచ్చిన తర్వాత కింద పడతాయి. వీటిని గిరిజనులు సేకరించి వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. అయితే మంచి ధర కల్పించేందుకు ట్రైఫెడ్ వంటి సంస్థలు గిరిజనుల నుంచి ఈ గింజలను సేకరిస్తున్నాయి. గింజల నుంచి పప్పులను తీసేందుకు గిరిపుత్రులు ఎక్కువ కష్టపడుతున్నారు. రాళ్లతో గింజను పగులగొట్టి పప్పులను తీస్తున్నారు. ఇది శ్రమతో కూడుకున్నది కావడంతో ప్రత్యేకంగా రూపొందించిన యంత్రాన్ని ట్రైఫెడ్ సహకారంతో గిరిజనులకు పంపిణీ చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. పువ్వులో ఔషధ గుణాలు! ఇప్ప పూలు, గింజల నుంచి తీసే నూనెలో ఔషధ, పోషక గుణాలు ఉన్నాయని జాతీయ పోషకాహార సంస్థ అధ్యయనంలో తేలిందని ట్రైఫెడ్ చెబుతోంది. బాలింతలకు ఆరోగ్యాన్ని ఇవ్వడంతోపాటు శారీరక బలహీనత నివారించే గుణాలు వీటిలో ఉన్నాయని పేర్కొంటోంది. 30 ఏళ్ల వయసున్న ఇప్ప చెట్టు సగటున 150 కిలోల పూలను ఉత్పత్తి చేస్తుంది. మట్టి అంటకుండా ఈ పూలను సేకరించి నిల్వ చేస్తారు. అనంతరం వీటి నుంచి పంచదార పాకం చేసి దాంతో బిస్కెట్, చాక్లెట్, జామ్, కేక్‌లను తయారు చేస్తారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహించిన పరిశోధనలో ఢిల్లీకి చెందిన డాక్టర్ ఎస్.ఎన్.నాయక్ ఈ ప్రక్రియపై పేటెంట్ కోసం కూడా దరఖాస్తు చేశారు. ట్రైఫెడ్-ఆశా సంస్థల ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలంలో 20 గ్రామాల్లో, వరంగల్ జిల్లా ఏటూరు నాగారం, మంగపేట మండలాల్లోని ఐదు చొప్పున గ్రామాల్లో ఇప్ప పువ్వు సేకరణ కార్యక్రమం అమలవుతోంది.